టెన్నిస్ లో మరో యువ కెరటం
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ చరిత్రలో మరో యువ కెరటం వచ్చి చేరింది. ఫెనెస్టా ఓపెన్ లో భాగంగా ఇక్కడ ఆర్కే ఖన్నా స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఎన్ శ్రీరామ్ బాలాజీ సరికొత్త జాతీయ చాంపియన్ గా అవతరించాడు. టాప్ సీడ్ గా బరిలోకి దిగిన బాలాజీ తుది పోరులో సెకెండ్ సీడ్ విష్ణు వర్ధన్ ను బోల్తా కొట్టించాడు. హోరాహోరీగా సాగిన పోరులో బాలాజీ 7-5, 6-3 తేడాతో విష్ణు వర్ధన్ పై గెలిచాడు. దీంతో 2016 లో జరిగే ఢిల్లీ ఓపెన్ లో బాలాజీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది.
గత ఆరు సంవత్సరాల నుంచి జాతీయస్థాయిలో ఆడుతున్న బాలాజీ చాంపియన్ గా నిలవాలన్న కలను ఎట్టకేలకు సాకారం చేసుకున్నాడు. ఇప్పటికే తన సహచరుడు వీఎమ్ రంజిత్ తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ ను సాధించిన బాలాజీ.. సింగిల్స్ లో కూడా తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా మహిళల సింగిల్స్ టైటిల్ ను డిఫెండింగ్ చాంపియన్ పెర్నా బాంబ్రీ నిలబెట్టుకుంది. తుది సమరంలో సమితా సాయి చమర్తిని కంగుతినిపించి టైటిల్ ను కాపాడుకుంది.