చెన్నై స్మాషర్స్ జోరు
5–0తో బెంగళూరు బ్లాస్టర్స్‌పై ఘనవిజయం
ముంబై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో చెన్నై స్మాషర్స్ జోరు ప్రదర్శించింది. తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ చేతిలో 3–4తో ఓడిన ఆ జట్టు మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు బ్లాస్టర్స్‌ను 5–0 తేడాతో చిత్తు చేసింది. రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్ మినహా మిగతా నాలుగు మ్యాచ్‌లను ఆ జట్టు సొంతం చేసుకుంది. ముందుగా పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 11–8, 11–5తో సౌరభ్ వర్మపై విజయం సాధించాడు. ఆ తర్వాత తమ ‘ట్రంప్’ మ్యాచ్‌లో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు 12–10, 11–6తో చెంగ్ గాన్ యీని ఓడించింది. తొలి గేమ్‌లో చెంగ్ గాన్ కాస్త ప్రతిఘటించగలిగినా, రెండో గేమ్‌లో సింధు దూకుడు ముందు పూర్తిగా తలవంచింది. ఆ తర్వాత మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. చివరకు ఇందులోనూ చెన్నైదే పైచేయి అయింది.
గాబ్రియెలా అడ్‌కాక్–క్రిస్ అడ్‌కాక్ జంట 11–6, 8–11, 15–14 తేడాతో అశ్విని పొన్నప్ప–యూ యోన్ జోడీపై విజయం సాధించింది. దాంతో స్మాషర్స్ ఆధిక్యం 3–0కు పెరిగింది. ఈ దశలో రెండో పురుషుల సింగిల్స్‌లో విక్టర్ అక్సెల్‌సన్ బెంగళూరుకు ఊరటనందించాడు. విక్టర్ 11–7, 11–13తో టామీ సుగియార్తోపై గెలుపొందాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా సాధించిన ఒక పాయింట్‌ను కూడా బ్లాస్టర్స్ ఆ తర్వాత కోల్పోయింది. పురుషుల డబుల్స్ ఆ టీమ్ ‘ట్రంప్’గా బరిలోకి దిగిన సుంగ్ హున్ కో–యూ యోన్ తీవ్రంగా పోరాడినా... చివరకు 7–11, 11–7, 11–13 స్కోరుతో క్రిస్ అడ్‌కాక్–మ్యాడ్స్ పీలర్ చేతిలో పరాజయం పాలయ్యారు. దాంతో 5–0తో స్మాషర్స్ పోరును ముగించింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్‌తో ముంబై రాకెట్స్ ఆడుతుంది.