
న్యూఢిల్లీ: తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్న ఢిల్లీ నగరంలో మ్యాచ్ నిర్వహణకు వచ్చే ముప్పేమీ లేదని బంగ్లాదేశ్ కోచ్ రసెల్ డొమింగో అన్నారు. ‘వాతావరణం ప్రతికూలమే అయినా... ప్రాణాలు పోయేంత కష్టమేమీ లేదు. ఇది కేవలం మూడు గంటల ఆటే. మ్యాచ్ సజావుగానే జరుగుతుంది. కళ్లకు, గొంతుకు కాస్త ఇబ్బంది కలగొచ్చేమో కానీ అంతకుమించిన ముప్పేమీ ఉండదు’ అని అన్నారు. గతంలో ఇక్కడ శ్రీలంకకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందన్న సంగతి తెలుసని, బంగ్లాదేశ్‌లోనూ వాతావరణ కాలుష్యం ఉంటుందని చెప్పారు. ఇదేమీ తీవ్రంగా పరిశీలించాల్సిన అంశం కానేకాదని... ఆటగాళ్లు మ్యాచ్‌పై దృష్టి పెడితే సరిపోతుందని అన్నారు. షకీబ్ సస్పెన్షన్ ఉదంతం జట్టుపై ప్రభావం చూపుతుందని కోచ్ అంగీకరించారు. స్టార్ ఆటగాడు కీలకమైన సిరీస్‌కు లేకపోవడం లోటేనన్నారు.