కోల్‌కతాలోనే తొలి డే నైట్‌ టెస్టు | Bangladesh Ready To Play Pink Ball Match With India | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలోనే తొలి డే నైట్‌ టెస్టు

Published Wed, Oct 30 2019 3:04 AM | Last Updated on Wed, Oct 30 2019 5:14 AM

Bangladesh Ready To Play Pink Ball Match With India - Sakshi

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆలోచన కార్యరూపం దాల్చనుంది. ఇక భారత్‌లో టెస్టు క్రికెట్‌ కొత్త ‘కాంతు’లీననుంది. సంప్రదాయ ఆటను ఇన్నాళ్లు పగటిపూటే చూశాం.ఇప్పుడు రాత్రి కూడా వీక్షించనున్నాం. భారత్‌ ఆడబోయే, భారత్‌లో జరగబోయే తొలి డేనైట్‌ టెస్టుకు గంగూలీ సొంత నగరం కోల్‌కతాలోని విఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం వేదిక కానుండటం మరో విశేషం.ఈ మేరకు గంగూలీ ప్రతిపాదనకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అంగీకరించింది. భారత్‌తో డే నైట్‌ టెస్టు ఆడేందుకు తాము సిద్ధమేనని ప్రకటించింది. ఫలితంగా వచ్చే నెలలో భారత్, బంగ్లాదేశ్‌ ఖాతాలో తొలి డే నైట్‌ టెస్టు చేరనుంది.

కోల్‌కతా: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఎప్పుడో డే నైట్‌ టెస్టులు ఆడేశాయి. కానీ టెస్టుల్లో నంబర్‌వన్‌ జట్టు భారత్‌ మాత్రం ఇప్పటిదాకా ఫ్లడ్‌లైట్ల మధ్య ఐదు రోజుల ఆట ఆడలేదు. ఇప్పుడు టీమిండియా కూడా రూటు మార్చుకుంది. డే నైట్‌కు సై అంది. దీంతో వచ్చే నెలలోనే భారత గడ్డపై కోహ్లి సేన ఆడే డే నైట్‌ టెస్టును ఎంచక్కా చూసేయొచ్చు. ఇదంతా బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సంకల్పం వల్లే సాకారమవుతోంది.

అతను అధ్యక్షుడే... కానీ 9 నెలలే ఆ పదవిలో ఉంటాడు. అందుకేనేమో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే నాయకుడు కోహ్లిని ‘పింక్‌బాల్‌ క్రికెట్‌’కు ఒప్పించడంతోనే తన పట్టుదల ఏపాటిదో చేతల ద్వారా చెప్పకనే చెప్పాడు. ఆ వెంటే బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ)తోనూ సంప్రదింపులు మొదలుపెట్టాడు. ప్రపంచంలోనే ధనవంతమైన క్రికెట్‌ బోర్డు కోరితే ఎవరు మాత్రం కాదంటారు! అందుకనే బీసీబీ కూడా సై అంది.

భారత క్రికెట్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌కు విశేషమైన చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ చరిత్రలో మరో పేజీ పింక్‌బాల్‌తో జత కాబోతోంది. నవంబర్‌ 22 నుంచి 26 వరకు భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగే రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌బాల్‌తో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ‘బీసీబీ పింక్‌బాల్‌ టెస్టుకు అంగీకరించింది. ఇది సానుకూల పరిణామం. టెస్టు క్రికెట్‌కు అవసరమైన మార్పు ఇది. నేను, నా బృందం ఇలాంటి ఆట కోసం పరితపించాం. కొత్త తరహా టెస్టుకు సై అన్న కెప్టెన్‌ కోహ్లికి కూడా థ్యాంక్స్‌’ అని గంగూలీ అన్నాడు.  నిజానికి చాన్నాళ్ల క్రితమే దేశవాళీ క్రికెట్‌లో పింక్‌బాల్‌ క్రికెట్‌ ఆడించాలని అప్పటి క్రికెట్‌ కమిటీ చైర్మన్‌ అయిన గంగూలీ సిఫార్సు చేశాడు.

అతని ప్రతిపాదన వల్లే దులీప్‌ ట్రోఫీలో వరుసగా 2016–17, 2017–18, 2018–19 మూడు సీజన్లు డేనైట్‌ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించారు. కానీ ఈ సీజన్‌లో మళ్లీ పాత పద్ధతినే అవలంభించి ఎర్ర బంతితో మ్యాచ్‌లను నిర్వహించారు. కోల్‌కతా డే నైట్‌ టెస్టు మ్యాచ్‌లో ఆట మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతుందని... 68 వేల సామర్థ్యమున్న స్టేడియంలో టికెట్ల ధరను కనిష్టంగా రూ. 50 నుంచి విక్రయిస్తామని ‘క్యాబ్‌’ సెక్రటరీ అవిషేక్‌ దాల్మియా తెలిపాడు.

ఈ నాలుగేళ్లలో పదకొండే! 
డే నైట్‌ టెస్టు ముచ్చట ఇప్పటిది కాదు. నాలుగేళ్ల క్రితమే 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య పింక్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. కానీ ఈ నాలుగేళ్లలో కేవలం 11 మ్యాచ్‌లే జరిగాయి. అయితే అన్నింట్లోనూ ఫలితాలు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement