
పదేళ్ల తర్వాత... మళ్లీ పసిడి
►జావెలిన్ త్రోలో స్వర్ణం నెగ్గిన బార్బరా స్పొటకోవా
►ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
గెలవాలనే బలీయమైన కాంక్ష ఉంటే వయసు ఒక అంకె మాత్రమేనని చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్పొటకోవా నిరూపించింది. ఒకవైపు యువ క్రీడాకారిణులు తెరపైకి దూసుకొస్తున్నా... అవేమీ పట్టించుకోకుండా 36 ఏళ్ల స్పొటకోవా తన ప్రదర్శనతో తన ప్రత్యేకతను చాటుకుంది. పదేళ్ల విరామం తర్వాత మరోసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకొని ఔరా అనిపించింది.
లండన్: అనుభవం ఉంటే అంతర్జాతీయ వేదికపై ఎప్పుడైనా అద్భుత ఫలితాలు సాధించవచ్చని చెక్ రిపబ్లిక్ జావెలిన్ త్రోయర్ బార్బరా స్పొటకోవా రుజువు చేసింది. సరిగ్గా పదేళ్ల విరామం తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో 36 ఏళ్ల స్పొటకోవా ఈటెను 66.76 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించింది. 2007 ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన స్పొటకోవా పదేళ్ల తర్వాత మళ్లీ విశ్వవిజేతగా నిలువడం విశేషం. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచిన ఆమె, 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ‘లండన్ ఒలింపిక్ స్టేడియం నాకెంతో కలిసొస్తుంది. ఐదేళ్ల క్రితం ఇదే వేదికపై స్వర్ణం నెగ్గాను. మళ్లీ ఇదే వేదికపై అలాంటి ఫలితాన్ని పునరావృతం చేశాను’ అని స్పొటకోవా వ్యాఖ్యానించింది. లింగ్‌వి లీ (చైనా–66.25 మీటర్లు) రజతం, హుయ్‌హుయ్ లియు (చైనా–65.26 మీటర్లు) కాంస్యం గెలిచారు.
నికెర్క్ నిలబెట్టుకున్నాడు...
మరోవైపు పురుషుల 400 మీటర్ల విభాగంలో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ వేడ్ వాన్ నికెర్క్ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 43.98 సెకన్లలో అతను గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. స్టీవెన్ గార్డ్‌నర్ (బహమాస్–44.41 సెకన్లు) రజతం గెల్చుకోగా... అబ్దుల్లా హరూన్ (ఖతర్–44.48 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నాడు. పురుషుల పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో సామ్ కెండ్రిక్స్ (అమెరికా) విజేతగా నిలిచాడు. అతను 5.95 మీటర్ల ఎత్తుకు ఎగిరి పసిడి పతకాన్ని నెగ్గాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్‌లో కిప్‌రుటో (కెన్యా–8ని:14.12 సెకన్లు), పురుషుల 800 మీటర్ల ఈవెంట్‌లో పియరీ అంబ్రోసి బాసి (ఫ్రాన్స్–1ని:44.67 సెకన్లు) స్వర్ణ పతకాలను సాధించారు.
మరోవైపు పురుషుల జావెలిన్ త్రోలో గురువారం క్వాలిఫయింగ్ పోటీలు జరగనున్నాయి. భారత ఆశాకిరణం నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నాడు. 32 మంది పోటీపడుతున్న క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో టాప్–12లో నిలిచిన వారు ఫైనల్‌కు చేరతారు.