ప్యారిస్ ఒలింపిక్స్-2024లోస్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్లో.. నీరజ్ ఈ సీజన్‌లోనే అత్యుత్తమగా ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. అయితే.. ఆది నుంచి నీరజ్‌కు గట్టిపోటీగా భావించిన పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ అనూహ్య రీతిలో బల్లాన్ని ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి సంచలనం సృష్టించాడు.
ఒలింపిక్ రికార్డు
తన అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ రికార్డు నెలకొల్పి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫలితంగా రెండో స్థానానికే పరిమితమైన నీరజ్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. అయితే, చాలా మంది వీరిద్దరి మధ్య పోటీని ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌గా అభివర్ణించారు. కానీ.. ఇలాంటి పోలికలు సరికావని అంటున్నారు నీరజ్ చోప్రా తల్లిదండ్రులు.
మా బిడ్డ లాంటివాడే
అర్షద్‌ను కూడా తమ బిడ్డలాగే భావిస్తామని.. వారిద్దరు పోటీపడుతుంటే చూడముచ్చటగా ఉంటుందని ప్రేమను చాటుకున్నారు. ‘‘ఫైనల్ చూస్తున్నపుడు మేమేమీ కంగారుపడలేదు. మా పిల్లలు అక్కడ పోటీపడినట్లుగా అనిపించింది. మనకు స్వర్ణం వచ్చిందా.. రజత పతకం వచ్చిందా అన్నది ముఖ్యం కాదు. అక్కడున్నవాళ్లంతా ఎంతో కష్టపడి వచ్చినవారే.
అయితే, వారిలో వీళ్లిద్దరు అద్భుతంగా ఆడారు’’ అని నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి నీరజ్, అర్షద్ నదీమ్‌పై ప్రశంసలు కురిపించారు. తమ కుమారుడు గాయాల పాలయ్యాడని.. అతడు సాధించిన ఈ వెండి పతకం కూడా పసిడితో సమానమని పేర్కొన్నారు.
ఎలాంటి శత్రుత్వం లేదు
ఇక నీరజ్ వాళ్ల ఆంటీ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ దాయాదుల పోరు అనే చర్చకు తావులేదు. ఇది కేవలం ఆటగాళ్ల మధ్య పోటీ మాత్రమే. నదీమ్‌తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని నీరజ్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
నిజానికి అర్షద్ నదీమ్.. కాంపిటీషన్లకు వెళ్తున్నపుడు మేము అతడి కోసం కూడా ప్రార్థిస్తాం. మీడియా వేదికగా నదీమ్ తల్లిదండ్రులకు మేము ఈ విషయం చెప్పేందుకు సంతోషిస్తున్నాం. అతడు ఎల్లప్పుడూ బాగుండాలని మేము కోరుకుంటాం’’ అని పేర్కొన్నారు.
ఆ రెండు కలిసి వచ్చాయి
అదే విధంగా.. నీరజ్ చోప్రా తండ్రి సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘అర్షద్ నదీమ్ కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఆటగాడు. అతడు పడ్డ కష్టానికి ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఫలితం దక్కింది. దీనిని మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌గా చూడకూడదు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఆటగాళ్లు అక్కడ పోటీపడ్డారు. ఈరోజు నదీమ్‌ది. హార్డ్‌వర్క్‌తో పాటు అదృష్టం కూడా అతడికి కలిసి వచ్చింది.
ఫలితాలు కూడా ఈ రెండింటి కలయికగానే ఉంటాయి’’ అని అన్నారు. ఎన్డీటీవీతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఓ ఆటగాడి తల్లిదండ్రులుగా తాము ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని.. ఒక్కోసారి కొడుకు కళ్లారా చూసుకునే సమయం కూడా ఉండదని ఉద్వేగానికి లోనయ్యారు.
చదవండి: #Arshad Nadeem: కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా
Comments
Please login to add a commentAdd a comment