అడిలైడ్ స్టేడియం
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో ఇకపై డే–నైట్ టెస్టులు తరచూ జరిగే అవకాశాలున్నాయి. అందరికంటే ఆలస్యంగా ‘పింక్’ బాల్ టెస్టు ఆడిన భారత్ వచ్చే సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. విదేశాల్లో తొలి డే–నైట్ టెస్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పచ్చజెండా ఊపింది. ఆదివారం బీసీసీఐ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా పింక్ బాల్ టెస్టులు, భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ), సభ్య సంఘాలకు నిధుల విడుదల అంశాలపైనే చర్చించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఒకటి... అలాగే స్వదేశంలో మరొక ‘గులాబీ’ బంతులాట ఆడేందుకు బోర్డు ‘సై’ అంటోంది. (నయా పోస్ట్... సుందర్ దోస్త్... )
భారత పర్యటనకు వచ్చే ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మితమైన, ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం మొతెరా మైదానంలో డేనైట్ మ్యాచ్ నిర్వహించనుంది. అంతకంటే ముందు భారత్ 2020–21 సీజన్‌లో ఆసీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన షెడ్యూల్ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎర్ల్ ఎడింగ్స్ గత నెల భారత్‌కు వచ్చి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో సమావేశమయ్యారు. తమ పర్యటనలో రెండు డే–నైట్ టెస్టులు ఆడాలని కోరగా గంగూలీ మాత్రం ఒకదానికే మొగ్గుచూపారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పెర్త్ లేదంటే అడిలైడ్ మైదానంలో డే–నైట్ టెస్టు మ్యాచ్ జరిగే అవకాశముంది. (మయాంక్, పంత్ ఫిఫ్టీల ‘ప్రాక్టీస్’)
ఆసీస్‌లో ‘పింక్ బాల్’ టెస్టు ఖరారైందని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని గంగూలీ తెలిపారు. ఆటగాళ్ల శ్రేయస్సు కోసం ఏర్పాటైన ఐసీఏ సంస్థాగత నిర్మాణం కోసం బోర్డు రూ. 2 కోట్లు మంజూరు చేసింది. అలాగే వివిధ రాష్ట్ర సంఘాలకు ప్రకటించిన నిధుల్ని కూడా విడుదల చేయాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. మే చివరి వారంలో ఐపీఎల్ ముగిశాక శ్రీలంకలో భారత్ పర్యటించనుందని బీసీసీఐ తెలిపింది. శ్రీలంకలో భారత్ మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment