ఫిక్సింగ్ కేసులో పాక్ అంపైర్పై వేటు
2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ వివాదాస్పద అంపైర్ అసద్ రవూఫ్పై బీసీసీఐ వేటు వేసింది. ఐదేళ్ల పాటు అతనిపై నిషేధం విధించింది. రవూఫ్పై ఆరోపణలు రావడంతో అదే ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీ నుంచి అతనికి ఐసీసీ ఉద్వాసన పలికింది.
2013 ఐపీఎల్ సీజన్లో రవూప్ 13 మ్యాచ్లకు అంపైర్గా వ్యవహరించాడు. ఈ సీజన్లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో రవూఫ్ ప్రమేయమున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో క్రికెటర్లు శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్ పై బీసీసీఐ ఇదివరకే చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. రవూఫ్ పాత్ర ఉన్నట్టు తేలడంతో బీసీసీఐ అతనిపైనా చర్యలు తీసుకుంది. రవూఫ్ మరో వివాదంలో కూడా ఇరుకున్నాడు. తనను పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని, మోసం చేశాడని గతంలో ఓ మోడల్ ఆరోపించింది.