సెహ్వాగ్ కు బీసీసీఐ సన్మానం
న్యూఢిల్లీ: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను బీసీసీఐ ఈ ఉదయం సన్మానించింది. సెహ్వాగ్ కు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ జ్ఞాపిక బహూకరించి సత్కరించారు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు ఈ కార్యక్రమం నిర్వహించారు. సొంత గడ్డపై బీసీసీఐ సన్మానం అందుకోవడం పట్ల సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశాడు. సెహ్వాగ్ ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సెహ్వాగ్ సన్మానం గురించి బీసీసీఐ ఆలస్యంగా వర్తమానం పంపడంతో ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. 'వీరూ సన్మానం గురించి బీసీసీఐ నుంచి మెయిల్ వచ్చింది. అధ్యక్షుడు, లేదా కార్యదర్శి ఎవరూ సన్మానిస్తారో మాకు తెలియదు. డీడీసీఏ మాత్రం ఇందులో భాగం పంచుకోదు. ఎందుకంటే బోర్డు మాకు చాలా తక్కువ సమయం ఇచ్చింది. మేం సిద్ధం కావడానికి ఇది సరిపోదు. ఢిల్లీకి ఎనలేని సేవలందించిన సెహ్వాగ్‌ను మరోసారి ఘనంగా సత్కరిస్తాం' అని డీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతన్ చౌహన్ వెల్లడించారు.