న్యూఢిల్లీ: క్రికెటర్ యూసుఫ్ పఠాన్ డోపింగ్‌లో పట్టుబడటం... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐదు నెలల నిషేధం విధించడం... మరో ఐదు రోజుల్లో ఆ నిషేధం ముగియనుండటం... అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా అతనిపై బీసీసీఐ విధించిన సస్పెన్షన్ ఈ నెల 14తో ముగియనుంది. క్రికెటర్‌కు నిర్వహించిన డోప్ టెస్టుల నుంచి ఫలితాల నిర్ధారణ తదనంతర విచారణ, చర్య దాకా అంతా గోప్యత పాటించింది బీసీసీఐ. గత మార్చి 16న అతడి నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించారు. అయితే ఈ ఎపిసోడ్‌లో ఫలితాలు ఆలస్యంగా రావడంతోపాటు, యూసుఫ్ పఠాన్ ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడకపోవడంతో బోర్డు కాస్త మెతక వైఖరిని అవలంబించింది. గతేడాది నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషిద్ధ ఉత్ప్రేరకం ‘టెర్బుటలైన్’ తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలోని మెడిసిన్. అయితే దీన్ని యూసుఫ్ దగ్గుమందు ద్వారా తీసుకున్నాడు. నేరుగా కాకుండా అస్వస్థతలో తెలియక తీసుకోవడంతో అతనికి నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దీనిపై అతను ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన బీసీసీఐ స్వల్పకాలిక నిషేధంతో సరిపెట్టింది. మొత్తంమీద ఐపీఎల్ వేలానికి ముందు యూసుఫ్ పఠాన్‌కు ఇది సాంత్వన చేకూర్చే అంశం. ఎందుకంటే అతను 2012 నుంచి జాతీయ జట్టులో లేడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నాడు. దీంతో అతని ఐపీఎల్ ప్రయోజనానికి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందిలేదు.
మరి ఎప్పట్నించి ఈ నిషేధం?
టి20 ప్రపంచకప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011) గెలిచిన భారత జట్టులో సభ్యుడైన యూసుఫ్‌కు విధించిన 5 నెలల సస్పెన్షన్ ఐదు రోజుల్లో (ఈ నెల 14) ముగుస్తుంది సరే కానీ... ఎప్పుడు మొదలైందనేది అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే అతను అక్టోబర్‌లో బరోడా తరఫున మధ్యప్రదేశ్, ఆంధ్ర జట్లతో జరిగిన రంజీ పోటీల్లో ఆడాడు. ఈ లెక్కన ఐదు నెలల నిషేధం సరిపోదు. అయితే టెస్టు ఫలితాలు నిజానికి గత ఆగస్టు లోపే రావాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలరీత్యా అవి రాలేదు. దీంతో ఫలితాల ఆలస్యాన్ని క్రికెటర్‌కు అపాదించకూడదనే ఉద్దేశంతో పాటు... క్రికెటర్ కావాలని తీసుకున్న ఉత్ప్రేరకం కాదు కాబట్టి బోర్డు నిషేధ కాలాన్ని సడలించింది. అతనిపై అక్టోబర్ 28 నుంచి నిషేధాన్ని విధించినప్పటికీ ఈ కాలాన్ని ఫలితాలు రావాల్సిన ఆగస్టు 15 నుంచి పరిగణించింది. బోర్డు విచక్షణాధికారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
►2 డోపింగ్‌లో పట్టుబడిన రెండో భారతీయ క్రికెటర్ యూసుఫ్ పఠాన్. గతంలో ఢిల్లీ పేస్ బౌలర్ ప్రదీప్ సాంగ్వాన్ 2013 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతూ డోపింగ్ పరీక్షల్లో దొరికి 18 నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. కోహ్లి సారథ్యంలో 2008లో అండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ప్రదీప్ సాంగ్వాన్ సభ్యుడిగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment