
కుంబ్లేకు రూ. కోటి చెల్లింపు
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకు వేతన బకాయి కింద కోటి రూపాయలను బీసీసీఐ చెల్లించేసింది.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకు వేతన బకాయి కింద కోటి రూపాయలను బీసీసీఐ చెల్లించేసింది. ప్రతీ నెల రూ.25 లక్షలకు మించి చెల్లింపులను బీసీసీఐ తమ అధికారిక వెబ్‌సైట్‌లో చూపిస్తుంటుంది. మే, జూన్‌లకు సంబంధించి కుంబ్లేకు రూ.48.75 లక్షల చొప్పున ప్రొఫెషనల్ ఫీజు చెల్లించినట్టు బోర్డు పేర్కొంది. అలాగే పేసర్ ఇషాంత్ శర్మకు కూడా దాదాపు రూ. కోటి చెల్లించింది. మహిళల ప్రపంచ క్రికెట్‌లో రన్నరప్‌గా నిలిచిన అమ్మాయిలకు రూ.45 లక్షల చొప్పున విడుదల చేయడంతో పాటు మాజీ క్రికెటర్లు వివేక్ రజ్దాన్, శరణ్‌దీప్ సింగ్, సలీల్ అంకోలా, రితిందర్ సింగ్ సోధి, యోగ్‌రాజ్ సింగ్, రాబిన్ సింగ్‌లకు ఒకేసారి ప్రతిఫలం కింద రూ.35 లక్షల చొప్పున అందించింది.
కీలక అంశాలపై నేడు చర్చ
పలు కీలక విషయాలను చర్చించేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులతో నేడు పరిపాలక కమిటీ (సీఓఏ) సమావేశం కానుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెడితే భారత్ వైఖరితో పాటు దేశవాళీ క్రికెటర్ల వేతనాల పెంపు అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి. అంతేకాకుండా ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వెలుగుచూసిన ఆర్థిక అవకతవకలపై డెలాయిట్ సంస్థ ఇచ్చిన నివేదికతో పాటు తొమ్మిది అంశాలు అజెండాలో ఉన్నాయి. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముందునుంచీ కూడా బీసీసీఐ ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఆసియా క్రీడల్లో క్రికెట్ ఉన్నా బీసీసీఐ తమ జట్టును పంపించడం లేదు. అలాగే 1998 కామన్వెల్త్ గేమ్స్‌కు కూడా దూరంగానే ఉంది. ఇక దేశవాళీ క్రికెట్‌లో వేతనాలకు సంబంధించి 2007 నుంచి ఎలాంటి సవరణ జరగలేదు. అంతేకాకుండా పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై కూడా సీఓఏ చర్చించనుంది. స్వదేశంలో జరగబోయే సిరీస్‌లకు వ్యాఖ్యాతల జాబితాపై ఆమోదం తెలపనున్నారు. కొంతకాలంగా బీసీసీఐ దూరం పెడుతున్న హర్షా భోగ్లేను ఈసారి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. అజహరుద్దీన్‌కు సంబంధించిన బకాయిల చెల్లింపుపై కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.