బీసీసీఐలో గంగూలీ మార్కు ‘ఆట’! | BCCI May Push For Longer Terms For Sourav Ganguly | Sakshi
Sakshi News home page

గంగూలీ పదవీ కాలం మూడేళ్లు కాబోతుందా?

Published Tue, Nov 12 2019 11:54 AM | Last Updated on Tue, Nov 12 2019 3:58 PM

BCCI May Push For Longer Terms For Sourav Ganguly - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సౌరవ్‌ గంగూలీ అప్పుడే తన మార్కు ‘ఆట’ను మొదలుపెట్టేశాడు. భారత క్రికెట్‌ జట్టు తొలిసారి డే అండ్‌ నైట్‌ టెస్టు ఆడటం ఒకటైతే, అలాగే కోట్లాది రూపాయిల ఖర్చుతో జరిగే ఐపీఎల్‌ వేడుకల్ని రద్దు చేయడం వంటి నిర్ణయాలు గంగూలీ తీసుకున్నాడు. అయితే గంగూలీ పదవీ కాలం తొమ్మిదినెలలే కావడంతో భారత క్రికెట్‌లో మార్పుకు అది సరిపోదని పాలకవర్గం భావిస్తోంది. కనీసం మూడేళ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉంటే భారత క్రికెట్‌ రూపు రేఖలు మార్చగలడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కానీ లోథా సంస్కరణలతో ఏర్పడిన బీసీసీఐ కొత్త రాజ్యాంగం గంగూలీ మూడేళ్లు కొనసాగేందుకు అనుమతించడంలేదు. బీసీసీఐలో ఎవరైనా సరే రెండుసార్లు వరుసగా (ఆరేళ్లు) రాష్ట్ర క్రికెట్‌ సంఘాలలోగానీ, బోర్డులో లేదా రెండింటిలోగానీ ఆఫీసు బేరర్లుగా వ్యవహరించుంటే ఆపై మూడు సంవత్సరాల విరామం తర్వాతే మళ్లీ పోటీ చేయాలి. దాంతో సౌరవ్‌ గంగూలీ బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) చీఫ్‌గా రెండోసారి బాధ్యతలు నిర్వర్తించడంతో అతడు కేవలం తొమ్మిది నెలలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండటానికి మాత్రమే వీలుంది.

ఈనేపథ్యంలో బీసీసీఐ రాజ్యాంగానికి సవరణలు చేయాలని కొత్త పాలకవర్గం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం 12 పాయింట్లతో బోర్డు అజెండా రూపొందించినట్లు సమాచారం. అందులో ముఖ్యమైనది బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు వచ్చే మూడేళ్లు పదవిలో కొనసాగేలా రాజ్యాంగానికి సవరణ చేయడమే. ఇందుకు రాష్ట్ర అసోషియేషన్‌లో మెజారిటీ సభ్యులు అందుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ సభ్యుల ఆమోదం తెలిపినా సుప్రీంకోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ పొందక తప్పదు. ఇవన్నీ సక్రమంగా జరిగితే గంగూలీ మూడేళ్ల పాటు బీసీసీఐ బాస్‌గా కొనసాగతాడు. కాగా, మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) డిసెంబరు 1న ముంబైలో జరగనుంది. ఈమేరకు అన్ని రాష్ట్ర సంఘాలకు బోర్డు కార్యదర్శి జై షా నోటీసులు పంపాడు. ఇందులో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement