ఇకనైనా మేలుకోవాలి! | BCCI measures should be taken to improve facilities | Sakshi
Sakshi News home page

ఇకనైనా మేలుకోవాలి!

Published Sun, Oct 15 2017 1:01 AM | Last Updated on Sun, Oct 15 2017 3:53 AM

BCCI measures should be taken to improve facilities

మూడు టి20ల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా 1–1తో సమంగా నిలిచిన స్థితిలో అనూహ్యంగా హైదరాబాద్‌ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే ఉప్పల్‌ మైదానంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దాదాపు 30 వేల మంది అభిమానులు పోటెత్తారు. మ్యాచ్‌ రోజు ఉదయం నుంచి కూడా వర్షం లేకపోవడంతో ఇక తమకు పరుగుల కనువిందే అని వారు భావించారు. కానీ సాయంత్ర మయ్యే సరికి అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. స్టేడియంలో చుక్క వర్షం పడకున్నా మ్యాచ్‌ రద్దు కావడం భారత క్రికెట్‌ ప్రేమికులను నిజంగా షాక్‌కు గురిచేసింది. బీసీసీఐ కోట్లాది నిధులను తమ రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు అందిస్తున్నా సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఇవి విఫలమవుతుండటం నిజంగా శోచనీయం. ముందు రోజు పడిన వర్షం కారణంగా ఏర్పడిన తడిని మర్నాడు రాత్రి వరకు కూడా ఏమీ చేయలేని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) వైఫల్యంపై అంతా దుమ్మెత్తి పోశారు. మరి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి..?  

సాక్షి క్రీడావిభాగం: హోరాహోరీగా సాగిన భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టి20ల సిరీస్‌కు ముగింపు నిజంగా ఎంత దారుణం. సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌కు హైదరాబాద్‌ వేదిక కావడంతో అభిమానుల ఉత్కంఠ తారస్థాయికి చేరింది. కానీ మైదానం తడిగా ఉందనే కారణంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. చివరికి ఆటగాళ్లను ముందుగా పంపేసి ఆ తర్వాత మ్యాచ్‌ రద్దు ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. 30 వేల మంది అభిమానుల సమక్షంలో మైదానంలో గర్వంగా తీసుకోవాల్సిన సిరీస్‌ ట్రోఫీని ఇరు జట్ల కెప్టెన్లు ఓ గదిలో పంచుకోవాల్సి వచ్చింది. దాదాపుగా అన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు ఏదైనా కారణాలరీత్యా మ్యాచ్‌ ఆగిపోతుందనే కారణంతో ముందు జాగ్రత్తగా బీమా చేయిస్తారు. ఈ మ్యాచ్‌కు కూడా చేయించినా నిజంగా ఈ ‘వాష్‌ అవుట్‌’ మ్యాచ్‌ బీమా క్లెయిమ్‌ చేసుకునేందుకు అర్హత ఉందా? సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో పాటు ఆధునికతను సంతరించుకోలేని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఈ నగుబాటుకు పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు తొలిసారిగా ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని హెచ్‌సీఏ అవమానకర రీతిలో పోగొట్టుకోవడంతో పాటు ఆర్థికంగానూ భారీ నష్టమే ఎదుర్కోనుంది. దాదాపు 30 వేల మంది అభిమానుల టిక్కెట్ల మొత్తాన్ని (దాదాపు రూ.4 కోట్లు) తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక మ్యాచ్‌ నిర్వహణ కోసం తెర వెనక భారీ హంగామా ఉంటుంది. వారందరి కృషి కూడా వృథానే అయ్యింది. ఈ మ్యాచ్‌ సంఘటన హెచ్‌సీఏ అధికారులకు ఒక గుణపాఠం కావాలి. ఇకనైనా వారు తేరుకొని భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ముందుగా ఐసీసీ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ రద్దయిన ఈ మూడో టి20 మ్యాచ్‌పై ఎలాంటి నివేదిక సమర్పిస్తారో వేచి చూడాలి. ఆయన నివేదికలో మ్యాచ్‌ నిర్వహణ సన్నాహాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అంశం ఉంటే మాత్రం బీసీసీఐతోపాటు హెచ్‌సీఏకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది.  

2015 అక్టోబరులో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మ్యాచ్‌ రోజు అంతగా వర్షం పడకపోయినా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆట సాధ్యపడలేదు. ఈ సంఘటన నుంచి గుణపాఠం నేర్చుకున్న బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (సీఏబీ) దిద్దుబాటు చర్యలు తీసుకుంది. మైదానం మొత్తం కప్పి ఉంచేందుకు ఇంగ్లండ్‌ నుంచి ప్రత్యేకంగా కవర్లు తెప్పించుకుంది. సౌరవ్‌ గంగూలీ సీఏబీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక ఈడెన్‌ గార్డెన్స్‌లో సౌకర్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. గతేడాది భారత్, పాక్‌ జట్ల మధ్య ప్రపంచకప్‌ టి20 మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు భారీ వర్షం కురిసింది. అయితే వర్షం తగ్గిపోయిన కొంతసేపటికే మైదానాన్ని ఆటకు సిద్ధం చేశారు.  

కేఎస్‌సీఏను ఆదర్శంగా తీసుకోవాలి
వర్షాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేకపోయినా అది ఆగిన కొద్ది సమయంలోనే మ్యాచ్‌ నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని క్రికెట్‌ సంఘాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌  సంఘాన్ని (కేఎస్‌సీఏ) ఆదర్శంగా తీసుకోవాలి. ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ డ్రైనేజీ పద్ధతి ఇక్కడే ఉందని చెప్పుకుంటారు. కేఎస్‌సీఏ ఆఫీస్‌ బేరర్లు ముందుచూపుతో బెంగళూరులోని తమ ప్రధాన స్టేడియంలో సబ్‌ఎయిర్‌ పద్ధతిని ఏర్పాటు చేశారు. క్రికెట్‌ స్టేడియాల్లో ఈ తరహా పద్ధతిని ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అమెరికా సాంకేతికత చాలా దేశాల్లోని గోల్ఫ్‌ కోర్సుల్లో ప్రధానంగా ఉపయోగిస్తుంటారు. అయితే రూ.4.5 కోట్లతో కాస్త విలువైనదే అయినా దీని పనితీరు అద్భుతంగా ఉంటుంది. మైదానం తడి కారణంగా మ్యాచ్‌ ఆలస్యం కావడం, రద్దు కావడం కానీ ఇక్కడ జరగదు. ఏడాదికి రూ.7 లక్షల వరకు నిర్వహణ వ్యయం అవుతుంది. వర్షం కారణంగా మైదానంలో నిలిచిన నీటిని మామూలు డ్రైనేజీ పద్ధతికన్నా 36 రెట్లు వేగంగా నీటిని తోడేస్తుంది. అంటే నిమిషానికి పది వేల లీటర్ల నీటిని బయటికి పంపుతుంది. దేశంలోని అన్ని క్రికెట్‌ స్టేడియాలు కూడా ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంటే కోట్లాది రూపాయల నష్టాన్ని కూడా అరికట్టవచ్చు. దీనికోసం వెంటనే క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీఏఓ) నిధులను విడుదల చేస్తే మంచిది. బీసీసీఐకి కోట్లాది రూపాయలను తెచ్చిపెడుతూ ప్రపంచంలోనే అత్యధిక ధనార్జన బోర్డుగా పేరు తెచ్చేందుకు కారణమవుతున్న క్రికెట్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా అభిమానులకు అందించడం ముఖ్యం. లేకుంటే ఇలా వర్షం పడని పరిస్థితిలో కూడా మ్యాచ్‌లు జరగకపోతే క్రికెట్‌ పరువు పోయినట్టే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement