న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కొచ్చి టస్కర్స్ రద్దు అంశంలో ఫ్రాంచైజీకి అనుకూలంగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆర్‌సీ లాహోటి ఇచ్చిన నివేదికపై అప్పీల్ చేస్తామని బీసీసీఐ వెల్లడించింది. బుధవారం జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చాలా మంది సభ్యులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీనిపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు.
2011లో ఒప్పంద నిబంధలు ఉల్లంఘించిందనే ఆరోపణలతో కొచ్చి ఫ్రాంచైజీని రద్దు చేసి బ్యాంక్ గ్యారంటీ కింద ఉన్న డబ్బును బీసీసీఐ తీసేసుకుంది. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు లాహోటిని మధ్యవర్తిగా నియమించారు. ఈ అంశంపై విచారణ జరిపిన లాహోటి రూ. 550 కోట్లను బీసీసీఐ.... కొచ్చికి చెల్లించాలని నివేదికలో పేర్కొన్నారు. అయితే డబ్బులు తీసుకునేందుకు తమకు ఆసక్తి లేదని ఇటీవల స్పష్టం చేసిన కొచ్చి వచ్చే ఐపీఎల్‌లో ఆడేందుకు అవకాశమివ్వాలని కోరినట్లు సమాచారం. చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ విలువను తక్కువ చేసి చూపడంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని శుక్లా తెలిపారు. ఈ విషయంలో చట్టపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు చాంపియన్స్ లీగ్ టి20 భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా బోర్డుల సమక్షంలోనే దీనిపై నిర్ణయం జరుగుతుందన్నారు. ఐపీఎల్‌లో ఆటగాళ్లను కొనసాగించడంపై మాట్లాడుతూ... ‘2017 నుంచి క్యాప్‌డ్ ప్లేయర్ల (భారత్)ను 4 నుంచి 2కు తగ్గించాలని అనుకుంటున్నాం. విదేశీ ఆటగాళ్లను ఇద్దరికే పరిమితం చేయాలనుకుంటున్నాం. అలాగే ముగ్గురు అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లను అనుమతిస్తాం. అయితే ఓవరాల్‌గా మొత్తం రిటెన్షన్ సంఖ్య ఐదుగురికి మించకూడదు’ అని శుక్లా పేర్కొన్నారు.
లాహోటి నివేదికను సవాలు చేస్తాం: బీసీసీఐ
Published Thu, Jul 9 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM