మరోసారి ‘సూపర్‌ కింగ్స్‌’ | The IPL has grown from eight to ten teams for the first time | Sakshi
Sakshi News home page

మరోసారి ‘సూపర్‌ కింగ్స్‌’

Published Fri, Mar 15 2019 4:00 AM | Last Updated on Fri, Mar 15 2019 4:00 AM

The IPL has grown from eight to ten teams for the first time - Sakshi

ఐపీఎల్‌ తొలిసారి ఎనిమిదినుంచి పది జట్లకు పెరిగింది. కొత్తగా పుణే వారియర్స్, కొచ్చి టస్కర్స్‌ కేరళ జట్లు వచ్చి చేరాయి. అయితే గత మూడు సీజన్ల ఫార్మాట్‌లాగే ప్రతీ జట్టు మరో జట్టుతో ఇంటా, బయట రెండేసి చొప్పున ఆడితే మ్యాచ్‌ల సంఖ్య ఏకంగా 94కు పెరిగే అవకాశం ఉండటంతో ఫార్మాట్‌లో కొన్ని మార్పులు చేశారు. పది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించి తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూప్‌లోని ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతూ ఒక్కో టీమ్‌ గరిష్ట మ్యాచ్‌లు 14కు మించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ షెడ్యూల్‌ చాలా కంగాళీగా మారిపోవడంతో అభిమానులు కూడా చాలా మ్యాచ్‌ల సమయంలో గందరగోళానికి గురయ్యారు. తొలిసారి నేరుగా సెమీ ఫైనల్, ఫైనల్‌ అర్హత కాకుండా ప్రస్తుతం ఉన్న తరహాలో ‘ప్లే ఆఫ్‌’ పద్ధతిని ప్రవేశపెట్టడం విశేషం. ఎన్ని మార్పులు జరిగినా ధోని టీమ్‌ జోరును మాత్రం ప్రత్యర్థులు అడ్డుకోలేకపోయారు. ఫలితంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో సారి విజేతగా నిలవగా, మూడేళ్లలో రెండో సారి ఫైనల్‌ చేరిన బెంగళూరు మళ్లీ రన్నరప్‌గానే సంతృప్తి పడింది.  

మళ్లీ వేలం... 
తొలి మూడు సీజన్లు ముగియడంతో  పాటు కొత్త జట్లు రావడంతో ఈ సారి మళ్లీ పూర్తి స్థాయి వేలం నిర్వహించడంతో పలు జట్లలో ఆటగాళ్లు మారిపోయారు. చెన్నై (ధోని, రైనా, విజయ్, మోర్కెల్‌), ఢిల్లీ (సెహ్వాగ్‌), ముంబై (సచిన్, హర్భజన్, పొలార్డ్, మలింగ), రాజస్థాన్‌ (వార్న్, వాట్సన్‌), బెంగళూరు (కోహ్లి)లను మాత్రమే కొనసాగించగా...కోల్‌కతా, పంజాబ్, హైదరాబాద్‌ మొత్తం ఆటగాళ్లను విడుదల చేశాయి. ఈ వేలంలోనే ముంబైకి వచ్చిన రోహిత్‌ శర్మ, బెంగళూరు ఎంచుకున్న ఏబీ డివిలియర్స్‌ మాత్రమే మార్పు లేకుండా ఇప్పటికీ అదే జట్లలో కొనసాగుతున్నారు. ముందుగా వేలంలో అమ్ముడుపోని క్రిస్‌ గేల్‌... డర్క్‌ నేన్స్‌ గాయం కారణంగా చివరి నిమిషంలో ఆర్‌సీబీ వద్దకు వచ్చి ఆ జట్టు రాత మార్చడం విశేషం. ఆ తర్వాత అతడి ఎన్నో సుడి గాలి ఇన్నింగ్స్‌లకు ఐపీఎల్‌ వేదికగా నిలిచింది. సౌరవ్‌ గంగూలీని కూడా ఎవరు తీసుకోకపోగా, నెహ్రా గాయంతో చివరకు పుణే టీమ్‌లో అవకాశం లభించింది.  

ఫైనల్‌ ఫలితం... 
చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సూపర్‌ కింగ్స్‌ 58 పరుగుల భారీ తేడాతో బెంగళూరును చిత్తుగా ఓడించింది. ముందుగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మురళీ విజయ్‌ (95), మైక్‌ హస్సీ (63) బ్యాటింగ్‌తో చెన్నై 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. అనంతరం బెంగళూరు 8 వికెట్లకు 147 పరుగులే చేయగలిగింది. టోర్నీలో భీకర ఫామ్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన క్రిస్‌ గేల్‌ను అశ్విన్‌ తొలి ఓవర్లోనే ఔట్‌ చేయడంతో ఆర్‌సీబీ కోలుకోలేకపోయింది.  

ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌:  క్రిస్‌ గేల్‌  
అత్యధిక పరుగులు (ఆరెంజ్‌ క్యాప్‌):  క్రిస్‌ గేల్‌ (బెంగళూరు – 608) 
అత్యధిక వికెట్లు (పర్పుల్‌ క్యాప్‌): లసిత్‌ మలింగ (ముంబై – 28)  

6 సెంచరీలు... 
టోర్నీలో గేల్‌ 2 సెంచరీలు బాదగా... సచిన్, పాల్‌ వాల్తాటి, సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్‌ ఒక్కో సెంచరీ కొట్టారు. టోర్నీలో అమిత్‌ మిశ్రా (దక్కన్‌ చార్జర్స్‌) ఏకైక హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.  

దాదాపుగా వాళ్లే...
గత ఏడాది విజేతగా నిలిచినా, వేలం కారణంగా చెన్నై జట్టులో కూడా పలు మార్పులు జరిగాయి. ప్రధాన ఆటగాళ్లు మినహా మరికొందరు వచ్చి చేరారు. టోర్నీలో ఆడిన 17 మందిలో ధోని, సాహా, బద్రీనాథ్, హస్సీ, రైనా, విజయ్, మోర్కెల్, డ్వేన్‌ బ్రేవో, సూరజ్‌ రణ్‌దీవ్, అశ్విన్, జోగీందర్‌ శర్మ, స్టయిరిస్, బొలింజర్, సౌతీ, కులశేఖర ఉండగా... అనిరుధ శ్రీకాంత్, షాదాబ్‌ జకాతి మాత్రమే ఎప్పుడూ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.  

ఒకే ఓవర్లో 37... 
కొచ్చి బౌలర్‌ ప్రశాంత్‌ పరమేశ్వరన్‌ వేసిన ఓవర్లో క్రిస్‌ గేల్‌ వరుసగా 6, 6 (నోబాల్‌), 4, 4, 6, 6, 4 బాదడం విశేషం. 4 సిక్సర్లు, 3 ఫోర్లు కలిపి గేల్‌ 36 పరుగులు బాదగా, మొత్తం 37 పరుగులు వచ్చాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement