పుణేను పరుగెత్తిస్తాడా?
► ధోనిపై ఫ్రాంచైజీ ‘కోట్లాది’ ఆశలు
► ఐపీఎల్‌లో విజయమే లక్ష్యం
► బ్రాండింగ్‌కూ అతని అవసరం
► గతంలో అన్ని ఆటల్లో పుణే వైఫల్యం
ఐపీఎల్‌లో సహారా పుణే వారియర్స్ జట్టు మూడేళ్లు ఆడింది. రెండు సార్లు చివరినుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంటే ఒక సారి అట్టడుగున నిలిచింది. ఒక్కసారి కూడా నాకౌట్ దశకు చేరలేకపోయిన ఆ జట్టు ఇప్పుడు పూర్తిగా రద్దయిపోయింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో పుణే పిస్టన్స్ ఒక సీజన్‌లో ఆడి సెమీస్ వరకు రాగలిగింది. వచ్చే జనవరిలో జరగబోయే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఆ జట్టు పేరే లేదు. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్‌లో పుణే ఎఫ్‌సీ తొలి సీజన్‌లో ఎనిమిది జట్లలో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. 2015లో మరింత దిగజారి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. సూపర్ సక్సెస్‌గా నిలిచిన ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణేరి పల్టన్ వరుసగా రెండేళ్లు చివరి స్థానంతోనే ముగించింది. 28 మ్యాచ్‌లలో ఆ జట్టు గెలిచినవి 4 మాత్రమే.
కారణమేదైనా లీగ్ స్పోర్ట్స్‌లో ఈ మరాఠా నగరం ప్రదర్శన ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఆట ఏదైనా ఆ జట్టు ఇప్పటి వరకు టైటిల్ కాదు కదా... కనీసం ఫైనల్‌కు కూడా చేరలేదు. సొంతగడ్డపై అత్యంత విఫలమైన జట్టు తమదే అంటూ అక్కడి సగటు క్రీడాభిమాని కూడా ఆవేదనగా చెప్పుకున్నాడు.
ఇప్పుడు మళ్లీ కొత్త కొత్తగా పుణే ఐపీఎల్‌లోకి అడుగు పెడుతోంది. గతంలోని పాత జట్టుతో పోలిస్తే నాయకుడిగా ధోని రూపంలో జట్టు బలం రెట్టింపు అయిందనడంలో సందేహం లేదు. సర్వ కాల సర్వావస్థల్లో కెప్టెన్‌గా అద్భుత రికార్డు ఉన్న ధోని వచ్చే రెండేళ్లు పుణే రాత మార్చి విజయం వైపు నడిపిస్తాడా! తనతో పాటు ఆ జట్టు స్థాయి పెంచగలడా! మొత్తానికి ఫ్రాంచైజీ మాత్రం అతనిపై ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకుంది. ఆటతో పాటు అతని మార్కెటింగ్ సత్తాను కూడా పూర్తిగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ధోనినే నమ్ముకొని భారీ పెట్టుబడితో లీగ్‌కు సిద్ధమైంది.
సాక్షి క్రీడా విభాగం
ఐపీఎల్‌లో ధోని విలువ ప్రత్యేకం. బ్యాట్స్‌మన్‌గా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్,‘ఫినిషింగ్ టచ్’ లతో అభిమానులను అలరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా రెండు ఐపీఎల్ టైటిల్స్, రెండు చాంపియన్స్ లీగ్ ట్రోఫీలు అందించాడు. అందరికంటే ఎక్కువగా 129 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని సారథ్యంలో జట్టు 78 మ్యాచ్ లు నెగ్గింది. వ్యూహ ప్రతివ్యూహాల్లో అతని ముందు ఇతర కెప్టెన్లు బలాదూర్. జట్టు మారినా ఈ ఘనత అంతా ధోనికి తోడుగా వచ్చేదే. ఇదంతా చెన్నైనుంచి తమకు ‘బదిలీ’ అవుతుందని పుణే గట్టిగా నమ్ముతోంది.ఇప్పుడు కొత్త జట్టును కూడా తన సామర్థ్యంతో బాగా నడిపించగల స్థాయి ధోనిది. కాబట్టి ఐపీఎల్‌కు సంబంధించినంత వరకు వచ్చే రెండు సీజన్లలో పుణే కీలక జట్టుగా మారనుంది.
పూర్తిగా వాడుకుంటారు
ఐపీఎల్‌లో అడుగు పెట్టడం అంటే పూర్తిగా వాణిజ్యపరమైన లాభానికి గ్యారంటీ ఏమీ లేదు. ‘గోయెంకా గ్రూప్ పుణే జట్టును కొనుక్కోగానే అదే సంస్థకు చెందిన సీఈఎస్‌ఈ లిమిటెడ్‌కు చెందిన షేర్ల విలువ పడిపోవడం చూస్తే ఐపీఎల్ ఒక రకమైన బిజినెస్ రిస్క్ అని చెప్పవచ్చు’ అని నిపుణులు వ్యాఖ్యానించడం దీనికి ఉదాహరణ. అయితే క్రికెట్ ప్రపంచంలో అడుగు పెట్టాలనే ఆసక్తితో పాటు తమ బిజినెస్ గ్రూప్‌లను సాధ్యమైనంతగా ప్రమోట్ చేసుకోవాలని ఫ్రాంచైజీ కోరుకుంటుంది.
అందుకే రెండేళ్ల స్వల్ప వ్యవధి అయినా ఆ జట్టు కనీసం రూ. 100 కోట్లు ప్రాథమికంగా ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువ గల ఈ గ్రూప్‌నకు అది పెద్ద మొత్తం కాకపోవచ్చు గానీ నష్టాలను సాధ్యమైనంత తగ్గించేందుకు పుణే ఇప్పుడు ధోని బ్రాండ్‌ను వాడుకునేందుకు సిద్ధమైంది. ‘బీసీసీఐనుంచి కూడా డబ్బు రాదు కాబట్టి ఫ్రాంచైజీ సొంత ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. వేలంలో ఉన్న ఇతర ఆటగాళ్లతో పోలిస్తే ధోని విలువ కనీసం రెండు రెట్లు ఎక్కువ ఉం టుంది. వాణిజ్యపరంగా ముందు వరుసలో నిలిచే పేరు కాబట్టి బ్రాండింగ్, స్పాన్సర్‌షిప్‌లు అతనితోనే కొత్త జట్టు వద్దకూ వస్తాయి’ అని పీఎంజీ సంస్థ సీఓఓ మెల్‌రాయ్ డిసౌజా విశ్లేషించారు.
ఫ్యాన్స్ కూడా అటు వైపే
వ్యాపార వర్గాలే కాదు... ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్ కూడా పుణే వైపే మరలుతారని ఫ్రాంచైజీ ఆశిస్తోంది. వారి దృష్టిలో రజినీకాంత్ స్థాయి ఉన్న మహి... సీఎస్‌కే జట్టులాగే తమ టీమ్ స్థాయి కూడా పెంచాలని గోయెంకా గ్రూప్ కోరుకుంటోంది. బరిలో చెన్నై కూడా ఉంటూ మరో జట్టుగా పుణే వస్తే సమస్య వచ్చేదేమో గానీ ఇప్పుడు ఆ టీమ్ లేదు కాబట్టి ఫ్యాన్స్, బిజినెస్ విషయంలో గందరగోళం లేదు. ‘ధోనికి ఇచ్చే డబ్బు విలువ చూస్తే చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
కానీ ధోని ధోనియే. బ్రాండ్ వల్లే కాదు అతనికి ఉన్న పాపులారిటీ, నాయకత్వ పటిమ, జట్టు విజయావకాశాలు పెంచుతుంది కాబట్టి అతనిపై ఎంత పెట్టుబడి పెట్టినా అది రాబట్టగల శక్తి ధోనికే ఉంది’ అని పుణే ఫ్రాంచైజీకి చెందిన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే తాము కేవలం వ్యాపార కోణంలోనే చూడటం లేదని, ఐపీఎల్‌లో పుణే జట్టు ముద్ర కూడా కనిపించాలని, ధోని టైటిల్ గెలిపించాలని కూడా కోరుకుంటున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ‘కెప్టెన్ కూల్’ పుణే అభిమానులను ఈ సారైనా సంతోషపరుస్తాడా!