ముంబై: చెన్నై పసుపు జెర్సీలో మళ్లీ కనిపించనున్న ధోని, రైనా, జడేజా... రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రాలపై తరగని ముంబై ఇండియన్స్ విశ్వాసం... సారథిగా రెండు టైటిళ్లు అందించిన గంభీర్‌ను వదులుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్... స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను కాదని అనూహ్యంగా సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంచుకున్న బెంగళూరు... పునరాగమనంలో స్టీవ్ స్మిత్ ఒక్కడిపైనే నమ్మకం ఉంచిన రాజస్తాన్ రాయల్స్... డేవిడ్ వార్నర్, భువనేశ్వర్‌లను మాత్రమే తీసుకుని మూడో ఆటగాడిని ఎంచుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్... ఇవీ గురువారం విడుదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిటెయిన్ ఆటగాళ్ల జాబితా విశేషాలు. కోల్‌కతా మినహా ఫ్రాంచైజీలు తమ ప్రధాన ఆటగాళ్లను దాదాపు అట్టిపెట్టుకున్నాయి. రూ.33 కోట్లతో ప్రాధాన్యతా క్రమంలో ముగ్గురిని రిటెయిన్ చేసుకునే అవకాశం ఉన్నా పంజాబ్, కోల్‌కతా, రాజస్తాన్, సన్‌రైజర్స్ ఆ విధంగా చేయలేదు. ఇక తర్వాతి దశలో రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ద్వారా మరికొందరు ప్రధాన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు ఎంచుకునే అవకాశం ఉంది. ఈనెల 27, 28 తేదీల్లో ఐపీఎల్–11 వేలం కార్యక్రమం జరుగుతుంది.
కోహ్లికి అత్యధికం...
విధివిధానాల ప్రకారం రూ.33 కోట్ల నిర్దేశిత మొత్తంలో ముగ్గురిని రిటెయిన్ చేసుకుంటే వారికి వరుసగా రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు ఇవ్వాలి. ఇద్దరినే తీసుకుంటే రూ.12.5 కోట్లు, రూ.8.5 కోట్లు చెల్లించాలి. కానీ... బెంగళూరు ఏకంగా కెప్టెన్ విరాట్ కోహ్లికి రూ.17 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వేలంలో మొదటి రిటెయినర్‌కు రూ. 15 కోట్లు ఉన్నా అది గరిష్టం కాదు. ఫ్రాంచైజీ తాము అంతకంటే ఎక్కువ చెల్లించవచ్చు. బెంగళూరు ఈ మొత్తాన్ని బహిరంగంగా ప్రకటించింది. రెండో ఆటగాడిగా డివిలియర్స్‌కు ఇవ్వాల్సిన మొత్తాన్నే (రూ.11 కోట్లు) చూపినా, మిగిలిన స్థానానికి అంతా ఊహించినట్లుగా టీమిండియా మణికట్టు స్పిన్నర్ చహల్‌ను కాదని అనూహ్యంగా సర్ఫరాజ్ ఖాన్‌ను తెరపైకి తెచ్చింది. రూ.1.75 కోట్లకు అతడిని రిటెయిన్ చేసుకుంది. దీంతో విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ వేలంలో కనిపించనున్నాడు.
వివరాలు ఫ్రాంచైజీల వారీగా...
చెన్నై సూపర్ కింగ్స్: ధోని, రైనా, జడేజా.
ఢిల్లీ డేర్‌డెవిల్స్: రిషభ్‌పంత్, మోరిస్, శ్రేయస్.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: అక్షర్ పటేల్
కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, రసెల్.
ముంబై ఇండియన్స్: రోహిత్, పాండ్యా, బుమ్రా.
రాజస్తాన్ రాయల్స్: స్టీవ్ స్మిత్
బెంగళూరు: కోహ్లి,డివిలియర్స్, సర్ఫరాజ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్, భువనేశ్వర్.
Comments
Please login to add a commentAdd a comment