పదేళ్ల ఐపీఎల్‌లో మెరుపులు, మరకలు
ఇరవై రెండు గజాల బరిలో ఇరవై రెండు మంది దిగ్గజాల పోరు!
తన.. మన.. పర.. భేదం లేదు. కుమ్మేయడమే! కొట్టేయడమే!
విజయమో.. దిగ్విజయమో! అంతే ఇక్కడ.
ఆట స్పిరిట్ తప్ప.. ఓటమి థాటే ఉండదు.
‘నీకంటే తోపెవ్వడూ లేడిక్కడ!’.. ‘నీకంటే తోపెవ్వడూ లేడిక్కడ’...
పదేళ్లుగా ప్రతి ఒక్క ప్లేయర్.. క్రీజ్‌లో జపిస్తున్న ఐపీఎల్ స్లోగన్!
టీవీ సీరియళ్ల ట్విస్ట్‌లను మించిన ట్విస్ట్‌లు, థ్రిల్స్.
ఇళ్లను, స్టేడియంలను ఏకం చేస్తున్న మెస్మరైజింగ్స్.
ఈ పదేళ్లలో ఎన్నో..
అనూహ్యాలు, అద్భుతాలు, విశేషాలు, వివాదాలు.. విపరీతాలు!
వాటిలోంచి ఇరవై రెండింటిని ఎంపిక చేసి..
ధూమ్.. ధామ్.. దస్‌గా మీకు అందిస్తోంది సాక్షి ‘ఫ్యామిలీ’.
మజా చూపించిన క్షణం
ఐపీఎల్ విజయవంతం కావడంపై ఉన్న సందేహాలను టోర్నీ తొలి మ్యాచ్ పటాపంచలు చేసింది. 2008 ఏప్రిల్ 18న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ కేవలం 73 బంతుల్లో మెరుపు వేగంతో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేయడం ఐపీఎల్‌లో ఉన్న వినోదాన్ని అందరికీ రుచి చూపించింది. ఆ తర్వాత అభిమానులకు ఈ లీగ్ ఒక వ్యసనంలా మారిపోయింది.
దోస్తా మేరా దోస్త్
జాతి వివక్ష వివాదంలో హర్భజన్, సైమండ్స్ దాదాపు కొట్టుకున్నంత పని చేసి కొన్నాళ్లయినా కాలేదు. కానీ ఐపీఎల్ పేరు చెప్పి అంతలోనే ఆప్త మిత్రుల్లా కలసిపోయారు. ఒకే జట్టులో కలిసి ఆడి వికెట్లానందాన్ని పంచుకున్నారు. సగటు క్రికెట్ అభిమానులు కలలో కూడా ఊహించని కొన్ని కాంబినేషన్లు మైదానంలో వారిని అలరించాయి. సమకాలీన క్రికెట్‌లో సమ ఉజ్జీలుగా నిలిచిన సచిన్, పాంటింగ్ ముంబై జట్టు తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగడం అందులో ఒకటి. మరో విధ్వంసకర బ్యాట్స్‌మన్ జయసూర్యతో కలిసి సచిన్ ఓపెనింగ్ చేయడం కూడా ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయింది.
టవల్ చూపించి తప్పుకున్నాడు
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘట్ట్టంగా స్పాట్ ఫిక్సింగ్ నిలిచింది. 2013 లీగ్‌లో నోబాల్ వేసేందుకు డబ్బులు తీసుకున్నట్లు రుజువు కావడంతో శ్రీశాంత్‌తో పాటు చండీలా, అంకిత్ చవాన్‌లపై బీసీసీఐ నిషేధం విధించింది. ఒక్కో ఓవర్‌కు దాదాపు లక్ష డాలర్ల వరకు తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్న శ్రీశాంత్... దానికి సూచనగా బౌలింగ్ చేసే సమయంలో టవల్‌ను బయటకు తీసి చూపించే సంజ్ఞను ఏర్పాటు చేసుకోవడం సంచలనం రేకెత్తించింది.
వామ్మో... ఇంత మొత్తమా!
అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌కు లేదా అప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నవారికి వేలంలో భారీ మొత్తం పలకడం ఆశ్చర్యం కాదు. కానీ కొందరు కుర్రాళ్లు తమ కనీస విలువతో పోలిస్తే ఎన్నో రెట్లు అందుకొని సంచలనం సృష్టించారు. రూ. 4.5 కోట్లతో మురుగన్ అశ్విన్ (రూ. 10 లక్షల కనీస ధరకంటే 45 రెట్లు ఎక్కువ), రూ. 3 కోట్లతో తంగరసు నటరాజన్ (రూ. 10 లక్షల కనీసం ధరకంటే 30 రెట్లు ఎక్కువ) ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
హెల్మెట్ కెమెరాలు, మైక్‌లో సంభాషణలు
క్రికెట్ ప్రపంచానికి ఐపీఎల్ చూపించిన కొత్త అంశాల్లో అంపైర్ల తలకు కెమెరాలు బిగించడం ఒకటి. నేరుగా అంపైర్ నిలుచున్న స్థానం నుంచి మరింత స్పష్టంగా ఆటను చూసిన అనుభూతిని ఇవి ఇచ్చాయి. ఆటగాళ్ల హెల్మెట్‌లో కెమెరాలు బిగించి, పిచ్ పైభాగంలో స్పైడర్ కెమెరాలు నడిపించి కూడా ఐపీఎల్ కొత్త ప్రయోగాలు చేసింది. ఇక ఫీల్డర్‌తో నేరుగా కామెంటేటర్లు సంభాషించడం కూడా కొత్త అనుభవమే. కొన్ని సరదాగా, కొన్ని సీరియస్‌తో అనేక అంశాలు ఆటగాళ్లు ఆ సమయంలో వ్యాఖ్యాతలతో పంచుకున్నారు.
పాకిస్తాన్ ఆటగాళ్లు అవుట్
తొలి ఐపీఎల్‌లో అన్ని జట్లలోనూ పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ప్రధాన భాగంగా నిలిచారు. సొహైల్ తన్వీర్ అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకోగా... ఆఫ్రిది, హఫీజ్, ఆసిఫ్, అక్తర్ తదితరులు లీగ్‌ను ఎంజాయ్ చేశారు. అయితే 2008 నవంబర్‌లో ముంబైపై దాడుల నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను లీగ్‌లోకి తీసుకోవద్దని నిర్ణయించారు. అప్పటి నుంచి మరే పాకిస్తానీకి అవకాశం దక్కలేదు. అయితే పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడినా, ఇప్పుడు ఇంగ్లండ్ పౌరసత్వం ఉండటం కారణంగా అజహర్ మహమూద్ రెండేళ్ల క్రితం ఐపీఎల్‌లో అడుగు పెట్టగలిగాడు.
వయసు అడ్డు కాదు
45 సంవత్సరాలు... ఈ వయసులో ఏదో ఆరోగ్యం కోసం వాకింగ్ చేసుకునేవారే మనకు కనిపిస్తారు. కానీ ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పోటీ క్రికెట్‌లో తన సత్తా చాటాడు. 2016లో ఐపీఎల్ ఆడేనాటికి హాగ్ వయసు 45 ఏళ్లు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడుతున్న ప్రవీణ్ తాంబే కూడా 44 ఏళ్లవాడే.
అమ్మాయి చేయి పట్టి...
ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చిన విదేశీ ఆటగాడు మైదానం బయట వ్యవహారంతో కటకటాలు లెక్కించిన సంఘటన కూడా అప్పట్లో సంచలనానికి కారణమైంది. ఆస్ట్రేలియా ఆటగాడు ల్యూక్ పొమర్స్‌బాచ్ 2012 ఐపీఎల్ సమయంలో తాగిన మైకంలో ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
స్ట్రాటజిక్ టైమ్ అవుట్
ఐపీఎల్‌లో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడుకునేందుకు నిర్వాహకులు కొత్త కొత్త మార్గాలు అన్వేషించారు. ఆటగాళ్లు తమ వ్యూహాలపై పునరాలోచించుకుంటారనే కారణంతో క్రికెట్‌లో ఎప్పుడూ లేని స్ట్రాటజిక్ టైమ్ అవుట్‌ను తీసుకొచ్చారు. ఆరంభంలో ఇది ఇన్నింగ్స్ మధ్యలో ఏడున్నర నిమిషాలు ఉండేది. అయితే దీనిపై విమర్శలు రావడంతో రెండున్నర నిమిషాల చొప్పున రెండు సార్లు బ్రేక్ తీసుకునేలా మార్చారు.
నీళ్లు లేకుంటే ఆటలా!
మహారాష్ట్రలో తీవ్ర కరవు కారణంగా గత ఏడాది అక్కడి ప్రజలు నీటికీ అల్లాడిపోయారు. ఇలాంటి స్థితిలో గ్రౌండ్‌ల నిర్వహణకు పెద్ద ఎత్తున నీరు ఉపయోగిస్తున్నారంటూ కేసు వేయడంతో సుప్రీం కోర్టు మ్యాచ్‌లను మహారాష్ట్రనుంచి తరలించాల్సిందిగా ఆదేశించింది. గతంలో 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా మొత్తం లీగ్ దక్షిణాఫ్రికాకు తరలిపోగా... 2010లో తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌లో జరగాల్సిన మ్యాచ్‌లను కూడా మరో వేదికకు మార్చారు. 2014 ఎన్నికల సమ యంలోనూ లీగ్ తొలిభాగం యూఏఈలో జరిగింది.
విందు... చిందు
ఐపీఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాల్లో ఆఫ్టర్ మ్యాచ్ పార్టీలు కూడా ఒకటి. అందమైన అమ్మాయిలతో చిందులేసిన విదేశీ క్రికెటర్లు, అభిమానులమని చెప్పుకుంటూ స్టార్ ఆటగాళ్లతో ఎవరెవరో సన్నిహితంగా మెలగడం... ఇలా పార్టీలో ప్రతీ రోజు నిత్యకృత్యంగా మారిపోయింది. వీటికి హాజరయ్యేందుకు రూ. 20 వేల వరకు టికెట్‌గా నిర్ణయించారు. ఆరంభంలో గవర్నింగ్ కౌన్సిలే వీటిని నిర్వహించగా, ఆ తర్వాత ఫ్రాంచైజీలు సొంతంగా నిర్వహించాయి. అయితే ఫిక్సింగ్ ఉదంతం బయట పడిన తర్వాత లీగ్‌లో సమస్యలు వస్తున్నాయని భావించి వాటిని రద్దు చేశారు.
తారల తళుకుబెళుకులు
భారత్‌లో క్రికెట్‌కు, సినిమాకు ఉండే అనుబంధం ఐపీఎల్ సమయంలో మరింత బలంగా కనిపించింది. మ్యాచ్ జరిగే ప్రతీ వేదికపై పెద్ద సంఖ్యలో సినిమా స్టార్లు వచ్చి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. మైదానంలో లేదా స్టూడియోలో ఎక్కడో ఒక చోట తమ మాటలతో, ఆట పాటలతో వారు అదనపు వినోదాన్ని పంచారు. అదరగొట్టే ఆరంభోత్సవాలు కూడా లీగ్‌లో బాలీవుడ్ పాత్రను ప్రముఖంగా చూపించాయి. వీటికి తోడు ముద్దులు బోనస్. పంజాబ్ జట్టు మ్యాచ్ గెలిస్తే చాలు ప్రీతి జింటా ముద్దు కోసం ఆటగాడు సిద్ధమైపోయినట్లే కనిపించేవాడు!
వేలం వెర్రి
తొలి ఐపీఎల్‌ను ప్రకటించినప్పుడు అన్నింటికంటే హాశ్చర్యంగా కనిపించిన అంశం ఆటగాళ్ల వేలం. క్రికెట్‌లో ఆటగాడికి మ్యాచ్ ఫీజుగా డబ్బు చెల్లించడమే తెలుసు కానీ అతడికి విలువ కట్టి వేలం పాట వేయడం అనేది ఊహించనిది. ఇదేం పద్ధతంటూ విమర్శలతో ప్రారంభమైనా ఇప్పుడు ఐపీఎల్‌లో వేలం కీలక భాగంగా మారిపోయింది. అయితే పేరు ప్రతిష్టలను బట్టి కాకుండా డబ్బు చెల్లించే ఫ్రాంచైజీల ఇచ్ఛ ప్రకారం సాగే వేలం అనేక మంది అనామకులను ఒక్కసారిగా అందలం ఎక్కించగా, పలువురు దిగ్గజాలకు అవమాన భారాన్ని కూడా మిగిల్చింది.
చీర లీడర్స్
ఐపీఎల్‌లో చీర్ లీడర్స్ చేసిన నృత్యాలు స్టేడియంలో కొత్త వినోదాన్ని పంచాయి. వాషింగ్టన్ రెడ్ స్కిన్స్ తరహాలో ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు సొంతంగా ఒక ప్రత్యేక చీర్ లీడర్స్ బృందాన్ని ఏర్పాటు చేసుకోగా, కొచ్చి జట్టు ఉక్రెయిన్ మోడల్స్‌ను రప్పించింది. అయితే పుణే వారియర్స్ చీర కట్టించి మరీ చీర్‌లీడర్స్‌తో సంప్రదాయ నాట్యాలు చేయించడం ప్రత్యేకంగా నిలిచింది.
తిరుగులేని గేల్ విధ్వంసం
ఐపీఎల్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లకు కొదవ లేదు. కానీ ఎప్పటికీ టి20 క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆట మాత్రం ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ మాత్రమే చూపించగలిగాడు. 2013 సీజన్‌లో ఏప్రిల్ 23న చిన్నస్వామి స్టేడియంలో పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మన్ గేల్ 66 బంతుల్లోనే 13 ఫోర్లు, 17 సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లోనే కాకుండా టి20ల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు.
ఆ రెండు జట్లు
ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతంలో జట్ల యజమానులే దోషులుగా తేలడంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను ఐపీఎల్‌ను రెండేళ్ల పాటు తప్పించారు. ఇరు జట్ల యజమానులే తమ టీమ్‌కు వ్యతిరేకంగా బెట్టింగ్‌కు పాల్పడిన ఈ వివాదంపై విచారణ సమయంలో తన అల్లుడు గురునాథ్ మెయప్పన్ కేవలం క్రికెట్ ఔత్సాహికుడు మాత్రమే ఉంటూ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్య చర్చకు దారి తీసింది.
లంక ఆటగాళ్లతో లింకు
2013లో శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడుల నేపథ్యంలో లంక ఆటగాళ్లు (మొత్తం 13 మంది) ఐపీఎల్‌లో పాల్గొనరాదంటూ డిమాండ్లు వచ్చాయి. అయితే ప్రతీ జట్టు చెన్నైలో మ్యాచ్ ఆడినప్పుడు మాత్రం తమ జట్టులో లంక ఆటగాడు ఎవరూ లేకుండా జాగ్రత్త పడింది. లంక మాజీ కెప్టెన్ రణతుంగ కూడా ఆ సమయంలో ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని కోరినా ఫలితం లేకుండా పోయింది.
ఆ ఇద్దరి విధేయత
తొలి ఐపీఎల్‌నుంచి పదో ఐపీఎల్ వరకు ఒకే ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు. విరాట్ కోహ్లి రాయల్ చాలెంజర్స్ జట్టుకు, హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతున్నారు. వీరు ఒక్కసారి కూడా జట్టు మారకుండా అన్ని సీజన్లలో బరిలోకి దిగారు.
షారుఖ్ ఖాన్ అవుట్
2012లో కోల్‌కతా, ముంబై మ్యాచ్‌కు తాగి వచ్చి వాంఖెడే స్టేడియంలో సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడంటూ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌పై ముంబై క్రికెట్ సంఘం మళ్లీ అక్కడికి రాకుండా ఐదేళ్ల నిషేధం విధించింది. అయితే నాలుగేళ్లు గడిచినా అలాంటిదేమీ జరగలేదంటూ ముంబై పోలీస్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం విశేషం
మరచిపోలేని చెంప దెబ్బ
తొలి ఐపీఎల్‌లో పేసర్ శ్రీశాంత్ కన్నీళ్లపర్యంతమైన చిత్రాన్ని ఎవరూ మరచిపోలేరు. ముంబై, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత హర్భజన్ సింగ్ సహచర భారత ఆటగాడిపై చేయి చేసుకున్నాడు. తనను భజ్జీ చెంప దెబ్బ కొట్టాడంటూ శ్రీ పసివాడిలా ఏడుస్తూ చెప్పాడు. స్పష్టమైన కారణం బయటకు రాకపోయినా, తనను రెచ్చగొడుతూ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్య భజ్జీకి ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. తొలి ఐపీఎల్‌లో ఇది హర్భజన్‌కు మూడో మ్యాచ్ కాగా, టోర్నీలో మిగతా 11 మ్యాచ్‌లు ఆడకుండా అతనిపై నిషేధం విధించారు.
మూడు జట్లకు మూడింది
2008లో ఐపీఎల్ ఎనిమిది జట్లతో ప్రారంభమైంది. ఐపీఎల్‌లో 2010లో కొచ్చి టస్కర్స్, పుణే వారియర్స్ ఇండియా జట్లు కొత్తగా వచ్చాయి. అయితే టీమ్‌ను దక్కించుకోవడంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కొచ్చి జట్టు రద్దు కాగా, బీసీసీఐతో విభేదాల వల్ల పుణే టీమ్ కూడా లీగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఐదు సీజన్ల తర్వాత ఆర్థికపరమైన కారణాలతోనే హైదరాబాద్ టీమ్ దక్కన్ చార్జర్స్‌ను కూడా బోర్డు రద్దు చేసింది. ఆ తర్వాత దాని స్థానంలో సన్‌రైజర్స్ వచ్చి చేరింది.
అన్నదమ్ముల అనుబంధం
ఐపీఎల్‌లో ఒకే సమయంలో కొంతమంది అన్నదమ్ములు ప్రత్యర్థులుగా తలపడగా, మరి కొందరు ఒకే జట్టులో కలిసి ఆడారు. యూసుఫ్–ఇర్ఫాన్ పఠాన్ బ్రదర్స్, మైక్–డేవిడ్ హస్సీ బ్రదర్స్, షాన్–మిషెల్ మార్ష్ బ్రదర్స్, మోర్నీ మోర్కెల్–అల్బీ మోర్కెల్ బ్రదర్స్, బ్రెండన్ మెకల్లమ్–నాథన్ మెకల్లమ్ బ్రదర్స్ వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున సత్తా చాటారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్‌లో హార్దిక్, కృనాల్ పాండ్యాలు ఒకే జట్టులో ఆడుతూ విజయంలో కీలక పాత్ర పోషించగా, దీపక్, రాహుల్ చహర్ (పుణే) సోదర జోడి 2017 ఐపీఎల్ బరిలో ఉంది.
అదిరే పంచ్‌లు...
⇒ ఆ సమయంలో నేను సంతలో ఆవులాంటివాడినేమోననే భావన కలిగింది.
– ఐపీఎల్ తొలి వేలంపై ఆడం గిల్‌క్రిస్ట్
⇒ఇది క్రికెట్ కాదు. ధనికులు, పేదల మధ్య భేదభావం చూపించడం. ఇందులో పెట్టే డబ్బుతో మీరు మరో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టించవచ్చు
– రాజ్యసభలో నాటి ప్రతిపక్ష నాయకుడు జశ్వంత్ సింగ్
⇒ నాన్నకు ఇష్టమైన కొడుకు ఎవరో తేలిపోయింది. వేలంలో నన్ను తీసుకుంటాడని చెప్పాడే కానీ అసలు సమయంలో నన్ను అసలు పట్టించుకోలేదు
– పుణే కోచ్‌గా ఉన్న జెఫ్ మార్ష్, సోదరుడు మిషెల్ మార్ష్ గురించి షాన్ మార్ష్
⇒ జీవితమంటే సరైన నిర్ణయాలు తీసుకోవడమే. ఈ రోజు గేల్ బ్యాటింగ్ చూస్తే నేను కీపింగ్‌ను ఎంచుకోవడం గొప్ప నిర్ణయంలా అనిపిస్తోంది
– గేల్ 175 పరుగుల విధ్వంసం తర్వాత ధోని
⇒ఐపీఎల్ ఆడటం అంటే క్రికెట్‌లో ఎంబీఏ డిగ్రీ తీసుకోవడంతో సమానం.
– ఏబీ డివిలియర్స్
నడిచే హోర్డింగ్‌లు
విరాట్ కోహ్లితో విడిగా ఒక ప్రకటనకు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలంటే ఎంత భారీ మొత్తం ఖర్చవుతుంది? అదే డివిలియర్స్‌ను గానీ, గేల్‌ను గానీ తమ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వాడాలంటే ఆ కంపెనీ ఎంత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది? వీరిద్దరినీ కూడా తీసుకుంటే ఎంత డబ్బు కావాలి? సరిగ్గా ఇదే లెక్కతో ఐపీఎల్ జట్ల జెర్సీలపై బ్రాండింగ్ చేసేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. టీమ్ ఫ్రాంచైజీతో ఒకసారి కొంత మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంటే ఈ ముగ్గురు ఆటగాళ్లను ఒకే ఫ్రేమ్‌లో బంధించేయవచ్చు. ఎలా చూసినా ప్రకటనకర్తకు ఇది మంచి గిట్టుబాటు అన్నట్లే. బెంగళూరుతో ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ ఈ ఆటగాళ్ల చిత్రాలను వాడుకుంటూ తగిన ప్రచారం చేసుకుంటున్నాయి.
ఐపీఎల్ పాపులార్టీ, పోటీ ఎలా ఉందంటే జియోనీ మొబైల్ ఈ సారి రెండు టీమ్‌లకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్‌లో గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. కోల్‌కతాతో పాటు ఆ కంపెనీ బెంగళూరును కూడా స్పాన్సర్ చేస్తోంది. కొన్ని టీమ్‌లు తమ సొంత బ్రాండ్‌లను ప్రమోట్ చేసుకునేందుకు దీనిని ఉపయోగిస్తున్నాయి. ఇందులో అగ్రభాగం బెంగళూరుదే. జట్టు పేరులోనే రాయల్ చాలెంజర్స్ ఉన్న ఈ టీమ్, తమ మరో ఉత్పత్తి కింగ్ ఫిషర్‌ను కూడా బాగా ప్రమోట్ చేసుకుంది. సన్‌రైజర్స్ జట్టు రెడ్ ఎఫ్‌ఎంను, సన్ నెట్‌వర్క్‌ను, గుజరాత్ లయన్స్ ఇంటెక్స్ మొబైల్స్‌ను ఇలాగే ప్రమోట్ చేసుకున్నాయి.
ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ
గతంలో మ్యాచ్ ముగిసిన తర్వాత కేవలం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీనే ఉండేది. ఇప్పుడు ఐపీఎల్‌లో ఏదో ఒక పేరుతో స్పాన్సరర్ వరుసగా బహుమతులు అందిస్తున్నారు. బెస్ట్ క్యాచ్, బెస్ట్ మూమెంట్, మోస్ట్ సిక్సెస్... ఇలా ఏదో రూపంలో ప్రైజ్, ప్రచారం కలసి నడుస్తున్నాయి. ఇక ఐపీఎల్‌లో అతి పెద్ద అభిమాని అంటూ వొడాఫోన్ చేస్తున్న సందడి వేరు. తమ వినియోగదారులను కొన్ని ప్రశ్నలు అడిగి సరైన సమాధానం ఇచ్చిన వారిలో ఒకరిని ప్రతీ మ్యాచ్‌కు వొడాఫోన్ ఎంచుకుంది.
ఆ వ్యక్తితో పాటు మరో సహాయకుడిని మ్యాచ్ జరిగే నగరం వరకు తీసుకెళ్లి తిరిగి తీసుకు రావడం, అతనికి మైదానంలో అతి దగ్గరినుంచి మ్యాచ్ చూసే అవకాశం కల్పించడం, మ్యాచ్ ప్రసారం జరిగే సమయంలో వొడాఫోన్ ఐపీఎల్ ఫ్యాన్ అంటూ లైవ్‌లో చూపించడంతో పాటు విజేత జట్టు కెప్టెన్ చేతుల మీదుగా సిగ్నేచర్ చేసిన బాల్‌ను ఇవ్వడం వరకు అంతా పెద్ద సంఖ్యలో అభిమానులను అందులో భాగం చేయడం కోసమే. కొత్త సంచలనంగా వచ్చిన జియో ఈ సారి ఐపీఎల్‌లో ఏకంగా 7 జట్లకు భాగస్వామిగా మారింది. ఆయా జట్ల ప్రధాన ఆటగాళ్లతోనే తమ బ్రాండింగ్ ప్రకటన చేయించేందుకు జియో భారీగా చెల్లించింది.
లక్ష్యం.. రూ. 1200 కోట్లు
ఐపీఎల్ ప్రధాన ప్రసారకర్త సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ 2017 సీజన్‌లో తమ బ్రాండింగ్ భాగస్వాముల ద్వారా రూ. 1200 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకోవడం విశేషం. అంటే మ్యాచ్ ప్రసారమౌతున్నప్పుడు ఓవర్ల విరామం మధ్యలో వచ్చే యాడ్ రెవెన్యూ మొత్తం సోనీకే చెందుతుంది. ఈ ప్రధాన ప్రకటనలు ఇస్తున్న కంపెనీల జాబితాలో వివో, వొడాఫోన్, అమెజాన్, పాలీ క్యాబ్, యమహా, విమల్ పాన్‌మసాలా, మేక్ మై ట్రిప్, పార్లే, వోల్టాస్ తదితర సంస్థలు ఉన్నాయి.
పైన చెప్పిన కంపెనీలు 10 సెకన్ల ప్రకటన కోసం రూ. 5.75 లక్షల వరకు చెల్లిస్తున్నాయి. ఇతర సంస్థలు మ్యాచ్ మధ్యలో ప్రకటనలు ఇవ్వాలంటే 10 సెకన్లకు రూ.2 లక్షల వరకు ఇవ్వాలి. అదే హెచ్‌డీ ఛానల్‌లో అయితే ఇదే ప్రకటన రూ. 6 లక్షలు అవుతుంది. నోట్ల రద్దు ప్రభావం భారీ ఆదాయంపై ఉండవచ్చని భావించినా... కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐపీఎల్ ఉండటంతో ఆ సమస్య రాదని మరికొన్ని కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఎల్–10లో సెంట్రల్ స్పాన్సర్‌షిప్ ఉన్న బ్రాండ్‌లు 7 కాగా... ఇతరత్రా మొత్తం 102 బ్రాండ్‌లు స్పాన్సర్‌లుగా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే బ్రాండింగ్‌ల ద్వారా మొత్తం రూ. 314 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ సీజన్‌కు కొత్తగా 39 బ్రాండ్‌లు ప్రకటనలు ఇచ్చేందుకు ముందుకు రావడం మరో విశేషం. స్పాన్సర్‌షిప్‌లో 27 శాతం మొబైల్ çహ్యాండ్ సెట్ కంపెనీలు కాగా, సర్వీస్ ప్రొవైడర్లు 12 శాతం ఆదాయాన్ని చేకూరుస్తున్నాయి.