ముంబై: టీమిండియా అయినా... ఐపీఎల్ అయినా... కోహ్లి, ధోనీలే టాప్ స్టార్స్. అట్టిపెట్టుకునే అవకాశమే ఉన్నప్పుడు వీళ్లిద్దరినీ ఏ ఫ్రాంచైజీ అయినా ఎందుకు వదిలేస్తుంది. కాబట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పంచనే విరాట్ కోహ్లి, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) పెద్ద దిక్కుగా మహేంద్ర సింగ్ ధోని ఖాయమయ్యారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఏ ఏ ఫ్రాంచైజీ చేతిలో ఉంటారో నేడు తేలనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా అట్టిపెట్టుకున్న (రిటెయిన్) ఆటగాళ్ల జాబితాను విడుదల చేస్తుంది. తాజా రిటెయిన్ పాలసీ 2018 నుంచి 2020 వరకు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. మిగతా స్టార్ ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్ విజయవంతమైన సారథి రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పాత జట్టుకే ఆడనున్నారు. గుజరాత్‌కు ఆడిన రవీంద్ర జడేజా మళ్లీ సీఎస్‌కేతో చేరే అవకాశముంది. ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనసాగించేందుకే సిద్ధమైంది.
►రిటెన్షన్ పద్ధతిలో (వేలానికి ముందు) కానీ, రైట్ టు మ్యాచ్ (వేలం సమయంలో)తో కానీ ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను కొనసాగించుకునే వీలుంది.
►ఇందులో విదేశీ, స్వదేశీ పరిమితి కూడా ఉంది. అంటే ముగ్గురు భారత ఆటగాళ్లు (క్యాప్‌డ్), ఇద్దరు విదేశీ ఆటగాళ్లు, ఇద్దరు దేశవాళీ ఆటగాళ్ల (అన్ క్యాప్‌డ్) నుంచే తుది ఐదుగురి రిటెన్షన్ జరగాలి.
►రెండేళ్ల నిషేధానికి గురైన సీఎస్‌కే, రాజస్తాన్ రాయల్స్ జట్లు 2015కు ఆడిన బృందం నుంచి ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. 2018 నుంచి మూడు సీజన్ల పాటు ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక ఫ్రాంచైజీ వెచ్చించే మొత్తాన్ని కూడా పెంచారు. ఈ మూడేళ్లు వరుసగా రూ. 80 కోట్లు, రూ. 82 కోట్లు, రూ. 85 కోట్లను ఖర్చుపెట్టొచ్చు. ఇందులో కనీసం 75 శాతం తప్పకుండా ఖర్చు చేయాలనే నిబంధన కూడా ఉంది. అంటే రూ. 80 కోట్లలో రూ. 60 కోట్లతో ఆటగాళ్లను కొనాల్సిందే.
► ఒక ఫ్రాంచైజీ ముగ్గురు ఆటగాళ్లను రిటె యిన్ చేసుకోవాలనుకుంటే వారికి వరుసగా రూ. 15 కోట్లు... రూ. 11 కోట్లు... రూ. 7 కోట్లు చెల్లించాలి. ఇద్దరు ఆటగాళ్లను రిటెయిన్ చేసుకోవాలనుకుంటే వరుసగా రూ. 12.5 కోట్లు... రూ. 8.5 కోట్లు చెల్లించాలి.
కోహ్లి, ధోని... ఎక్కడివారక్కడే!
Published Thu, Jan 4 2018 1:12 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment