న్యూఢిల్లీ: 2011లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి నిషేధానికి గురైన కొచ్చి టస్కర్స్ కు రూ. 850 కోట్ల భారీ పరిహారం దక్కనుంది. గత కొంతకాలంగా కొచ్చి టస్కర్స్ తో ఉన్న వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అందుకు సిద్ధమైంది. ఈ మేరకు రూ. 850 కోట్ల రూపాయల పరిహారాన్ని కొచ్చికి చెల్లించడానికి సిద్ధమైంది.
'కొచ్చి టస్కర్స్ రూ.850 కోట్ల పరిహారాన్ని కోరింది. దీనిపై ఈ రోజు జరిగిన ఐపీఎల్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో చర్చించాం. వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్నాం. దీన్ని తర్వలో్ జరగబోయే జనరల్ బాడీ సమావేశంలో కూడా చర్చించి పరిహారానికి సంబంధించిన విషయాన్ని ఫుల్ స్టాప్ పెడతాం'అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.
ఇదిలా ఉంచితే, 'కొచ్చికి పరిహారం చెల్లించాల్సిందే. కొచ్చిపై పోరాడటానికి మాకు అన్నిదారులు మూసుకుపోయాయి. మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పే మాకు గతంలో వ్యతిరేకంగా వచ్చింది. అటువంటి సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్లడం అనే నిర్ణయం సరైనది కాదు. మాకు ఇప్పుడే వేరే ఆప్షన్ కూడా లేదు. కాకపోతే ఎంత పరిహారం చెల్లించనున్నామనేది మాకు అది ప్రశ్న'అని ఐపీఎల్ జనరల్ కౌన్సిల్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.
వివాదం ఇలా..
వార్షిక ఫీజుకు బ్యాంకు గ్యారంటీ చెల్లించలేదని రద్దయిన ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో తామెంతో నష్టపోయామని అప్పట్లోనే కొచ్చి కోర్టు కెక్కింది. దానిలో భాగంగా ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వ) కోర్టు పిటిషనర్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2015లో కొచ్చి నష్టపరిహారంగా రూ. 384. 83 కోట్లతో పాటు ఈ మొత్తానికి 18 శాతం వడ్డీ చొప్పున నాలుగేండ్లకయ్యే మొత్తాన్ని కలిపి చెల్లించాల్సిందిగా బీసీసీఐని ఆదేశించింది. కోర్టు ఫీజులకిందా ఫ్రాంచైజీకి మరో రూ. 72 లక్షలనూ చెల్లించాలని చెప్పింది. అయితే ఈ మొత్తం కలిపి రూ. 900 కోట్లను బీసీసీఐ చెల్లించాలి. దీంతో అప్పట్నుంచి ఇరువురి రాజీ యత్నాలు జరిగాయి. ఆ క్రమంలోనే కొచ్చిని మరొకసారి ఐపీఎల్లో ఆడే అవకాశం కల్పిస్తారనే వార్తలు కూడా వెలుగుచూశాయి. కాకపోతే ఆ జట్టును ఆడించకపోగా, కనీసం పరిహారంపై కూడా బీసీసీఐ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. తాజాగా దానికి బీసీసీఐ ముగింపు పలుకుతూ రూ.850 కోట్లను చెల్లించడానికి సిద్దమైంది.
Comments
Please login to add a commentAdd a comment