న్యూఢిల్లీ: వరల్డ్ రిచెస్ట్ టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ రాబోవు సీజన్‌లో పలు మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. అందులో ఐపీఎల్ సీజన్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలనే ప్రతిపాదనకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు వచ్చే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 45 రోజులు సాగుతున్న ఈ పొట్టి క్రికెట్ టోర్నీని రెండు నెలలకు పొడిగించాలని బీసీసీఐ భావిస్తోంది.ఇందుకు కారణం.. ఐపీఎల్‌లో మధ్యాహ్నం మ్యాచ్‌లను కుదించాలని బోర్డు యోచిస్తుండడమే. ఎండల తీవ్రత దృష్ట్యా ఇకపై ఒక్కో జట్టు సీజన్‌లో ఒకటే మధ్యాహ్నం మ్యాచ్ ఆడించేందుకు యోచిస్తోంది.
దాంతో వారాంతాల్లో జరిగే రెండు మ్యాచ్‌ల సంఖ్య కూడా తగ్గించాలని అనుకుంటున్నారు. ఇలా కాని పక్షంలో ప‍్రతీ మ్యాచ్‌ను సాయంత్రం 7.00గం.లకు మాత్రమే జరిపితే ఎలా ఉంటుందనే కోణాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఒక కోణంలో చూస్తే 45 రోజుల షెడ్యూలే ఎక్కువ అనిపిస్తోంది. అటువంటిది రెండు నెలలకు పొడిగిస్తే ఆ లీగ్ బోర్ కొట్టే అవకాశం కూడా లేకపోలేదు. వచ్చే ఐపీఎల్ సీజన్ ఏప్రిల్-1 వ తేదీ నుంచి ఆరంభమయ్యే అవకాశం ఉంది. డిసెంబర్19వ తేదీన ఆటగాళ్ల వేలం కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment