గవాస్కర్ సలహాదారుడిగా దీపక్ పరేఖ్
న్యూఢిల్లీ: ఐపీఎల్-7 సీజన్ కొనసాగినంత కాలం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనగనున్న మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. తన కోసం ప్రత్యేక సలహాదారుణ్ణి నియమించుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ ఫరేఖ్ ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. ఐపీఎల్ పాలకమండలి సమావేశాలకు కూడా ఆయనప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో పరేఖ్‌కు ఉన్న సుదీర్ఘ అనుభవం కారణంగా రెండు నెలలపాటు లీగ్ వ్యవహారాలను సజావుగా నిర్వహించవచ్చనేది సన్నీ ఆలోచన.
2009లో సత్యం కంప్యూటర్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు పరేఖ్ ప్రత్యేక డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఆ కంపెనీని నిలబెట్టి ప్రశంసలు పొందారు. ‘ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ప్రత్యేక ఆహ్వానితుడిగా.. నాకు సలహాదారుడిగా ఉండేందుకు దీపక్ పరేఖ్ అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది
. బీసీసీఐ-ఐపీఎల్ నాయకత్వ గ్రూప్‌లో ఆయనలాంటి వ్యక్తి చేరడం సమున్నతంగా ఉంది’ అని గవాస్కర్ కొనియాడారు. పరేఖ్ అనుభవం ఐపీఎల్‌ను చిరస్మరణీయంగా నిర్వహించేందుకు తోడ్పడుతుందని లీగ్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ అభిప్రాయపడ్డారు. అలాగే ఐపీఎల్‌లో భాగం కానుండడంతో పాటు సన్నీకి సలహాదారుడిగా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పరేఖ్ తెలిపారు.