EX captain
-
కొత్త అవతారమెత్తిన సౌరవ్ గంగూలీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో ఉన్న బంధన్ బ్యాంక్.. సంస్థ ప్రచారకర్తగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని నియమించుకుంది. బ్యాంక్ సందేశాన్ని విస్తరించడంలో, సంస్థ ఉత్పత్తులు, సేవలను మరింత మందికి చేరువ చేయడంలో సౌరవ్ గంగూలీ సహాయపడతారని బంధన్ బ్యాంక్ తెలిపింది. 34 రాష్ట్రాల్లో 5,644 బ్యాంకింగ్ ఔట్లెట్స్ ద్వారా సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. మార్చి నాటికి కొత్తగా 551 శాఖలను తెరుస్తోంది. టీమిండియాకు ఆడే సమయంలో కెప్టెన్‌గా చక్రం తిప్పిన సౌరవ్ గంగూలీ... బీసీసీఐ బాస్‌గా గత మూడేళ్లలో తనదైన ముద్ర చూపించాడు. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు ఉండాలని ఆశపడ్డా అది కుదరలేదు. ఈ విషయంలో బీసీసీఐ బోర్డు పెద్దలు అంగీకరించకపోవడంతో దాదా అయిష్టంగానే పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. చదవండి: బ్యాంకుల పనివేళలు మారనున్నాయా? బ్యాంకు అసోసియేషన్ ప్రతిపాదనలు ఇవే! -
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు క్లీన్చిట్
జాతి వివక్ష ఆరోపణల నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు విముక్తి లభించింది. అతనితో పాటు ప్రస్తుత కోచ్, మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్, ఏబీ డివిలియర్స్‌లకు కూడా క్లీన్చిట్ ఇచ్చారు. స్మిత్ తదితరులు జట్టులోని నల్లజాతి క్రికెటర్లపై వివక్షకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించలేదని... ఎన్సెబెజా నేతృత్వంలోని సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. -
గంగూలీ అలా చేసి ఉండకపోతేనా..
ఫుట్‌బాల్ మీద మమకారం ఉన్నప్పటికీ.. అన్నతో పడ్డ పోటీలో చివరికి అతనే పైచేయి సాధించాడు. అగ్రెస్సివ్ బ్యాట్స్‌మ్యాన్‌గా, యువ జట్టును సమర్థవంతంగా నడిపించిన సారథిగా దశాబ్దంపైగా టీమిండియాకు మరిచిపోలేని విజయాలెన్నింటినో అందించాడు సౌరవ్ ఛండీదాస్ గంగూలీ అలియాస్ దాదా. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న గంగూలీకి ఇవాళ 49వ పుట్టినరోజు.. వెబ్‌డెస్క్: పరిమిత ఓవర్లలోనే కాదు.. టెస్ట్‌ల్లోనూ రికార్డ్ స్ట్రయిక్ రేటుతో పరుగుల వరద పారించాడు సౌరవ్ గంగూలీ. హీరో హోండా బ్యాట్(చాలా మ్యాచ్‌లు ఈ బ్యాట్‌తోనే ఆడాడు)తో ముందుకొచ్చి స్పిన్నర్ల బంతిని బౌండరీ అవతల పడేయడం, స్క్వేర్, ఫ్రంట్ ఫుట్, కవర్ షాట్లతో క్రీడాభిమానులందరినీ ఉర్రూతలూగించేవాడు. ఆయనది ఎడమ చేతి వాటం. అయితేనేం ఆఫ్ సైడ్‌లో అదిరిపోయే షాట్లతో ‘గాఢ్ ఆఫ్ ది ఆఫ్‌సైడ్ క్రికెట్’ ట్యాగ్‌లైన్ దక్కించుకున్నాడు సౌరవ్ గంగూలీ. ఫియర్లెస్ బ్యాట్స్‌మన్‌గా.. దేశీవాళీ టోర్నీల్లో రాణించిన దాదా కెరీర్.. 1992లో విండీస్ మ్యాచ్‌తో మొదలైంది. కానీ, టీం కోసం కూల్ డ్రింక్స్ బాటిళ్లు మోయలేనంటూ వాదించి వేటుకు గురయ్యాడనే ఒక ప్రచారం ఇప్పటికీ వినిపిస్తుంటుంది(ఆ ప్రచారాన్ని దాదా కొట్టిపడేస్తుంటాడు). 1993-94, 94-95, 95-96 సీజన్లలో రంజీ, దులీప్ ట్రోఫీల్లో రాణించాడు గంగూలీ. ఆ పర్ఫార్మెన్స్ అతన్ని ఇంగ్లండ్ టూర్‌కి ఎంపిక చేయించింది. ఆ టూర్లో ఒకే ఒక్క వన్డే ఆడి.. డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాడు. అయితే సిద్ధూ వివాదాస్పద నిషష్క్రమణ తర్వాత ఆ ప్లేస్‌లో గంగూలీ టెస్ట్ మ్యాచ్‌లకు ఆడాడు. లార్డ్స్‌లో డెబ్యూలోనే గంగూలీ బాదిన శతకం ఒక తీపి గుర్తుగా ఉండిపోయింది. ఆ తర్వాత ఫియర్లెస్ బ్యాట్స్‌మ్యాన్‌గా గంగూలీ శకం నిర్విరామంగా కొనసాగింది. సచిన్, ద్రవిడ్, లక్క్ష్మణ్లాంటి సీనియర్లతో భాగస్వామిగా పరుగులు రాబట్టాడు గంగూలీ. కెప్టెన్‌గా భేష్, ఆటగాడిగా.. ఆటగాడిగా అద్భుత ప్రదర్శన గంగూలీకి పగ్గాలు అప్పజెప్పేలా చేసింది. అయితే కెప్టెన్‌గా సమర్థతను నిరూపించుకున్న గంగూలీ.. ఆటగాడిగా మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఇక కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ ఎంట్రీ.. వివాదాలతో దాదా ఆట తీరు దాదాపుగా మసకబారిపోయింది. చివరికి.. పూర్ ప్లేయర్‌గా కెప్టెన్సీకి.. ఆపై ఆటకు దూరం కావాల్సి వచ్చింది. అయితే కెప్టెన్‌గా గంగూలీ తీసుకున్న కొన్ని సొంత నిర్ణయాలు మాత్రం.. టీమిండియా స్థితిగతుల్ని మలుపు తిప్పాయనే చెప్పొచ్చు. ద్రవిడ్ ప్లేస్‌లో లక్క్ష్మణ్.. అయితే 2001 ఈడెన్ గార్డెన్ టెస్ట్‌లో ఫాలో ఆన్‌తో గడ్డు స్థితి ఉన్న టైంలో ద్రవిడ్‌కు బదులు లక్క్ష్మణ్ను నెంబర్ 3 పొజిషన్లో పంపడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, ఆ నిర్ణయం ఎలాంటి క్లాసిక్ విక్టరీని అందించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. 281 పరుగులతో లక్క్ష్మణ్ రాణించగా. చివరిరోజు బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పి అద్భుత విజయాన్ని అందించాడు హర్భజన్. తద్వారా కంగారుల పదహారు వరుస టెస్ట్ విజయాల పరంపరకు బ్రేక్ వేసింది గంగూలీ నేతృత్వంలోని టీమిండియా. ఈ విజయమే ఒకరకంగా తన కెరీర్‌ను నిలబెట్టిందని చాలాసార్లు గుర్తు చేసుకుంటాడు దాదా. ఇక వీరేంద్ర సెహ్వాగ్‌కు విధ్వంసకర బ్యాట్స్‌మ్యాన్‌గా గుర్తింపు ఉందన్నది తెలిసిందే. కానీ, తొలినాళ్లలో ఆరో నెంబర్ పొజిషన్లో బ్యాటింగ్ చేసేవాడు వీరూ. అంతెందుకు సౌతాఫ్రికా టెస్ట్ డెబ్యూలోనూ ఆరో నెంబర్ పొజిషన్లో బ్యాటింగ్సెంచరీ బాదాడు. అయితే డ్యాషింగ్ ఓపెనర్ అవసరమన్న ఉద్దేశంతో అప్పటి నుంచి వీరూని ఓపెనింగ్‌లో దించడం స్టార్ట్ చేశాడు గంగూలీ. ద్రవిడ్ వికెట్ కీపర్‌గా.. గంగూలీ బ్యాట్స్‌మ్యాన్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు మీడియం పేస్ బౌలింగ్‌తో అలరించేవాడు కూడా. ఇక నయన్ మోంగియా శకం ముగిశాక.. టీమిండియాకు ఫిక్స్డ్ వికెట్ కీపర్ సమస్య ఎదురైంది. ఆ టైంలో ఎందరినో కీపర్లుగా మార్చాడు గంగూలీ. కానీ, చివరాఖరికి ద్రవిడ్‌ను ఒప్పించి.. వికెట్ల వెనుకాల కూడా వాల్‌గా నిలబెట్టాడు. అంతేకాదు 2002-2004 మధ్య ద్రవిడ్‌ను 5 నెంబర్ పొజిషన్లో పంపి.. వన్డేలోనూ మంచి ఫలితాలను రాబట్టాడు గంగూలీ. చివరికి ధోనీని 3 స్థానంలో పంపడం, ఆ స్థానంలోనే వైజాగ్ వన్డేలో 148 పరుగులు బాదడం ఎవరూ మరచిపోలేరు. పెద్దన్నగా.. యువ టీంలో విజయపు కాంక్ష 2000 సంవత్సరం నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు క్రికెట్‌ను కమ్మేశాయి. అలాంటి కష్ట కాలంలో టీమిండియాను బలోపేతం చేసి.. జట్టుకు వైభవం తెచ్చింది దాదానే. ముఖ్యంగా యువ ఆటగాళ్లను ప్రోత్సహించి విజయ కాంక్షను రగిలించి ‘పెద్దన్నయ్య’(దాదా)గా నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోనీ.. ఇలా దాదా నాయకత్వంలో పేరు తెచ్చుకున్న వాళ్లే. అంతేకాదు యువ టీంలో విదేశీ గడ్డ ఓటమి అనే భయాన్ని పొగొట్టి.. సమర్థవంతంగా జట్టును నడిపించిన ఘనత కూడా దాదాదే. -
ఇదే సరైన సమయం...
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత విస్తరించేందుకు ఇది సరైన సమయమని భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. లీగ్ నాణ్యతలో రాజీ పడకుండా జట్ల సంఖ్యను పెంచినట్లయితే యువ క్రికెటర్లకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ పరంగా గత దశాబ్ధం భారత్‌కు అత్యుత్తమమని పేర్కొన్నాడు. 2011 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకోవడంతో పాటు టి20 ప్రపంచకప్‌లోనూ గొప్ప ప్రదర్శనలు నమోదయ్యాయని అన్నాడు. రాజస్తాన్ రాయల్స్ సహ యజమాని మనోజ్ బదాలే రాసిన పుస్తకం ‘ఎ న్యూ ఇన్నింగ్స్’ వర్చువల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్ ఈ అంశంపై మాట్లాడాడు. ‘ప్రతిభపరంగా చూస్తే ఐపీఎల్‌ను విస్తరించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నా. సత్తా ఉన్న ఎందరో క్రికెటర్లకు ఈ వేదికపై ఇంకా ఆడే అవకాశం దక్కడం లేదు. ఐపీఎల్లో జట్ల సంఖ్య పెంచితే వీరందరికీ అవకాశం లభిస్తుంది. ప్రతిభ చాటేందుకు చాలామంది యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే లీగ్ నాణ్యతలో ఏమాత్రం తేడా రాకుండా ఈ విస్తరణ చేపట్టాలి. తొలుత రంజీలకు ఎంపిక కావాలంటే రాష్ట్ర సంఘాలపై ఆధారపడాల్సి వచ్చేది. క్రికెటర్లకు పరిమిత అవకాశాలుండేవి. ఇప్పడు ఐపీఎల్‌తో పరిస్థితి మారిపోయింది. కోచ్‌లుగా మేం కొంత మాత్రమే సహకరించగలం. కానీ అనుభవం ద్వారానే యువ ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారు. లీగ్‌లో యువ దేవదత్... సీనియర్లు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లతో కలిసి బ్యాటింగ్ చేశాడు. ఈ అనుభవం జాతీయ జట్టుకు ఆడటానికి ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో రాణించడం వల్లే నటరాజన్ టీమిండియాకు ఎంపికయ్యాడు’ అని ద్రవిడ్ వివరించాడు. ద్రవిడ్ అభిప్రాయాన్ని మనోజ్ స్వాగతించాడు. వచ్చే ఏడాది 9 జట్లతో కూడిన ఐపీఎల్ నిర్వహణ కచ్చితంగా సాధ్యమేనని వ్యాఖ్యానించాడు. ఈ దిశగా బీసీసీఐ ఆలోచించాలని సూచించాడు. రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్‌ను ద్రవిడ్ అభినందించాడు. ప్రపంచ స్థాయి టి20 క్రికెటర్లతో పాటు యువకులతో కూడిన ముంబై అన్ని రంగాల్లో పటిష్టంగా ఉందని వ్యాఖ్యానించాడు. -
ధోని ఆంతర్యం ఏమిటో ?
సాక్షి క్రీడా విభాగం: మ్యాచ్‌లో ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్లి ఆఖరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టి చివరకు భారీ షాట్‌తో గెలిపించడం మహేంద్ర సింగ్ ధోనికి ‘ఐస్’తో పెట్టిన విద్య. ఎవరి అంచనాలకు అందకుండా నిర్ణయాలు తీసుకోవడం అతనికి అలవాటైన ఆట. అనూహ్య ఆలోచనలు, వ్యూహాలు అతనికి కొత్త కాదు. అభిమానులను అలరిస్తూ అరుదైన విజయాలు అందించినా... అవమానకర పరాజయాల్లో కూడా అదే నిగ్రహాన్ని ప్రదర్శించినా అది ధోనికే చెల్లింది. కొందరి దృష్టిలో అతనో అద్భుతమైతే మరికొందరి దృష్టిలో అతనో ‘సుడిగాడు’ మాత్రమే. అయితే ఎవరేమనుకున్నా భారత క్రికెట్లో ధోని ఒక అద్భుతం. ‘నేను సిరీస్ గెలిచినా ఓడినా నా ఇంట్లో పెంపుడు కుక్కలు నన్ను ఒకే తరహాలో చూస్తాయి’ అంటూ విమర్శకులకు ఘాటుగా జవాబిచ్చినప్పుడు ‘మిస్టర్ కూల్’లోని మరో రూపం బయటకు వస్తుంది. ఓటమికి కారణాలు విశ్లేషించమని కోరినప్పుడు ‘మీరు చనిపోవడం ఖాయమైనప్పుడు ఎలా చస్తే ఏం. అది కత్తితోనా, తుపాకీతోనా అని అడిగితే ఎలా’ అన్నప్పుడు అతనిలో వ్యంగ్యం వినిపిస్తుంది. కెరీర్ ఆరంభం నుంచి ధోని ధోనిలాగే ఉన్నాడు. ఎవరి కోసమో అతను మారలేదు. ధోని పేరు ప్రఖ్యాతులను పట్టించుకోలేదు. కానీ అవే అంగవస్త్రాల్లా అతని వెంట నడిచాయి. తాను బ్యాట్స్‌మన్‌గా ఆటలో ఎంతో నేర్చుకున్నాడు. అవసరానికి అనుగుణంగా తనను తాను మార్చుకున్నాడు. అంతే కానీ తన బ్యాటింగ్ శైలి బాగుండకపోవడం గురించి ఎప్పుడూ చింతించలేదు. కీపింగ్ శైలి కూడా ఇంటి ఆవరణలో తనకు తాను నేర్చుకున్నదే తప్ప కోచింగ్ సెంటర్లో కుస్తీలు పట్టడం వల్ల రాలేదు. కానీ అదే అతనికి కీర్తి కనకాదులు తెచ్చి పెట్టింది. నాయకత్వ ప్రతిభ కవచ కుండలాల్లా ధోనితో కలిసిపోయింది. ఫలితంగా ఎన్నో అరుదైన ఘనతలు, గొప్ప విజయాలు, మరెన్నో రికార్డులు. మహేంద్రుడి సారథ్యం మన క్రికెట్‌పై చెరగని ముద్ర వేసింది. 2019 జూలై 9న ప్రపంచకప్ సెమీఫైనల్లో ధోని తన ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఇప్పుటికి సరిగ్గా ఏడాదవుతోంది. ఆ తర్వాత అతను కనీసం స్థానిక మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. రేపు నిజంగా ఏదైనా సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి వస్తే ఈ సంవత్సరపు విరామాన్ని సెలక్టర్లు ఎలా చూస్తారు. ఎంత గొప్ప ధోని అయినా అసలు ఇంత కాలం ఆడకుండా అతడిని నేరుగా జాతీయ జట్టులోకి తీసుకురాగలరా అనేదానిపై కూడా తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. ఎమ్మెస్ తనంతట తానుగా ఏదైనా చెబితే తప్ప ఏదీ తెలీదు. అయినా ధోని నిజంగా తప్పుకోవాలనుకుంటే ముహూర్తాలు, పుట్టిన రోజు సందర్భాలు చూసుకునే రకం కాదు. భవిష్యత్తు ఎలా ఉన్నా క్రికెట్ అభిమానులకు ఎమ్మెస్ పంచిన మధుర జ్ఞాపకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరుగులు, గణాంకాల గురించి కాసేపు పక్కన పెడితే ‘ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్‌స్టయిల్’ అనే కేక మీ చెవుల్లో ఎప్పటికీ మారు మోగిపోతూనే ఉంటుంది. ఎంత గొప్ప ప్రయాణమైనా ఎక్కడో ఒక చోట ముగిసిపోవాల్సిందే. కానీ ఇప్పుడు ధోని క్రికెట్ పరుగు పిచ్ మధ్యలో ఆగిపోయింది. ఏదో ఒక ఎండ్‌కు చేరుకోకుండా ఒక రకమైన గందరగోళ స్థితిలో ఉంది. నిస్సందేహంగా మాహికి ఆటపై పిచ్చి ప్రేమ ఉంది. కానీ కనుచూపు మేరలో క్రికెట్ కనిపించని వేళ అతని ఆలోచనలేమిటో కనీసమాత్రంగా కూడా ఎవరూ ఊహించలేరు. తన ఆంతర్యం ఏమిటో బయట పెట్టడు. తన మౌన ముద్రను వీడి మాట్లాడడు. బాహ్య ప్రపంచానికి దూరంగా తన మానాన తాను ఫామ్ హౌస్‌లో కుటుంబంతో, పెంపుడు కుక్కలతో ఆడుకోవడం మినహా క్రికెట్ గురించి పట్టించుకోడు. ఐపీఎల్ కోసం మొదలు పెట్టిన సాధన కరోనా దెబ్బతో ఆగిపోయింది. అక్కడ ఆడితే అనుభవం కోసమైనా ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్‌కు వెళ్లవచ్చని అంతా అనుకున్నారు. కానీ అటు ఐపీఎల్ లేదు ఇటు ప్రపంచకప్ సంగతి దేవుడెరుగు. అనుభవాన్ని, అందించిన విజయాలను గౌరవిస్తూ గత సెలక్షన్ కమిటీ విశ్రాంతి అంటూనో, మరో కారణం చెప్పో అధికారికంగా వేటు మాట చెప్పలేకపోయింది. బోర్డులో మరెవరూ ధోని ఆట ముగిసిందని చెప్పే సాహసం చేయలేదు. గంగూలీ కూడా నాకు అతని భవిష్యత్తు గురించి అంతా తెలుసు అంటాడే తప్ప ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కచ్చితంగా చెప్పడు. కోచ్ రవిశాస్త్రితోనో, కోహ్లి నోటి వెంటనో ధోనికి ఆసక్తి తగ్గిందన్నట్లుగా పరోక్ష సంకేతాలే వస్తాయి తప్ప ఆట ముగిసిపోయిందని స్పష్టంగా ఎవరూ ఏమీ చెప్పరు. కొత్త సెలక్షన్ కమిటీకి ఇంకా ఇప్పటి వరకు పని చేయాల్సిన అవసరమే రాలేదు. -
మనమంతా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నాం
బెంగళూరు: ప్రజల ప్రాణాలను కబళిస్తోన్న కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రపంచమంతా సమష్టిగా పోరాడాలని భారత మాజీ కోచ్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పిలుపునిచ్చాడు. వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రస్తుత మన స్థితిని ‘టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్’గా అభివర్ణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త ఆధిక్యం సాధించామని సంబరపడొద్దని హెచ్చరించాడు. ‘ఈ మహమ్మారిని నిర్మూలించాలంటే మనందరం ఉమ్మడిగా పోరాడాల్సిందే. ఇదో టెస్టు మ్యాచ్‌లాంటిది. టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఉంటాయి. కానీ కరోనాకు ఎన్నో దశలున్నాయి. అందుకే ఇప్పటివరకు కరోనాపై సాధించిన విజయంతో సంతృప్తి చెందవద్దు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంకా గడ్డు సవాళ్లు ఎదురయ్యే అవకాశమున్నందున తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించామని సంబరపడొద్దు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోనే లభించే విజయం కాదు ఇది. అందుకే దీన్ని జయించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో మనమంతా కఠినంగా పోరాడాలి’ అని కుంబ్లే వివరించాడు. వైరస్ నియంత్రణ కోసం నిరంతరం పోరాడుతోన్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, అధికారులకు కుంబ్లే కృతజ్ఞతలు తెలిపాడు. ‘వారంతా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. హ్యాట్సాఫ్’ అని వారి సేవల్ని కొనియాడాడు. -
సచిన్ ‘షార్ట్ పిచ్’ ఆడలేనన్నాడు!
న్యూఢిల్లీ: దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఒక దశలో ఆస్ట్రేలియా గడ్డపై షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడట! దానికి ప్రత్యామ్నాయంగా ఇతర షాట్లపై దృష్టి పెట్టి పరుగులు రాబట్టాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో గతంలో సచినే స్వయంగా తనకు చెప్పినట్లు అతను గుర్తు చేసుకున్నాడు. ‘ఆస్ట్రేలియాలో ఆట గురించి నాతో సచిన్ ఒకసారి మాట్లాడాడు. ఇక షార్ట్ పిచ్ బంతులు ఆడటం తన వల్ల కాదని అర్థమైనట్లు అతను చెప్పాడు. అందుకే వికెట్ కీపర్, స్లిప్ మీదుగా ర్యాంప్ షాట్లు ఆడతానని నాకు వివరించాడు’ అని పొలాక్ గుర్తు చేసుకున్నాడు. అయితే భారత ఉపఖండానికి వచ్చే సరికి మాత్రం సచిన్‌ను అవుట్ చేసేందుకు తమ వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉండేవి కావని అతను అభిప్రాయ పడ్డాడు. ‘నాటి రోజుల్లో సచిన్‌ను అవుట్ చేయడం మన వల్ల అవుతుందా కాదా అని అనుకునేవాళ్లం. అతని కోసం ఏదైనా మంచి వ్యూహం రూపొందించే ప్రయత్నం చేయకుండా అతనే తప్పు చేస్తే బాగుండే దని కోరుకునేవాళ్లం’ అని పొలాక్ భారత స్టార్‌ను ప్రశంసించాడు. -
ధోని.. సైన్యంలో చేరిపోయాడు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన రెండు నెలల సైనిక శిక్షణను ప్రారంభించాడు. పారాచూట్ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని... బెంగళూరులోని బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేశాడు. అతడు ఈ నెల 31 నుంచి ఆగస్ట్ 19 వరకు బెటాలియన్‌తో ఉంటాడు. విక్టర్ ఫోర్స్‌లో భాగంగా దీని యూనిట్ కశ్మీర్ లోయలో విధులు నిర్వర్తిస్తోంది. సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక ధోని... పహారా, గార్డ్, సెంట్రీ పోస్ట్, దళంలో భాగమవడం తదితర బాధ్యతలు చేపడతాడు. ‘ధోనిలాంటి భారత క్రికెట్ దిగ్గజం తీసుకున్న నిర్ణయం.. దేశ యువతలో సైన్యంలో పని చేయాలన్న స్ఫూర్తిని కలిగిస్తుంది. అతడు కోరుకునేది కూడా అదే’ అని ఓ అధికారి తెలిపాడు. వైమానిక దళ విమానం నుంచి ఐదు పారాచూట్ జంపింగ్‌లు చేయడం ద్వారా ధోని 2015లోనే పారాట్రూపర్‌గా అర్హత సాధించాడు. -
గవాస్కర్ సలహాదారుడిగా దీపక్ పరేఖ్
న్యూఢిల్లీ: ఐపీఎల్-7 సీజన్ కొనసాగినంత కాలం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనగనున్న మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. తన కోసం ప్రత్యేక సలహాదారుణ్ణి నియమించుకున్నారు. హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ ఫరేఖ్ ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. ఐపీఎల్ పాలకమండలి సమావేశాలకు కూడా ఆయనప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో పరేఖ్‌కు ఉన్న సుదీర్ఘ అనుభవం కారణంగా రెండు నెలలపాటు లీగ్ వ్యవహారాలను సజావుగా నిర్వహించవచ్చనేది సన్నీ ఆలోచన. 2009లో సత్యం కంప్యూటర్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు పరేఖ్ ప్రత్యేక డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఆ కంపెనీని నిలబెట్టి ప్రశంసలు పొందారు. ‘ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ప్రత్యేక ఆహ్వానితుడిగా.. నాకు సలహాదారుడిగా ఉండేందుకు దీపక్ పరేఖ్ అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది . బీసీసీఐ-ఐపీఎల్ నాయకత్వ గ్రూప్‌లో ఆయనలాంటి వ్యక్తి చేరడం సమున్నతంగా ఉంది’ అని గవాస్కర్ కొనియాడారు. పరేఖ్ అనుభవం ఐపీఎల్‌ను చిరస్మరణీయంగా నిర్వహించేందుకు తోడ్పడుతుందని లీగ్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ అభిప్రాయపడ్డారు. అలాగే ఐపీఎల్లో భాగం కానుండడంతో పాటు సన్నీకి సలహాదారుడిగా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పరేఖ్ తెలిపారు.