మనమంతా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్నాం | Former India captain and coach Anil Kumble on Fight Against COVID-19 | Sakshi
Sakshi News home page

మనమంతా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్నాం

Published Sun, May 10 2020 5:36 AM | Last Updated on Sun, May 10 2020 5:36 AM

Former India captain and coach Anil Kumble on Fight Against COVID-19 - Sakshi

బెంగళూరు: ప్రజల ప్రాణాలను కబళిస్తోన్న కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రపంచమంతా సమష్టిగా పోరాడాలని భారత మాజీ కోచ్, మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే పిలుపునిచ్చాడు. వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రస్తుత మన స్థితిని ‘టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌’గా అభివర్ణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త ఆధిక్యం సాధించామని సంబరపడొద్దని హెచ్చరించాడు. ‘ఈ మహమ్మారిని నిర్మూలించాలంటే మనందరం ఉమ్మడిగా పోరాడాల్సిందే. ఇదో టెస్టు మ్యాచ్‌లాంటిది. టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఉంటాయి. కానీ కరోనాకు ఎన్నో దశలున్నాయి.

అందుకే ఇప్పటివరకు కరోనాపై సాధించిన విజయంతో సంతృప్తి చెందవద్దు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంకా గడ్డు సవాళ్లు ఎదురయ్యే అవకాశమున్నందున తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించామని సంబరపడొద్దు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతోనే లభించే విజయం కాదు ఇది. అందుకే దీన్ని జయించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో మనమంతా కఠినంగా పోరాడాలి’ అని కుంబ్లే వివరించాడు. వైరస్‌ నియంత్రణ కోసం నిరంతరం పోరాడుతోన్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, అధికారులకు కుంబ్లే కృతజ్ఞతలు తెలిపాడు. ‘వారంతా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. హ్యాట్సాఫ్‌’ అని వారి సేవల్ని కొనియాడాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement