సునీల్ గావస్కర్‌కు బీసీసీఐ షాక్?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) త్వరలోనే భారత మాజీ కెప్టెన్, లెజండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ సేవలకు రాంరాం చెప్పనుంది. ఆయనతో బోర్డుకు చాలాకాలంగా ఉన్న అనుబంధాన్ని తెంపుకోవాలని భావిస్తోంది. బీసీసీఐ-గావస్కర్ మధ్య ఉన్న కాంట్రాక్ట్ ఏప్రిల్ లేదా మే నెలలో ముగియనుంది. ఆయన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించకూడదని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.
బీసీసీఐ ఇంటర్నల్ పోడక్షన్ హౌజ్‌కు మోస్ట్ హై ప్రొఫైల్ కామెంటెటర్‌గా గావస్కర్ చాలాకాలంగా కొనసాగుతున్నాడు. బోర్డు వైఖరికి అనుగుణంగా కామెంటరీ వినిపించేందుకు ఈ యూనిట్ సొంత కామెంటెటర్లను నియమించుకుంటున్నది. అయితే ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ కామెంటెటర్‌గా కొనసాగేందుకు గావస్కర్ భారీమొత్తంలో ఫీజు అడుగుతుండటంతో బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
గత ఏడాది జరిగిన ఇండియా-దక్షిణాఫ్రికా సిరీస్‌కు కామెంటరీ వినిపించేందుకు ఏకంగా రూ. 90 లక్షలు గావస్కర్ తీసుకున్నారు. అదే సమయంలో ఇందుకు ఇద్దరు భారత మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లేకు రూ. 39.1 లక్షలు, సంజయ్ మంజ్రేకర్‌కు రూ. 36.49 లక్షలు బీసీసీఐ చెల్లించింది. ఫీజు విషయంలో మాత్రమే కాదు బీసీసీఐ వైఖరికి భిన్నంగా కొన్నిసార్లు గావస్కర్ తన అభిప్రాయాలు వెల్లడించడం కూడా తాజా నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అయితే, బోర్డు విషయంలో సన్నీ ఎప్పుడూ గట్టి మద్దతుదారుగా కొనసాగుతున్నాడని, తాజాగా ఎంపైర్ నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్) విషయంలో బోర్డు వైఖరిని సన్నీ గట్టిగా సమర్థించారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్‌లో గావస్కర్ అధికారిక కామెంటెటర్‌గా కనిపిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇకనుంచి ఆయనను సిరీస్ టు సిరీస్ ఆధారంగానే కామెంటెటర్‌గా నియమించుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. టీమిండియా డైరెక్టర్‌గా త్వరలో కాంట్రాక్టు ముగుస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి కూడా ఐపీఎల్ లో కామెంటెటర్‌గా తిరిగి తన విధులు చేపట్టే అవకాశముంది.