చండీలా, షాల భవితవ్యంపై నిర్ణయం వాయిదా
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులుగా తేలిన అజిత్ చండిలా, హికేన్ షాల భవితవ్యం ఈనెల 18వ తేదీన తేలనుంది. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నేతృత్వంలోని జ్యోతిరాధిత్య సింధియా, నిరంజన్ షాలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ చండీలా, షాలను విచారించి వారి నుంచి రాత పూర్వకంగా స్పందన సేకరించింది.
కాగా, ఈ కేసులో మూడో నిందితునిగా ఉన్న పాకిస్తాన్ అంపైర్ అసద్ రాఫ్ విచారణకు హాజరువుకావడానికి కొంత సమయం కోరిన నేపథ్యంలో చండీలా, షాలకు సంబంధించిన నిర్ణయాన్ని జనవరి 18కు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ తాజాగా పేర్కొంది. ఈ మేరకు క్రమశిక్షణా కమిటీ సోమవారం మరోసారి సమావేశమయ్యింది. అప్పట్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన 15 మంది ఫిక్సింగ్ బృందం అంపైర్ అసద్ రాఫ్ సాయంతో చండీలా, షాలను కలిశారనేది బీసీసీఐ ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే అసద్ ను మూడో నిందితునిగా చేర్చిన బీసీసీఐ అతనికి నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించడానికి అసద్ కొంత సమయం కోరడంతో చంఢీలా, షాల భవిష్యత్తుపై నిర్ఱయాన్ని కూడా మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు క్రమశిక్షణ కమిటీ పేర్కొంది.