
ప్రేమ దాస మైదానంలో సాధన చేస్తున్న భారత ఆటగాళ్లు
సాక్షి, స్పోర్ట్స్ : శ్రీ లంకలో శాంతిభద్రతలు అదుపుతప్పిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని విధించగా.. ప్రస్తుతం అక్కడ ఉన్న టీమిండియా ఆటగాళ్ల భద్రతపై అభిమానుల్లో కలవరపాటు మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాల నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది.
షెడ్యూల్ ప్రకారం యథావిధిగా మ్యాచ్ జరిగి తీరుతుందని బీసీసీఐ ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. ‘అల్లర్లు క్యాండీలోనే చెలరేగాయి. కొలంబోలో కాదు. అక్కడి అధికారులను సంప్రదించాకే పరిస్థితులు అదుపులో ఉన్నాయని నిర్ధారించుకున్నాం. ఆటగాళ్లకు పూర్తి భద్రత కల్పించినట్లు వారు తెలిపారు. నేటి మ్యాచ్ జరిగి తీరుతుంది’ అని పేర్కొంది.
శ్రీలంక వేదికగా నేటి(మంగళవారం) నుంచి ముక్కోణపు సిరీస్ (భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కొలంబోలోని ప్రేమ దాస మైదానంలో సాయంత్రం తొలి మ్యాచ్ జరగనుంది.