క్లాప్స్‌ కొట్టడానికి వీధుల్లోకి వస్తారా..? | Ben Stokes Slams Citizens For Taking To The Streets | Sakshi
Sakshi News home page

క్లాప్స్‌ కొట్టడానికి వీధుల్లోకి వస్తారా..?

Published Fri, Apr 17 2020 6:06 PM | Last Updated on Fri, Apr 17 2020 6:09 PM

Ben Stokes Slams Citizens For Taking To The Streets - Sakshi

లండన్‌: కరోనా మహమ్మారిపై యావత్‌ ప్రపంచం పోరాటం చేస్తుండగా, ఆ వైరస్‌ బారిన పడిన వారి కోసం అహర్నిశలు  శ్రమిస్తున్న హెల్త్‌ కేర్‌ సిబ్బందికి ప్రతీచోటా ఘనమైన సంఘీభావం తెలుపుతున్నారు. కొన్ని రోజుల క్రితం  వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారికి యావత్‌ భారతావని సంఘీభావం ప్రకటించింది. ఇప్పుడు ఇంగ్లండ్‌లో కూడా హెల్త్‌ సర్వీసుల్లోను సిబ్బందికి ఇదే తరహా సంఘీభావం తెలిపారు.  ఒక బ్రిడ్జిపై జనం నిలబడి క్లాప్స్‌తో డాక్టర్లను అభినందించారు.  అయితే అధిక సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇలా సంఘీభావం తెలపడాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తప్పుబట్టాడు.(ఏయ్‌ కోహ్లి.. చౌకా మార్‌!)

‘కరోనాపై పోరాటంలో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ల్లో ఉన్నవారికి అండగా నిలవాల్సిన సమయం ఇది. వారి సేవల్ని మరవలేము. కానీ ఇలా వీధుల్లోకి వచ్చి క్లాప్స్‌ కొట్టడం మాత్రం సరైనది కాదు. భౌతిక దూరం పాటించకుండా ఇలా గుమిగూడితే అది కచ్చితంగా సమర్ధనీయం కాదు. ఈ తరహాలో చేయడం వల్ల మిగతా ప్రజల్ని ప్రమాదంలో పడేసినట్లే అవుతుంది’ అని స్టోక్స్‌ పేర్కొన్నాడు.  ఒక లక్షకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులతో ఇంగ్లండ్‌ సతమతమవుతోంది. దాంతో అక్కడ కూడా సామాజిక దూరాన్ని తప్పనిసరి చేశారు. కానీ ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కడంతో స్టోక్స్‌ కాస్త కూల్‌గానే అసహనం వ్యక్తం చేశాడు. తాను కూల్‌గానే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోమని ప్రజలకు చెబుతున్నానని తెలిపాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే సోషల్‌ డిస్టెన్సింగ్‌ అనేది తప్పనిసరి అనే విషయం తెలుసుకోవాలన్నాడు. ప్రభుత్వం ఇచ్చిన సామాజిక దూరం పిలుపుకు ఆ దేశ క్రికెటర్లు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతీ ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలంటూ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా తాజా పరిణామం ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement