భూపతి కొత్త ఇన్నింగ్స్
భారత డేవిస్‌కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా నియామకం
న్యూజిలాండ్‌తో పోటీ తర్వాత బాధ్యతల స్వీకరణ
రోహన్ బోపన్నపై వేటు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వచ్చే ఏడాదిలో అతను భారత డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. 42 ఏళ్ల మహేశ్ భూపతి 1995లో క్రొయేషియాతో మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2011 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 35 డేవిస్ కప్ పోటీల్లో బరిలోకి దిగాడు. మొత్తం 55 మ్యాచ్‌లు ఆడి 35 మ్యాచ్‌ల్లో గెలిచి, 20 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా భూపతి మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎనిమిది, పురుషుల డబుల్స్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు.
ప్రస్తుత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్‌కు ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పుణేలో న్యూజిలాండ్‌తో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ చివరిది కానుంది. ఈ నెలాఖరుతోనే ఆనంద్ అమృత్‌రాజ్ ఒప్పందం గడువు పూర్తి కానుంది. అయితే 64 ఏళ్ల అమృత్‌రాజ్‌కు గౌరవసూచకంగా ఆయనను మరో రెండు నెలలపాటు ఈ పదవిలో కొనసాగించాలని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. ‘కెప్టెన్‌గా అందరికీ అవకాశం రావాలి. ఏ పదవీ శాశ్వతంగా ఏ ఒక్కరికీ సొంతం కాదు. మహేశ్ భూపతితో వ్యక్తిగతంగా మాట్లాడాం. కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తావా అని అడిగితే అతను అంగీకరించాడు. దాంతో ఈ మార్పు జరుగుతుంది. అమృత్‌రాజ్‌కు గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనను న్యూజిలాండ్‌తో పోటీకి కెప్టెన్‌గా కొనసాగిస్తున్నాం’ అని ఏఐటీఏ సెక్రటరీ జనరల్ హిరణ్మయ్ చటర్జీ తెలిపారు. కొత్త కోచ్ ఎంపిక విషయంలో మాత్రం ఏఐటీఏ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత కోచ్ జీషాన్ అలీనే కొంతకాలం కొనసాగించనున్నారు. కోచ్ పదవి కోసం సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, రమేశ్ కృష్ణన్‌తో ఏఐటీఏ ఎలాంటి సంప్రదింపులు చేయలేదని హిరణ్మయ్ స్పష్టం చేశారు.
మరోవైపు ఎస్‌పీ మిశ్రా, రోహిత్ రాజ్‌పాల్, నందన్ బాల్, జీషాన్ అలీ, హిరణ్మయ్ చటర్జీలతో కూడిన సెలెక్షన్ కమిటీ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసింది. భారత నంబర్‌వన్ డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్నపై వేటు పడింది. జోడీగా డబుల్స్ మ్యాచ్‌ల్లో లియాండర్ పేస్–రోహన్ బోపన్న ఆశించిన ఫలితాలు సాధించలేదని కమిటీ అభిప్రాయపడింది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ మైనేని–లియాండర్ పేస్ జంట అద్భుతంగా ఆడిందని ఈ కమిటీ గుర్తు చేసింది. బోపన్నను ఎంపిక చేస్తే సింగిల్స్‌లో మూడో ఆటగాడిని ఎంపిక చేసే అవకాశం చేజారుతుందని చీఫ్ సెలెక్టర్ మిశ్రా తెలిపారు. భారత డేవిస్‌కప్ జట్టు: లియాండర్ పేస్, యుకీ బాంబ్రీ, సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్, ప్రఘ్నేశ్ గుణేశ్వరన్.