మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. చివరి వన్డేలో తుది జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్(6/42) చెలరేగడంతో ఆసీస్ స్వల్పస్కోర్‌కు పరిమితమైన విషయం తెలిసిందే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు పేస్ బౌలర్ భవనేశ్వర్ కుమార్ అదిరే ఆరంభాన్ని అందించాడు. పదునైన బంతులతో ఆసీస బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందులకు గురిచేశాడు. ముఖ్యంగా ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్‌ను బోల్తాకొట్టించిన విధానం క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. (వైరల్: ధోని షార్ట్ రన్.. కనిపెట్టని అంపైర్లు!)
ఆసీస్ ఇన్నింగ్స్ 9వ ఓవర్ చివరి బంతిని భువీ పూర్తిగా క్రీజు బయటి నుంచి విసిరాడు. అది చూసి కంగుతిన్న ఫించ్.. ఆడకుండా పక్కకు తప్పుకున్నాడు. దీంతో అంపైర్ దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. ఇది భువీని కాస్త అసంతృప్తికి గురచేసింది. ఆ బంతి ఎలా డెడ్ బాల్ అవుతుంది..? అని అంపైర్‌ను ప్రశ్నించి.. అతని సమాధానం వినకుండానే బౌలింగ్ చేసేందుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాతి బంతికే ఫించ్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. నిజానికి ఈ ఎత్తుగడ మాజీ కెప్టెన్ ధోనీది కావడం విశేషం. గతంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ కూడా బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించడానికి ఇలాంటి బౌలింగే చేసేవాడు. ఇలా బౌలింగ్ చేయకూడదని క్రికెట్ నిబంధనల్లో కూడా ఎక్కడ లేదు. అయినప్పటికీ డెడ్ బాల్‌గా ప్రకటించడంపట్ల అంపైర్ల అవగాహనలేమి కనిపిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఈ సిరీస్‌లో అంపైర్లు పదేపదే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఆటగాళ్లతో పాటు, అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. (అంపైర్ తప్పిదమే కోహ్లిసేన కొంపముంచిందా?)
Comments
Please login to add a commentAdd a comment