సాక్షి, నాగ్‌పూర్: ‘చేయిలేకుంటేనేం.. చేవ ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయాలనుంది’ అని ఓ దివ్యాంగ క్రికెటర్ తన మనసులోని కోరికను వెల్లడించాడు. నాగ్‌పూర్‌కు చెందిన గురుదాస్ రౌత్ అనే దివ్యాంగ క్రికెటర్ పుట్టకతోనే ఎడమచేతి లేకుండా పుట్టాడు. ఎంతో మంది గురుదాస్‌ను దివ్యాంగుడివి, నీకేందుకు క్రికెట్ అంటూ నిరుత్సాహపరిచారు. కొందరైతే క్రికెట్ ఆడితే నీ కుడి చేతికూడా కోల్పోతావని హెచ్చరించారు. అయినా గురుదాస్ పట్టు వదలని విక్రమార్కుడులా క్రికెట్ ఆడుతూ మహారాష్ట్ర జట్టులో చోటు సంపాదించాడు. చివరి వన్డేకు టీమిండియా నాగ్‌పూర్‌కు రావడంతో ఎప్పటి నుంచో ఉన్న కోహ్లికి బౌలింగ్ చేయాలనే తన కోరికను వెల్లడించాడు. గతంలో మాస్టర్ టెండూల్కర్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేసిన ఈ ఒంటి చెతి క్రికెటర్.. డెవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టానని, పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ కూడా చేశానంటున్నాడు.
అయితే తనకు క్రికెట్ ఆడేవకాశం వచ్చిన సందర్భాన్ని గురదాస్ ఓ జాతీయ చానెల్‌తో ప్రస్తావించారు. ‘ఒక రోజు నా స్నేహితునితో లోకల్ గ్రౌండ్‌లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నాను. అయితే బ్యాట్స్‌మెన్ కొట్టిన ఓ భారీ షాట్ నావైపు దూసుకొచ్చింది. అప్పుడు నా చేతిలో టీ కప్పు ఉంది. నేను వెంటనే టీ కప్పు పక్కకు పడేసి ఒంటి చేత్తో క్యాచ్ పట్టాను. దీంతో ఆజట్టుకు కోచ్‌గా ఉన్న ఉత్తమ్ మిశ్రా నన్ను చేరదీసి ఎలాంటి ఉపకరణాలు లేకుండా క్రికెట్ మెళుకువలు నేర్పారు.’ అని చెప్పుకొచ్చాడు ఈ దివ్యాంగ క్రికెటర్. అప్పటి నుంచి గురుదాస్ రౌత్ మహారాష్ట్ర జట్టు తరుపున రాణిస్తున్నాడు. నెట్స్‌లో కోహ్లికి బౌలింగ్ చేసే అవకాశం కల్పించాలని ఈ సందర్బంగా గురుదాస్ కోరాడు.