నేను పతకం సాధించేవాడ్ని..కానీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్లోని బాక్సింగ్ పరిపాలన వ్యవస్థ ఎంతమాత్రం ఆశాజనకంగా లేదని బాక్సర్ మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ బాకింగ్స్ అసోసియేషన్(ఐబా) భారత బాక్సింగ్ను నిషేధించడంతోనే తాను పతకం గెలవలేకపోయానని మనోజ్ పేర్కొన్నాడు. భారత బాక్సింగ్ వ్యవస్థ చాలా గందరగోళంగా ఉందని, ఆ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలన్నాడు. ఈ విషయంలో మోదీ చొరవ తీసుకుని భారత్లో బాక్సింగ్ క్రీడను బతికించాలంటూ విజ్ఞప్తి చేశాడు.
రియో ఒలింపిక్స్ ప్రి కార్టర్ ఫైనల్లో తొలి రౌండ్ తనకు అనుకూలంగా కనిపించినా, ఆ రౌండ్ ఫలితంలో మాత్రం చాలా వ్యత్యాసం కనబడిందన్నాడు. రియోకు అర్హత సాధించడంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నా వెనుక ఎవరూ నిలబడలేదు. అసలు ఒలింపిక్స్ పోటీ దారుడిగానే పరిగణించలేదు. దాంతో పాటు ఆర్ధికసాయం కూడా అందలేదు. భారత బాక్సింగ్ను బ్రతికించాల్సిన పరిస్థితి మోదిపై ఉంది'అని మనోజ్ తెలిపారు. 2012 డిసెంబర్ 6న తొలిసారిగా బాక్సింగ్ సమాఖ్యపై ఐబా తాత్కాలిక సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే.