
మృత్యువుతో బాక్సింగ్ గ్రేట్ పోరాటం
లాస్ ఏంజిలెస్: బాక్సింగ్ గ్రేట్ మహ్మద్ అలీ (74) మృత్యువుతో పోరాడుతున్నాడు. శ్వాసకోస సంబంధిత సమస్యతో ఏరిజోనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలీ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు కుటుంబ సన్నిహితులు చెప్పారు. ఈ ప్రపంచ హెవీ వెయిట్ మాజీ చాంపియన్ జీవితం చరమాంకంలో ఉన్నట్టు తెలిపారు.
అలీ బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కుటుంబ సన్నిహితులు చెప్పారు. మరికొన్ని గంటలు బతకడం కూడా కష్టమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
20వ శతాబ్దంలో టాప్ స్పోర్ట్స్ మెన్లో ఒకడిగా అలీ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాక్సింగ్ ప్రపంచాన్ని ఎదురులేకుండా ఏలాడు. అభిమానులు 'ది గ్రేటెస్ట్'గా పిలుచుకునే అలీ 1981లో రిటైరయ్యాడు. రికార్డు స్థాయిలో 56 విజయాలు, కేవలం ఐదు పరాజయాలతో కెరీర్ ముగించాడు. మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్ను మూడుసార్లు సాధించాడు.
అలీ నాలుగు వివాహాలు చేసుకున్నాడు. మొత్తం తొమ్మిదిమంది సంతానం. అలీ కూతురు లైలా తండ్రి అడుగుజాడల్లో నడిచి బాక్సింగ్ను కెరీర్గా ఎంచుకుంది.