ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ బద్దలు
క్రైస్ట్ చర్చ్: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలైంది. తన చిట్టచివరి టెస్ట్ మ్చాచ్ ఆడుతోన్న కివీస్ విధ్వంసకారుడు మెకల్లమ్ 54 బంతుల్లో 100 పరుగులుచేసి 34 ఏళ్ల రికార్డులను తిరగరాశాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో బ్రెండన్ ఈ ఘనత సాధించాడు.
మొదట ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. లంచ్ విరామంకంటే ముందే న్యూజిలాండ్ స్కోరు 32/3. ఆ దశలో క్రీజ్ లోకి వచ్చిన మెకల్లమ్.. కంగారూలపై వీరప్రతాపం చూపాడు. ఎదుర్కొన్న తొలి ఓవర్లోనే 21 పరుగులు పిండుకుని షాన్ మార్ష్ కు చుక్కలుచూపాడు. మెకల్లం 37 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అంపైర్ లంచ్ విరామం ప్రకటించాడు. ఆట మళ్లీ మొదలయిన తర్వాత చూడాలీ.. బ్రెండన్ బాదుడే బాదుడు! సరిగ్గా 54 పరుగుల వద్ద 100 పరుగులు పూర్తిచేసుకున్న మెకల్లం.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ధీరుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు.
ఇంతకుముందు ఈ రికార్డు ఇద్దరిపేరిట ఉండేది. 1986లో విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్.. ఇంగ్లాండ్ పై వివ్.. 56 బంతుల్లో సెంచరీ కొట్టారు. ఆ తర్వాత 2014లో పాకిస్థానీ బ్యాట్స్ మన్ మిస్బాఉల్ హక్.. ఆస్ట్రేలియాపై 56 బంతుల్లోనే 100 పరుగులు చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు మెకల్లమ్ ఆ రికార్డులను తిరగరాశాడు.
96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌండరీ బాదిమరీ రికార్డు సెంచరీ చేసిన మెకల్లమ్ ఈ మ్చాచ్ లో రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 12వ సెంచరీకాగా, బ్యాటింగ్ లో అత్యధిక సిక్సులు(100) కొట్టిన వికెట్ కీపర్ గా మెకల్లమ్.. ఆడమ్ గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు. 79 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 145 పరుగులు చేసిన మెకల్లమ్ ఆరోవికెట్ గా వెనుదిరిగాడు.
జేమ్స్ అండర్సన్ 66 బంతుల్లో 72 పరుగులు) మెకల్లమ్ కు చక్కటి సహకారం అందించాడు. చివర్లో వాట్లింగ్(57 బంతుల్లో 58 పరుగులు) ధాటిగా ఆడటంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 370 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో లియాన్ 3, హాజిల్ వుడ్, పాటిన్సన్, బర్డ్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. మిచెల్ మార్ష్ కు ఒక వికెట్ దక్కింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది.