సాక్ష్యాల సేకరణ ఇంత నిర్లక్ష్యంగానా?
* ఐసీసీ ఏసీయూపై మెకల్లమ్ ధ్వజం
* ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌లో ఉపన్యాసం
లండన్: మ్యాచ్ ఫిక్సింగ్ విచారణలో భాగంగా సేకరించే సాక్ష్యాలపై ఐసీసీ ఏమాత్రం భద్రత, ప్రొఫెషనలిజం లేకుండా వ్యవహరిస్తోందని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ధ్వజమెత్తారు. సోమవారం ‘ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2008లో మ్యాచ్‌ను ఫిక్స్ చేసేందుకు కివీస్ మాజీ కెప్టెన్ క్రిస్ కెయిర్న్స్ పలుమార్లు తనను సంప్రదించారని ఐసీసీ అవినీతి వ్యతిరేక యూనిట్ (ఏసీయూ)కు మెకల్లమ్ సాక్ష్యమిచ్చారు.
అయితే మెకల్లమ్ చెప్పిన విషయాలు విచారణ జరుగుతుండగానే 2014లో డెయిలీ మెయిల్ పత్రికలో దర్శనమిచ్చాయి. ‘నేను ఆరోజు ఐసీసీ ఏసీయూకు చెప్పిన విషయాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. అయితే ఐసీసీ అధికారులు మాత్రం సాక్ష్యాల సేకరణలో ఏమాత్రం జాగ్రత్త లేకుండా యథాలాపంగా వ్యవహరించారు. పూర్తిగా ప్రొఫెషనలిజం కొరవడింది. నా మాటలన్నీ మీడియాలో రావడం నన్ను షాక్‌కు గురి చేసింది. ఇప్పటికీ అది ఎలా లీక్ అయ్యిందో ఐసీసీ నాకు చెప్పలేదు. ఎవర్నీ నమ్మలేకుండా ఉన్నాం.
ఇలా అయితే మున్ముందు ఏ ఆటగాడు ధైర్యంగా మీకు సాక్ష్యమిస్తాడు? క్రికెట్ అత్యున్నత బాడీపైనే ఆటగాళ్లకు విశ్వాసం సన్నగిల్లితే పరిస్థితేమిటి? నిజంగానే మీకు ఫిక్సింగ్ జాడ్యాన్ని తరిమికొట్టాలనుకుంటే బలమైన నిర్మాణం గల బాడీ అవసరం’ అని మెకల్లమ్ తేల్చి చెప్పారు.
ఆటగాళ్ల నమ్మకాన్ని చూరగొంటాం: ఐసీసీ
న్యూఢిల్లీ: ఫిక్సింగ్‌కు వ్యతిరేకంగా మెకల్లమ్ చొరవ అభినందనీయమని ఐసీసీ కొనియాడింది. అలాగే భవిష్యత్‌లో సాక్ష్యాల సేకరణలో ఆటగాళ్ల నమ్మకాన్ని చూరగొంటామని పేర్కొంది. అయితే మెకల్లమ్ సాక్ష్యాలను లీక్ చేసింది ఐసీసీలోని అధికారులు కాదని, బయటివారైనా కనుగొనడం కష్టసాధ్యమేనని అంగీకరించింది. మున్ముందు ఏసీయూను మరింత పకడ్బందీగా తయారుచేస్తామని తెలిపింది.