పుణే: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆతిథ్య జట్టుకు న్యూజిలాండ్ 231 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత ఓవర్లాడిన కివీస్ 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడిన లాథమ్(38), రాస్ టేలర్ (21) లు ఈ వన్డేలో త్వరగా ఔట్ కావడంతో కివీస్ స్వల్ఫ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు ఈ మ్యాచ్ లో సమష్టిగా రాణించి కివీస్ ను భారీ స్కోరు చేయకుండా సక్సెస్ అయ్యారు.
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నివ్వలేదు. గప్టిల్ (11), మున్రో (10) లను భారత పేసర్ భువీ ఔట్ చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) సిరీస్ లో మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ ను సరిదిద్దాలని ఆచితూచి ఆడిన లాథమ్(38) ను అక్సర్ పటేల్ బౌల్డ్ చేయగా, మరో కీలక ఆటగాడు రాస్ టేలర్ (21) పాండ్యా చేతికి చిక్కాడు. భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆదినుంచి పరుగుల కోసం కివీస్ చెమటోడ్చింది. నికోల్స్ (62 బంతుల్లో 42), డి గ్రాండ్ హోమ్మి(40 బంతుల్లో 41: 5 ఫోర్లు, 1 సిక్స్) క్రీజును అంటిపెట్టుకుని ఉండటంతో కివీస్ రెండొందల మార్కుకు చేరువైంది. వీరిద్దరూ ఔటయ్యాక చివర్లో టీమ్ సాధీ (22 బంతుల్లో 25 నాటౌట్) బ్యాట్ కు పని చెప్పడంతో కివీస్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. బౌలర బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, చహల్ చెరో రెండు వికెట్లు తీయగా, అక్సర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు ఒక్కో వికెట్ దక్కింది.
చహల్.. మంచి ఛాన్స్ మిస్
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా యువ సంచలనం యుజువేంద్ర చహల్ కు ఓ మంచి అవకాశం చేజారింది. ఇన్నింగ్స్ 44వ ఓవర్ వేసిన చహల్ తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టినా.. మూడో బంతికి వికెట్ సాధించకపోవడంతో హ్యాట్రిక్ నమోదు కాలేదు. ఆ ఓవర్లో తొలి బంతిని ఆడిన డి గ్రాండ్ హోమ్మి(40 బంతుల్లో 41: 5 ఫోర్లు, 1 సిక్స్) బుమ్రా క్యాచ్ తో ఔటయ్యాడు. దీంతో ఏడో వికెట్ రూపంలో నిష్క్రమించాడు.
ఆ మరుసటి బంతికి అప్పుడే క్రీజులోకొచ్చిన మిల్నేను వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు చహల్. బౌలర్ అప్పీల్ చేయగానే అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. అయితే మిల్నే రివ్యూకు వెళ్లాడు. కానీ బంతి ప్యాడ్లకే మొదట తాకినట్లు తేలడంతో కివీస్ రివ్యూను కోల్పోయింది. కివీస్ ప్లేయర్ మిల్నే నిరాశగా డ్రెస్పింగ్ రూము వైపు వెళ్లిపోయాడు. అందరూ చహల్ హ్యాట్రిక్ తీస్తాడా లేదా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే క్రీజులోకొచ్చిన టీమ్ సౌధీ తాను ఎదుర్కొన్న తొలి బంతిని డిఫెన్స్ ఆడటంతో చహల్ హ్యాట్రిక్ చాన్స్ చేజారింది. 46 ఓవర్లు ముగిసేసరికి కివీస్ 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment