ఫుణే : న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో తేలిపోయిన భారత బౌలర్లు రెండో వన్డేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో పర్యాటక జట్టు న్యూజిలాండ్ టాపార్డర్ వికెట్లను 58 పరుగులకే కోల్పోయింది.ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఆ ఓవర్ చివరి బంతికి రాస్ టేలర్ (21)ని ఔట్ చేశాడు. టేలర్ ఆడిన బంతిని ధోని క్యాచ్ పట్టడంతో కివీస్ ప్లేయర్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 58 పరుగులకే కివీస్ 4 వికెట్లు కోల్పోయింది.
అంతకుముందు టాస్ నెగ్గిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు ఫోర్లు కొట్టిన ఓపెనర్ మార్టిన్ గప్టిల్ వేగంగా పరుగులు చేసే క్రమంలో భువీ ఓవర్లో ఔటయ్యాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న మూడో ఓవర్లో నాలుగో బంతిని గప్టిల్ ఆడగా చురుగ్గా స్పందించిన కీపర్ ధోని క్యాచ్ పట్టడంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. గప్టిల్ ఔటయ్యాక క్రీజులోకొచ్చిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(3) మరోసారి విఫలమయ్యాడు. బుమ్రా వేసిన బంతిని విలియమ్సన్ అంచనా వేయలేకపోవడంతో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆ మరుసటి ఓవర్లో భువీ మరో ఓపెనర్ మున్రో(10)ని ఓ అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. అయితే గత మ్యాచ్ హీరోలు టామ్ లాథమ్(11 నాటౌట్), రాస్ టేలర్ (21) ఇన్నింగ్స్ ను సరిదిద్దే యత్నం చేశారు. 16వ ఓవర్లో పాండ్యా చేతికి టేలర్ చిక్కడంతో కివీస్ కష్టాల్లో పడింది.
Comments
Please login to add a commentAdd a comment