లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటికే టాప్-4లో చోటు దక్కించుకున్న భారత జట్టు ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. శనివారం స్థానిక హెడింగ్లే మైదానంలో శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు పాయింట్ల పట్టికలో మేలు చేస్తుంది. 13 పాయింట్లతో ఉన్న భారత జట్టు 15 పాయింట్లకు చేరుతుంది. అటు ఆస్ట్రేలియా (14) తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఓడితే కోహ్లి సేన టాప్‌కు చేరుతుంది. ఇదే జరిగితే సెమీస్‌లో మన జట్టుకు న్యూజిలాండ్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
మిడిల్ సత్తా చాటితేనే...
రోహిత్, రాహుల్, కోహ్లిలతో కూడిన భారత టాపార్డర్ జట్టుకు మంచి ఆరంభాలు అందించడంలో ముందుంటోంది. కానీ ఆ తర్వాతే అసలు సమస్య ప్రారంభమవుతోంది. వారందించే స్కోరును భారీగా మలిచేందుకు మిడిలార్డర్‌లో ప్రయత్న లోపం కనిపిస్తోంది. అనూహ్యంగా నెంబర్ 4లో బ్యాటింగ్‌కు దిగుతోన్న రిషభ్ పంత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించాడు. కానీ సుదీర్ఘంగా క్రీజులో నిలవలేకపోతున్నాడు. డెత్ ఓవర్లలో భారత్ నుంచి వేగంగా పరుగులు రాకపోవడం ఆందోళనకరం. శ్రీలంక మ్యాచ్ ద్వారా మిడిల్ ఆర్డర్ సమస్య తీరుతుందని భారత్ యోచిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మహ్మద్ షమీ, చహల్‌కు విశ్రాంతి ఇచ్చి వారి స్థానాల్లో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పించింది. ఈ వరల్డ్‌కప్‌లో జడేజా ఆడబోయే తొలి మ్యాచ్ ఇది.
మరొకవైపుసెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక గత మ్యాచ్‌లో విండీస్‌ను ఓడించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన యువ అవిష్క ఫెర్నాండో అదే జోరు సాగించాలని జట్టు ఆశిస్తోంది. లంక ఓపెనర్లలో కరుణరత్నే ఒక మ్యాచ్ మినహా బాగానే ఆడగా, కుశాల్ పెరీరా కూడా మూడు అర్ధ సెంచరీలతో మెరుగైన ప్రదర్శన చేశాడు.
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు 158 మ్యాచ్‌లు జరిగాయి. 90 మ్యాచ్‌ల్లో భారత్... 56 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. 11 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. 3 మ్యాచ్‌ల్లో భారత్... 4 మ్యాచ్‌ల్లో శ్రీలంక నెగ్గాయి. మరో మ్యాచ్ రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment