చార్లెస్ లెక్‌లెర్క్
స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్: ఈ సీజన్‌లో తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న ఫెరారీ జట్టుకు మరో అవకాశం లభించింది. ఆ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ ఈ సీజన్‌లో మూడోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో 21 ఏళ్ల లెక్‌లెర్క్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 42.519 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. నేడు జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
ఫెరారీకే చెందిన సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఈ సీజన్‌లో గ్రిడ్‌లోని తొలి రెండు స్థానాలు ఫెరారీకి లభించడం తొలిసారి. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, బొటాస్ వరుసగా మూడు, నాలుగు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 రేసులు జరగ్గా... హామిల్టన్ ఎనిమిది రేసుల్లో, బొటాస్, మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండేసి రేసుల్లో విజేతగా నిలిచారు. బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి, ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలలోనూ లెక్‌లెర్క్ పోల్ పొజిషన్ సాధించాడు. అయితే ప్రధాన రేసులో అతను మూడో స్థానంలో (బహ్రెయిన్), రెండో స్థానంలో (ఆస్ట్రియా) నిలిచాడు. మూడో ప్రయత్నంలో అతను టైటిల్ సాధిస్తాడా లేదా వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment