కూలిడ్జ్: కరీబియన్ పర్యటనలో టెస్టు సిరీస్ ముంగిట టీమిండియా కీలక బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (156 బంతుల్లో 89 బ్యాటింగ్; 7 ఫోర్లు, సిక్స్)కు చక్కటి సన్నాహకం లభించింది. పుజారాతో పాటు మరో బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (115 బంతుల్లో 68; 8 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో వెస్టిండీస్ ‘ఎ’తో శనివారం ఇక్కడ ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. టీ విరామ సమయానికి జట్టు 62 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్... ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (12) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. దూకుడు చూపిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (46 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కెప్టెన్ అజింక్య రహానే (1) తీవ్రంగా నిరాశపర్చాడు. 6 బంతులు మాత్రమే ఆడిన అతడు కార్టర్ (2/24) బౌలింగ్‌లో కీపర్ హామిల్టన్‌కు క్యాచ్ ఇచ్చాడు. 53/3తో కష్టాల్లో పడిన ఈ స్థితిలో పుజారా, రోహిత్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. రోహిత్ సహజ శైలిలో ధాటిగా ఆడాడు. చాలాకాలం తర్వాత మైదానంలో దిగిన పుజారా తన ఫామ్‌ను చాటుకున్నాడు. అతడికి తోడుగా తెలుగు ఆటగాడు హనుమ విహారి (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment