
రాజ్‌కోట్: క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఖాతాలో మరో రికార్డు చేరింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధికంగా డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా రికార్డు నెలకొల్పాడు. జార్ఖండ్ జట్టుతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో గురువారం అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పుజారా(204; 28 ఫోర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. కెరీర్‌లో అతడికిది 12వ డబుల్ సెంచరీ. విజయ్ మర్చంట్ (11) పేరిట ఉన్న రికార్డును ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ బద్దలు కొట్టాడు. సునీల్ గవాస్కర్, విజయ్ హజారే, రాహుల్ ద్రవిడ్ తమ కెరీర్‌లో పదేసి డబుల్ సెంచరీలు సాధించారు. వీరిలో మూడు ట్రిఫుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ పుజారానే కావడం విశేషం. అతడితో సమానంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాత్రమే మూడు ట్రిఫుల్ సెంచరీలు బాదాడు.
టెస్టు ఆటగాడిగా ముద్రపడిన పుజారా ఇప్పటివరకు 51 టెస్టులు ఆడి 48.32 సగటుతో 4,107 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 15 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 206 పరుగులు. 5 వన్డేలు మాత్రమే ఆడి కేవలం 51 పరుగులు సాధించాడు. ఒక్క అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లోనూ అతడికి ఆడే ఛాన్స్ దక్కలేదు. ఇప్పటివరకు 158 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పుజారా 41 సెంచరీలతో 12,538 పరుగులు చేశాడు.