చిలీ శుభారంభం
కోపా అమెరికా కప్
శాంటియాగో : సొంతగడ్డపై ఆతిథ్య జట్టు చిలీ టైటిల్ వేటను విజయంతో ప్రారంభించింది. కోపా అమెరికా కప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో చిలీ 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్‌ను ఓడించి శుభారంభం చేసింది. ఆట 67వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను అర్తురో విడాల్ గోల్‌గా మలచగా... 84వ నిమిషంలో ఎడుఆర్డో వర్గాస్ గోల్‌తో చిలీ విజయం ఖాయమైంది. ఆట ఆరంభం నుంచే చిలీ గోల్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈక్వెడార్ రక్షణపంక్తి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండటంతో తొలి అర్ధభాగంలో చిలీ ఖాతా తెరువలేకపోయింది.
రెండో అర్ధభాగంలో చిలీ తమ ప్రయత్నాలను కొనసాగించింది. ఆఖరికి 67వ నిమిషంలో ‘డి బాక్స్’లో విడాల్‌ను ప్రత్యర్థి ఆటగాడు మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ చిలీకి పెనాల్టీ కిక్‌ను ప్రకటించారు. ఈ అవకాశాన్ని విడాల్ సద్వినియోగం చేసుకొని చిలీకి తొలి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత శాంచెజ్ అందించిన పాస్‌ను వర్గాస్ లక్ష్యానికి చేర్చడంతో చిలీ ఖాతాలో రెండో గోల్ చేరింది. దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగే ఈ మెగా ఈవెంట్ 99 ఏళ్ల చరిత్రలో చిలీ ఇప్పటివరకు విజేతగా నిలువలేదు. నాలుగుసార్లు ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.