అయ్యో... బ్రెజిల్!
* రిఫరీ తప్పిదంతో తొలి రౌండ్‌లో నిష్ర్కమణ
* కోపా అమెరికా కప్ క్వార్టర్స్‌లో పెరూ
ఫాక్స్‌బరో (యూఎస్): కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్ జట్టును దురదృష్టం వెంటాడింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు పాలిట రిఫరీ విలన్‌గా మారారు. ప్రత్యర్థి జట్టు ఆటగాడి చేతికి తాకి నెట్‌లోనికి వెళ్లిన బంతిని గోల్‌గా ప్రకటించడంతో ఈ ప్రఖ్యాత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో పెరూ ఈ వివాదాస్పద గోల్‌తో 1-0తో నెగ్గింది.
31 ఏళ్లలో బ్రెజిల్‌పై పెరూకిదే తొలి విజయం. మ్యాచ్ తొలి అర్ధభాగం బ్రెజిల్ హవా కనిపించింది. అయితే ద్వితీయార్ధం 74వ నిమిషంలో బ్రెజిల్‌కు ఊహించని షాక్ తగిలింది. బై లైన్ నుంచి పెరూ ఆటగాడు ఆండీ పోలో ఇచ్చిన క్రాస్‌ను రౌల్ రూడియాజ్ గోల్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో బంతి అతడి చేతిని తాకి గోల్‌పోస్టులోకి వెళ్లింది. అనూహ్యంగా ఉరుగ్వేకు చెందిన రిఫరీ ఆండ్రెస్ కున్హా దీన్ని గోల్‌గా ప్రకటించడంతో బ్రెజిల్ ఆటగాళ్లు నిశ్చేష్టులయ్యారు.
రిఫరీతో వాగ్వాదానికి దిగి తమ నిరసన వ్యక్తం చేశారు. రీప్లేలోనూ ఈ విషయం స్పష్టంగా కనిపించినప్పటికీ రిఫరీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇంజ్యూరీ సమయం (90+2)లో బ్రెజిల్‌కు స్కోరును సమం చేసే అవకాశం వచ్చినా విఫలమైంది. గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన పెరూ క్వార్టర్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు బ్రెజిల్ ఆడిన రెండింటిలో ఒకటి గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా క్వార్టర్స్‌కు చేరేది. కానీ ఓటమితో టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది.
క్వార్టర్స్‌కు చేరిన ఈక్వెడార్
ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (యూఎస్): గ్రూప్ ‘బి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో ఈక్వెడార్ 4-0తో హైతీని ఓడించింది. ఎన్నెర్ వాలెన్సియా (11), అయోవి (20), నొబోవా (57), ఆంటోనియో వాలెన్సియా (78) గోల్స్ చేశారు. దీంతో ఈ గ్రూపులో రెండో స్థానం పొందిన ఈక్వెడార్ క్వార్టర్స్‌లో 16న అమెరికాతో తలపడనుంది.