ఆటగాళ్లతో పాటు పోలీసు కూడా..
చోరీలకు విరుగుడుగా చైనా ఆలోచన
బీజింగ్: రియో డి జనీరోలో ఎక్కడ చూసినా స్వైరవిహారం చేస్తున్న దొంగల నుంచి తమ ఆటగాళ్లను కాపాడుకునేందుకు చైనా సరికొత్త ఆలోచన చేసింది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 416 మంది అథ్లెట్లతో కూడిన భారీ బృందం బ్రెజిల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వీరిలో కొందరిపై చోరులు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. దీంతో ఓ పోలీసును వారికి రక్షణగా చైనా పంపించింది. షావో వీమిన్ అనే పేరుగల అధికారి ఇప్పటికే రియోకు చేరుకున్నారు. తాత్కాలిక పోలీస్ కమ్యూనికేషన్ అధికారి హోదాలో ఉండే తను స్థానిక పోలీసులతో అనుసంధానంగా వ్యవహరిస్తారు.
కానీ నేరుగా పోలీసు విధులు మాత్రం నిర్వహించరు. బ్రెజిల్‌కు రాగానే తన కంప్యూటర్‌ను పోగొట్టుకున్నానని చైనా హర్డిల్ ఆటగాడు షి డొంగ్‌పెంగ్ ఆరోపించగా మిగతా చైనా పర్యాటకులపై కూడా అక్కడి నేరగాళ్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. దీంతో గేమ్స్‌ను వీక్షించేందుకు వచ్చే తమ దేశస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇదివరకే చైనా హెచ్చరించింది. వీధుల్లో నడిచేటప్పుడు ఫోన్లలో మాట్లాడకూడదని, విలువైన సామాన్లను గదిలోనే భద్రపరుచుకోవాలని సూచించింది.