‘సెలక్షన్' గందరగోళం
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ఎంపిక వాయిదా
ముంబై: ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడే భారత జట్టు ఎంపిక వాయిదా పడింది. జట్టు ఎంపిక కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం మధ్యాహ్నం సమావేశమైంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ... పాటిల్ సమావేశం ముగియకుండానే అరగంట ముందే బయటకు వచ్చేశారు. అలాగే ఈ సమావేశంలో చర్చించే ఎజెండా గురించి ఇద్దరు సెలక్టర్లు భిన్నంగా చెప్పారు.
లంకతో చివరి రెండు వన్డేలకు జట్టు ఎంపిక కోసం సమావేశమవుతున్నామని ఒక సెలక్టర్ చెబితే... ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక కోసమని మరో సెలక్టర్ చెప్పారు. జట్టు ఎంపిక వాయిదా పడిందని తెలుపుతూ... నిర్దిష్ట కారణం చెప్పకుండా బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరిగి సెలక్టర్లు ఎప్పుడు సమావేశమయ్యేదీ చెప్పలేదు. దీంతో ఈ వ్యవహారం గందరగోళంగా మారింది.
జట్టు ఎంపికకు తొందర లేదు: సంజయ్ పటేల్
శ్రీలంకతో జరిగే మూడు వన్డేల అనంతరమే చివరి రెండు వన్డేలకు జట్టును ఎంపిక చేస్తామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వివరణ ఇచ్చారు.
కారణాలు ఏమిటి?
బోర్డు నుంచి నిర్ధిష్టంగా కారణాలు బయటకు రాకపోయినా... మీడియాలో మాత్రం రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా రెండు వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు మూడో ఓపెనర్‌గా కర్ణాటక యువ ఆటగాడు లోకేశ్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలని కొందరు సెలక్టర్లు భావిస్తే... మరికొందరు మాత్రం సెహ్వాగ్‌ను తీసుకుందామని ప్రతిపాదించారు.
దీంతో వాడివేడిగా చర్చ సాగి సమావేశం వాయిదా పడినట్లు వినిపిస్తోంది. మరోవైపు సుప్రీం కోర్టులో ఈ నెల 10న స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ ఉన్నందున... అది పూర్తయ్యేవరకూ ఆగటం మేలని సెలక్టర్లు భావించినట్లూ కథనాలు వస్తున్నాయి. ముద్గల్ కమిటీ నివేదికలో ఎవరైనా ఆటగాళ్ల పేర్లుంటాయనే భయం కూడా సెలక్టర్లలో ఉన్నట్లు వినిపిస్తోంది.