ఆసీస్‌ను పడగొడతారా?
ప్రపంచకప్‌లో నేడు భారత మహిళల కీలక పోరు
బ్రిస్టల్: మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్ అవకాశాలను పటిష్ట పరుచుకునేందుకు భారత జట్టు కీలక సమరానికి సిద్ధమవుతోంది. తమ అప్రతిహత విజయాలకు దక్షిణాఫ్రికా అడ్డుకట్ట వేసిన అనంతరం నేడు పటిష్టమైన ఆస్ట్రేలియాతో మిథాలీ సేన తలపడనుంది.వరుసగా నాలుగు విజయాల అనంతరం ఎదురైన ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోయి తిరిగి గెలుపుబాట పట్టాలని భారత్ భావిస్తోంది. మరోవైపు సరిగ్గా భారత్‌లాంటి పరిస్థితే ఆసీస్‌కు ఉంది. ఈ జట్టు కూడా వరుసగా నాలుగు విజయాలు సాధించినా తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భంగపడింది. దీంతో ఈ రెండు జట్లు వీలైనంత త్వరగా తమ ఓటములను వెనక్కినెట్టి సెమీస్ రేసులో ముందుండాలని చూస్తున్నాయి.
దూకుడుగా ఆడాల్సిందే..
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. 17 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే టాప్ ఆర్డర్ దూకుడును ప్రదర్శించి మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గించాల్సిన అవసరం ఉంది. మరోసారి భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే తడబాటుకు లోను కాకుండా ఆడితేనే ఫలితం ఉంటుంది.
పటిష్టంగా ఆసీస్...
ఈ ప్రపంచకప్‌లో ఆసీస్ జోరు బలంగా సాగుతోంది. వారికి ఎదురైన ఓటమి కూడా కేవలం మూడు పరుగుల తేడాతోనే ఉండడం గమనించాలి. కెప్టెన్ మెగ్ లానింగ్ జోరును అడ్డుకోవాలంటే భారత బౌలర్లు శ్రమించాల్సిందే. ఎలిస్ పెర్రీ ఆల్‌రౌండ్ ప్రతిభ జట్టుకు కీలకం కానుంది. పేసర్లు విల్లాని, షట్ స్పిన్నర్లు జొనాసెన్, బీమ్స్‌లను ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌గానే నిలవనుంది.
ఆసీస్‌పై ఫలితం తేలిన 41 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది 8 మాత్రమే.
► మ. గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం