Sanjay Patel
-
బ్లాంక్ చెక్ ఇచ్చి ఔదార్యం చాటుకున్న పాండ్యా!
వడోదర : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ జాకోబ్ మార్టిన్(46) కుటుంబానికి సహాయం చేసేందుకు భారత ఆటగాళ్లు ముందుకు వస్తున్నారు. టీమిండియా యువ ఆల్‌రౌండర్, బరోడా జట్టు ఆటగాడు కృనాల్ పాండ్యా మార్టిన్ చికిత్స కోసం ఏకంగా బ్లాంక్ చెక్ రాసిచ్చి ఔదార్యం చాటుకున్నాడు. బరోడా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మార్టిన్.. గతేడాది డిసెంబరు 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మార్టిన్ ఊపిరితిత్తులు, లివర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అతడు వడోదరలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకుగానూ రోజుకు 70 వేల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. జాకోబ్ మార్టిన్ కాగా మార్టిన్ చికిత్స కోసం ఇప్పటికే బీసీసీఐ 5 లక్షల రూపాయలు అందించగా.. బరోడా క్రికెట్ అసోసియేషన్ 3 లక్షల రూపాయల సాయం ప్రకటించింది. ఇక టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీతో పాటుగా జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా మార్టిన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో మార్టిన్ పరిస్థితి గురించి తెలుసుకున్న కృనాల్ పాండ్యా... ‘ఆయన చికిత్స కోసం ఈ బ్లాంక్ చెక్ రాసిస్తున్నా. దయచేసి లక్ష రూపాయలకు తగ్గకుండా చెక్‌పై రాయండి’ అని బరోడా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సంజయ్ పటేల్‌తో వ్యాఖ్యానించినట్లుగా ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది. ఇక బరోడా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జాకోబ్ మార్టిన్ 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. మొత్తం పది వన్డేలు ఆడిన మార్టిన్ 158 పరుగులు చేశాడు. -
‘యూనియన్ లీడర్’ వస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లోని ఓ రసాయనిక ఫ్యాక్టరీలో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రాణాంతకమైన పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించడానికి ‘యూనియన్ లీడర్’ అనే బాలీవుడ్ సినిమా మన ముందుకు వస్తోంది. గుజరాత్లో ఏడేళ్లు, ఆ తర్వాత కెనడాలో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేసిన సంజయ్ పటేల్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇదే ఆయన మొదటి చిత్రం. యూనియన్ నాయకుడుగా రాహుల్ భట్, ముఖ్యపాత్రలో తిలోత్తమ షోమ్ నటించిన ఈ చిత్రం జనవరి 21వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. అప్పుడప్పుడు రక్తం కక్కుకుంటూ బాధ పడుతున్న ఓ రసాయనిక ఫ్యాక్టరీ కార్మికులు తమకు సరైన భద్రతా పరిస్థితులను కల్పించడంతోపాటు ఇతర హక్కుల కోసం పోరాటం చేయడమే ఇతివత్తంగా ఈ సినిమాను తెరకెక్కించానని పటేల్ తెలిపారు. ఇది కల్పిత గాథే అయినప్పటికీ తాను ఇంజనీరుగా పనిచేసిన కాలంలో ఫ్యాక్టరీలలో ఎదురైన అనుభవాలను మిలితం చేసి ఇందులో చూపించేందుకు ప్రయత్నించానని ఆయన చెప్పారు. నాడు తాను యాజమాన్యం తరఫున ఇంజనీరుగా పనిచేసినప్పటికీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందించానని, వాటిని యజామన్యం దష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని, అప్పటికీ ఇప్పటికీ గుజరాత్ రసాయనిక ఫ్యాక్టరీల్లో పరిస్థితులు మారలేదని, అందుకనే అలాంటి యజమాన్యాలకు కనువిప్పు కలిగించే అంశాలతో ఈ సినిమాను పూర్తి చేశానని ఆయన చెప్పారు. రసాయన ఫ్యాక్టరీల్లో వెలువడే ప్రమాదకర వాయువుల వల్ల వచ్చే క్యాన్సర్‌తో ఏటా దేశంలో పది లక్షల మంది మరణిస్తున్నారన్నది వైద్యుల అంచనా. -
‘యూనియన్ లీడర్’ వస్తున్నారు
-
ఫోన్ ట్యాపింగ్ కు రూ.14 కోట్లు ఇచ్చారు!
న్యూఢిల్లీ:ఈ ఏడాది మార్చిలో క్రికెట్ సీనియర్ సభ్యుల సాధారణ వార్షిక సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు బీహార్ క్రికెట్ అసోసియేషన్ (గుర్తింపులేదు) కార్యదర్శి ఆదిత్య వర్మ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందులో బీసీసీఐ మాజీ కార్యదర్శి సంజయ్ పటేల్ పాత్ర ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ఆ వివాదంపై ఒక కమిటీ వేసి నిజాలను వెలికి తీయాల్సిన ఉందని మోదీకి తెలిపారు. బోర్డు అధికారులు పాల్గొన్న ఆ సమావేశంలో సంజయ్ పటేల్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని పేర్కొన్నారు. సంజయ్ పటేల్ రూ.14 కోట్లను లండన్ కు చెందిన ప్రైవేట్ సంస్థకు చెల్లించి మరీ ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఈమెయిల్స్ హ్యాక్ చేసినట్లు ఆ లేఖలో తెలిపారు. లండన్ కు చెందిన ఓ డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ వివాదం బయటపడినట్లు ఆదిత్యవర్మ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆ వ్యాఖ్యలను సంజేల్ పటేల్ కొట్టిపారేశారు. దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని.. తాను వేరే కారణాలతోనే ఆ డబ్బును వినియోగించినట్లు సంజయ్ స్పష్టం చేశారు. -
‘సెలక్షన్' గందరగోళం
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ఎంపిక వాయిదా ముంబై: ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడే భారత జట్టు ఎంపిక వాయిదా పడింది. జట్టు ఎంపిక కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం మధ్యాహ్నం సమావేశమైంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ... పాటిల్ సమావేశం ముగియకుండానే అరగంట ముందే బయటకు వచ్చేశారు. అలాగే ఈ సమావేశంలో చర్చించే ఎజెండా గురించి ఇద్దరు సెలక్టర్లు భిన్నంగా చెప్పారు. లంకతో చివరి రెండు వన్డేలకు జట్టు ఎంపిక కోసం సమావేశమవుతున్నామని ఒక సెలక్టర్ చెబితే... ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక కోసమని మరో సెలక్టర్ చెప్పారు. జట్టు ఎంపిక వాయిదా పడిందని తెలుపుతూ... నిర్దిష్ట కారణం చెప్పకుండా బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరిగి సెలక్టర్లు ఎప్పుడు సమావేశమయ్యేదీ చెప్పలేదు. దీంతో ఈ వ్యవహారం గందరగోళంగా మారింది. జట్టు ఎంపికకు తొందర లేదు: సంజయ్ పటేల్ శ్రీలంకతో జరిగే మూడు వన్డేల అనంతరమే చివరి రెండు వన్డేలకు జట్టును ఎంపిక చేస్తామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వివరణ ఇచ్చారు. కారణాలు ఏమిటి? బోర్డు నుంచి నిర్ధిష్టంగా కారణాలు బయటకు రాకపోయినా... మీడియాలో మాత్రం రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా రెండు వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు మూడో ఓపెనర్‌గా కర్ణాటక యువ ఆటగాడు లోకేశ్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలని కొందరు సెలక్టర్లు భావిస్తే... మరికొందరు మాత్రం సెహ్వాగ్‌ను తీసుకుందామని ప్రతిపాదించారు. దీంతో వాడివేడిగా చర్చ సాగి సమావేశం వాయిదా పడినట్లు వినిపిస్తోంది. మరోవైపు సుప్రీం కోర్టులో ఈ నెల 10న స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ ఉన్నందున... అది పూర్తయ్యేవరకూ ఆగటం మేలని సెలక్టర్లు భావించినట్లూ కథనాలు వస్తున్నాయి. ముద్గల్ కమిటీ నివేదికలో ఎవరైనా ఆటగాళ్ల పేర్లుంటాయనే భయం కూడా సెలక్టర్లలో ఉన్నట్లు వినిపిస్తోంది. -
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై ఒత్తిడి తెచ్చాం
రెండో ఐసీసీని ఏర్పాటు చేస్తామని బెదిరించాం ఐసీసీలో మార్పులపై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వ్యాఖ్య హైదరాబాద్: ఐసీసీలో సమూల మార్పులు చేయడంతో పాటు ఆదాయంలో భారత్‌కు అధిక వాటా ఇవ్వాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై బాగా ఒత్తిడి తెచ్చామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. వీటికి ఒప్పుకోకపోతే సమాంతరంగా రెండో ఐసీసీని ఏర్పాటు చేస్తామని వాళ్లను బెదిరించామన్నారు. ‘ఈ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. ఈ మార్పులకు చాలా మంది ఒప్పుకోలేదు. భారత్‌కు సరైన వాటా ఇవ్వకుంటే మేం బలవంతంగా రెండో ఐసీసీని రన్ చేస్తామని హెచ్చరించాం. ఇలా చెప్పిన తర్వాత ఇంగ్లండ్, ఆసీస్‌లు దిగి వచ్చాయి. జూన్ 27 నుంచి ఐసీసీలో కొత్త విధానాలు అమల్లోకి వస్తాయి. మా తీర్మానంపై పది సభ్య దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు’ అని పటేల్ పేర్కొన్నారు. శ్రీనివాసన్ అమాయకుడు ఈనెలాఖరులో కొత్త ఐసీసీ తొలి చైర్మన్‌గా ఎన్.శ్రీనివాసన్ బాధ్యతలు తీసుకోవడాన్ని ఎవరూ అడ్డుకోలేరని పటేల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోబోదన్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణకు సంబంధించి శ్రీని అమాయకుడని చెప్పారు. ‘బాధ్యతలు స్వీకరించేందుకు మేమిద్దరం మెల్బోర్న్ వెళ్తున్నాం. గత నాలుగు నెలల నుంచి అన్ని సమస్యలను పరిష్కరించాం. కొత్త ఆర్థిక విధానాలకు అన్ని దేశాల బోర్డులను ఒప్పించాం. ఇక నుంచి ఐసీసీలో భారత్‌దే పెద్ద పాత్ర. గతంలో 4 శాతం వాట మాత్రమే దక్కేది. కానీ ఇప్పుడు రాబోయే ఎనిమిదేళ్లలో ఐసీసీకి సుమారుగా 2.8 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. ఇందులో భారత్‌కు 700 నుంచి 800 మిలియన్ డాలర్ల ఆదాయం దక్కుతుంది’ అని పటేల్ వెల్లడించారు. విదేశీ పర్యటనల షెడ్యూల్‌ను 2020 వరకు సిద్ధం చేశామన్నారు. ఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని భారత్‌కు తరలించే అవకాశాలను కూడా పరిశీలిస్తామన్నారు. ఐపీఎల్-7 బాగా విజయవంతమైందని చెప్పిన సంజయ్ గతంలో కంటే ఈసారి టికెట్ల ఆదాయం భారీగా పెరిగిందన్నారు. మీడియా విషయంలో బోర్డుపై వస్తున్న విమర్శలపై స్పందించిన పటేల్... ఈ విభాగాన్ని పూర్తిగా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. -
ముంబైలో కుదరదు.. బెంగళూరులోనే!
ముంబై: ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే టీ20 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను బెంగళూర్ లోనే నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఐపీఎల్7 ఫైనల్ మ్యాచ్ ను ముంబైలో నిర్వహించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్క్షప్తిని గవర్నింగ్ కౌన్సిల్ తోసిపుచ్చింది. శనివారం జరిగిన సమావేశంలో బెంగళూరులోనే ఐపీఎల్ ఫైనల్ నిర్వహించడానికి గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. ముంబైలో మ్యాచ్ నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులున్నాయని.. పది గంటల తర్వాత టపాసులు కాల్చేందుకు ముంబై పోలీసుల అనుమతి ఉందని ఎంసీఏ లేఖ రాసింది. అన్ని అనుమతులను శరద్ పవార్ తీసుకున్నారని.. అయితే బెంగళూరులోనే నిర్వహించడానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందనే విషయం తమకు తెలియదని ఎంసీఏ కార్యదర్శి నితిన్ దలాల్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ కౌన్సిల్ సమావేశం
ముంబై: ఐపీఎల్-7లో భాగంగా యూఏఈలో మ్యాచ్‌లు ముగిసిన నేపథ్యంలో గవర్నింగ్ కౌన్సిల్ శనివారం సమావేశం కానుంది. యూఏఈలో మ్యాచ్‌ల నిర్వహణపై సమీక్షతో పాటు పలు ఇతర విషయాలపైనా చర్చించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఈ నెల 28న చెన్నైలో జరగాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌ను ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) స్టేడియానికి మార్చే అవకాశమున్నట్లు పటేల్ పేర్కొన్నారు. ఈ విషయమై శనివారం నాటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఈ నెల 27న క్వాలిఫయర్-1 మ్యాచ్ యథావిధిగా చెన్నైలోనే జరుగుతుందన్నారు. -
సంజయ్ పటేల్‌కు షాక్
బరోడా: బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్‌కు తమ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) మేనేజింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న పటేల్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆదివారం జరిగిన బీసీఏ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పటేల్‌తో పాటు మరో ముగ్గురిపై కూడా వేటు పడింది. ఇటీవల జరిగిన బీసీఏ ఎన్నికల్లో చిరాయు అమిన్ గ్రూపు మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. అయితే సంజయ్ పటేల్ సంయుక్త కార్యదర్శిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు. కానీ ఎన్నికల అనంతరం పటేల్‌తో పాటు మరో నలుగురు కమిటీ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఉద్వాసన పలకాలని డిమాండ్లు వినిపించాయి. ఓ సమావేశంలో కమిటీ సభ్యులు ఇదే అంశాన్ని లేవనెత్తగా బీసీఏ అధ్యక్షుడు సమర్జిత్ గైక్వాడ్ తన వీటో పవర్‌ను ఉపయోగించి అడ్డుకున్నారు. అయితే ఈ విషయంలో అధ్యక్షుడికి ఎక్కువ అధికారాలున్నాయా.. కమిటీకా.. తేలేందుకు లీగల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. మేనేజింగ్ కమిటీకి అనుకూలంగా లీగల్ అభిప్రాయం రావడంతో సంజయ్ పటేల్‌ని తొలగించారు. -
ఎనిమిదేళ్లలో రూ. 3700 కోట్లు
భారీగా పెరగనున్న బీసీసీఐ ఆదాయం కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడి ఎన్నికల షెడ్యూల్ తర్వాతే ఐపీఎల్ వేదికపై నిర్ణయం భువనేశ్వర్: ఐసీసీలో సమూల మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేసిన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)... ఆదాయాన్ని కూడా భారీ స్థాయిలో పెంచుకోనుంది. రాబోయే ఎనిమిదేళ్ల (2015-23)లో దాదాపు 600 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 3724 కోట్లు) సంపాదించనుందని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఐసీసీలోని మూడు మేజర్ కమిటీల్లో భారత్ శాశ్వాత సభ్య దేశంగా ఉంటుందని శుక్రవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన వెల్లడించారు. ‘చాలా కాలంగా 68 శాతం ఆదాయాన్ని ఐసీసీకి భారత్ సమకూర్చిపెడుతోంది. అందులో నుంచి 4 శాతం మాత్రమే మనం తీసుకుంటున్నాం. కానీ ప్రస్తుత ప్రణాళికలు అమలైతే రాబోయే రోజుల్లో బోర్డు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇకపై 21 శాతం మేర ఆదాయం మనకే దక్కుతుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఐసీసీ ఆదాయంలో 75 శాతం మాత్రమే పది సభ్య దేశాలకు సమానంగా పంచేవారు. మిగతాది అసోసియేట్ దేశాలకు వెళ్లేది. ఇతర కార్యక్రమాల వల్ల భారత్‌కు అదనంగా మరో 4 శాతం దక్కేది’ అని పటేల్ వివరించారు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనల్లో భారత్ ఘోర వైఫల్యంపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీ పాండోవ్.. శ్రీనివాసన్‌ను వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రశ్నించారు. దీని గురించి చర్చించకుండా ఐపీఎల్ అంశాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై స్పందించిన శ్రీనివాసన్ మాట్లాడుతూ... దీనిపై విచారణకు ఆదేశించామని, జట్టు సహాయక సిబ్బంది, కోచ్‌తో కూడా మాట్లాడానని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాతే... ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఐపీఎల్ తుది వేదికను ఖరారు చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ వెల్లడించారు. ‘అవసరమైతే కొన్ని మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహిస్తాం. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, యూఏఈలు ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఐపీఎల్ చైర్మన్ బిస్వాల్ తెలిపారు. ఏదేమైనా దీనిపై త్వరలోనే తుది నిర్ణయానికి వస్తాం’ అని శ్రీని వ్యాఖ్యానించారు. ఒకవేళ మే 15 వరకు ఎన్నికల తంతు పూర్తయితే... మొదటి రౌండ్ మ్యాచ్‌లను యూఏఈ, బంగ్లాలలో నిర్వహించి మిగతా లీగ్‌ను తిరిగి భారత్‌లోనే జరపనున్నట్లు సమాచారం. మే నెల మొత్తం ఎన్నికల ప్రక్రియ కొనసాగితే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశాలున్నాయి. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లను పారదర్శకంగా నిర్వహిస్తామని బిస్వాల్ తెలిపారు. ఇందుకోసం ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను 70 శాతం మేర అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. -
మెట్టు దిగిన బీసీసీఐ!
ముంబై: ప్రపంచ క్రికెట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుత్తాధిపత్యం సాగితేనేమి... భారత జట్టు అద్భుత ఆటతో వరుస విజయాలు సాధిస్తేనేమి... మార్కెట్ పరిస్థితి ముందు మాత్రం తగ్గాల్సి వచ్చింది. భారత టీమ్ స్పాన్సర్షిప్ కోసం బిడ్లు వేసేందుకు నిర్ణయించిన కనీస ధరను బీసీసీఐ ఏకంగా 40 శాతం తగ్గించింది. తాజాగా కనీస ధరను ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కోసం రూ. 1.5 కోట్లుగా నిర్ణయించింది. గతంలో ఇది రూ. 2.5 కోట్లుగా ఉంది. టీమిండియాతో సహారా ఒప్పందం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో బోర్డు కొత్త బిడ్లను ఆహ్వానించింది. ‘ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వివరణ ఇచ్చినా... మరి కొన్ని నిబంధనల సడలింపు చూస్తే పరిస్థితి అర్ధమవుతుంది. బిడ్డర్ సంస్థ కనీస విలువను రూ.1000 కోట్లనుంచి రూ.100 కోట్లకు, బోర్డుకు ఇవ్వాల్సిన డిపాజిట్‌ను రూ.45 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించారు! ఇటీవలి ఐపీఎల్ బెట్టింగ్, ఫిక్సింగ్ వివాదాలే దీనికి కారణమని తెలుస్తోంది. స్పాన్సర్షిప్ బిడ్లను ఈ నెల 9న తెరుస్తారు. -
రిటైర్మెంట్ గురించి మాస్టర్‌తో చర్చించలేదు: బోర్డు
బ్యాటింగ్ గ్రేట్ సచిన్ తన చరిత్రాత్మక 200వ టెస్టు అనంతరం రిటైరవ్వాల్సిందిగా సూచించలేదని బీసీసీఐ స్సష్టం చేసింది. సచిన్‌కు ఈ మేరకు సంకేతాలు పంపినట్టు వచ్చిన వార్తలను బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ గురువారం తోసిపుచ్చారు. రిటైర్మెంట్ విషయం గురించి బోర్డు మాస్టర్‌తో ఎప్పుడూ చర్చించలేదని తెలిపారు. ఈ అంశం అతని నిర్ణయానికే వదిలేసినట్టు చెప్పారు. సచిన్ గొప్ప క్రికెటరని, రిటైర్మెంట్ నిర్ణయం అతనితో పాటు సెలెక్టర్లకు సంబందించిన విషయమని పటేల్ అన్నాడు. దీనికి సంబంధించి మాస్టర్ ఏ నిర్ణయం తీసుకున్నా బోర్డుకు సమ్మతమేనని పేర్కొన్నారు. మాస్టర్ రికార్డు టెస్టు మ్యాచ్ ఆడిన అనంతరం వీడ్కోలు చెబితే మంచిదని కొందరు బోర్డు సభ్యులు అభిప్రాయపడినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో పైవిధంగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచురించవద్దని మీడియాకు సూచించారు. కాగా వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో సచిన్ రికార్డు టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. -
బీసీసీఐ అధ్యక్షునిగా మరోమారు శ్రీనివాసన్ ఎన్నిక
బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షునిగా మూడో సారి నారాయణస్వామి శ్రీనివాసన్ ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనివాసన్‌కు పోటీగా నిన్న సాయంత్రం వరకు ఎవరు బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో శ్రీనివాసన్ ఎన్నిక లాంఛనప్రాయమైంది. దాంతో శ్రీనివాస్ ఎన్నికైనట్లు బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. అంతేకాకుండా దక్షిణాదిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, హైదరాబాద్, గోవాలలోని క్రికెట్ సంఘాలు మద్దతివ్వడంతో శ్రీనివాసన్ అధ్యక్షునిగా ఎన్నిక నల్లెరు మీద నడకలా సాగింది. బీసీసీఐ కార్యదర్శిగా సంజయ్ పటేల్ ఎన్నికయ్యారు. అలాగే హర్యాన క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిరుధ్ చౌదరి బీసీసీఐ కోశాధకారిగా నియమితులయ్యారు. ఐదుగురు బీసీసీఐ ఉపాధ్యక్షులు కూడా ఎన్నికయ్యారు. శ్రీనివాసన్ రేపు బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించవలసి ఉంది. అయితే బీహార్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిత్య వర్మ పిటిషన్ వేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత శ్రీనివాసన్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.