వడోదర : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ జాకోబ్ మార్టిన్(46) కుటుంబానికి సహాయం చేసేందుకు భారత ఆటగాళ్లు ముందుకు వస్తున్నారు. టీమిండియా యువ ఆల్‌రౌండర్, బరోడా జట్టు ఆటగాడు కృనాల్ పాండ్యా మార్టిన్ చికిత్స కోసం ఏకంగా బ్లాంక్ చెక్ రాసిచ్చి ఔదార్యం చాటుకున్నాడు. బరోడా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మార్టిన్.. గతేడాది డిసెంబరు 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మార్టిన్ ఊపిరితిత్తులు, లివర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అతడు వడోదరలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకుగానూ రోజుకు 70 వేల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సమాచారం.
జాకోబ్ మార్టిన్
కాగా మార్టిన్ చికిత్స కోసం ఇప్పటికే బీసీసీఐ 5 లక్షల రూపాయలు అందించగా.. బరోడా క్రికెట్ అసోసియేషన్ 3 లక్షల రూపాయల సాయం ప్రకటించింది. ఇక టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీతో పాటుగా జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా మార్టిన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో మార్టిన్ పరిస్థితి గురించి తెలుసుకున్న కృనాల్ పాండ్యా... ‘ఆయన చికిత్స కోసం ఈ బ్లాంక్ చెక్ రాసిస్తున్నా. దయచేసి లక్ష రూపాయలకు తగ్గకుండా చెక్‌పై రాయండి’ అని బరోడా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సంజయ్ పటేల్‌తో వ్యాఖ్యానించినట్లుగా ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది. ఇక బరోడా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జాకోబ్ మార్టిన్ 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మొత్తం పది వన్డేలు ఆడిన మార్టిన్ 158 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment