ఎదురులేని భారత్
కొలంబో: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జింబాబ్వేతో సోమవారం జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (5/19) ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 28.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం భారత జట్టు 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 61 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. వేద కృష్ణమూర్తి (16 బంతుల్లో 29; 6 ఫోర్లు) అవుటవ్వగా... మోనా (21 నాటౌట్; 4 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (11 నాటౌట్) అజేయంగా నిలిచారు. ‘సూపర్ సిక్స్’ దశ మ్యాచ్‌ల్లో భారత జట్టు ఈనెల 15న దక్షిణాఫ్రికాతో; 17న బంగ్లాదేశ్‌తో; 19న పాకిస్తాన్‌తో తలపడుతుంది.