
శత వసంతాల....కోపా పిలుస్తోంది
ప్రపంచ ఫుట్‌బాల్‌కు ఇది పండుగ వేళ... ఘన చరిత్ర కలిగిన కోపా అమెరికా కప్ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక టోర్నమెంట్ ఇది. గెలిస్తే చరిత్రలో పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది. అందుకే బ్రెజిల్,
అర్జెంటీనా, ఉరుగ్వే, చిలీ... ఇలా అమెరికా ఖండాల దేశాల క్రీడాకారులంతా సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమయ్యారు. ఇక ప్రతి రోజూ వినోదమే. మెస్సీ డ్రిబ్లింగ్... రోడ్రిక్స్ హెడర్స్... హల్క్ హంగామా... నేటి నుంచే..!
ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత పాపులర్ టోర్నీలలో ఒకటైన ‘కోపా అమెరికా’కు వందేళ్ల చరిత్ర ఉంది. 1916లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో ఉరుగ్వే విజేతగా నిలిచింది. ఆరంభంలో కేవలం దక్షిణ అమెరికా ఖండపు దేశాలకే (కాన్మెబాల్) ఈ టోర్నీ పరిమితం కాగా... 1993నుంచి ఉత్తర అమెరికా ఖండపు జట్లకు (కాన్‌కెకాఫ్) కూడా చోటు కల్పించారు. కోపా అమెరికా కప్ మొదట్లో ఏడాదికి ఒకసారి, మధ్యలో రెండేళ్లకు, తర్వాత మూడేళ్లకు... వేర్వేరు కారణాలతో చాలా సార్లు క్రమం తప్పుతూనే నిర్వహించారు. గత మూడు టోర్నీలు (2007, 2011, 2015) మాత్రం అనుకున్నట్లుగా సరిగ్గా నాలుగేళ్ల వ్యవధి ప్రకారం జరిగాయి.
వాస్తవానికి ఈ ఏడాది కోపా కప్ నిర్వహించకూడదు. అయితే టోర్నమెంట్ ప్రారంభమై సరిగ్గా వందేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని మరోసారి ప్రత్యేక టోర్నీని జరుపుతున్నారు. సాధారణంగా 12 జట్లతో నిర్వహించే ఈ టోర్నీలో సంఖ్యను పెంచి 16 జట్లకు అవకాశం కల్పించారు. ఇందులో దక్షిణ అమెరికానుంచి 10, ఉత్తర అమెరికానుంచి 6 జట్లు బరిలోకి దిగుతున్నాయి. 2019 నుంచి మళ్లీ 12 జట్లే ఆడతాయి. కోపా కప్‌కు యూఎస్‌ఏ తొలిసారి ఆతిథ్యం ఇస్తుండటం విశేషం కాగా... తొలిసారి దక్షిణ అమెరికా బయట ఈ టోర్నీ జరుగుతోంది. జూన్ 3 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నీకి సంబంధించిన మరిన్ని విశేషాలు...
గ్రూప్- ఏ
అమెరికా, కొలంబియా, కోస్టారికా, పరాగ్వే
అమెరికా: ఆతిథ్య హోదాలో అమెరికా ఉత్సాహంగా కనిపిస్తున్నా... జట్టు ముందుకెళ్లటం అంత సులువు కాదు. జెర్మైన్ జోన్స్ జట్టులో స్టార్ ఆటగాడు. ఇటీవల సంచలన రీతిలో దూసుకొచ్చిన 17 ఏళ్ల క్రిస్టియాన్ ప్యూలిసిక్ తన సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్నాడు.
కొలంబియా: గ్రూప్ విజేతగా నిలిచే అవకాశం ఉంది. గత టోర్నీలో ఈ జట్టు ఒకే గోల్ చేసి ఘోరంగా విఫలమైనా... ఆ తర్వాత కొత్త వ్యూహాలతో ఆటను మార్చుకుంది. రోడ్రిగ్స్‌పై జట్టు బాధ్యత ఉంది.
కోస్టారికా: ఇటీవలి కాలంగా వేగంగా ఎదిగిన ఈ జట్టు తమ అత్యుత్తమ దశలో ఉంది. రియల్ మాడ్రిడ్‌ను చాంపియన్‌గా నిలపడంతో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ కీలర్ నవాస్ ఇప్పుడు తన జాతీయ జట్టుకు పెట్టని గోడగా మారాడు.
పరాగ్వే: సంచలనాలు సాధించే సత్తా ఉన్న జట్టు. గత కొన్నేళ్లలో కోపాలో మంచి రికార్డు ఉంది. డిఫెన్స్ జట్టు బలం. గోంజాలెజ్ జట్టులో స్టార్ ఆటగాడు.
గ్రూప్- బి
బ్రెజిల్, ఈక్వెడార్, హైతీ, పెరూ
బ్రెజిల్: గత ఏడాది పెనాల్టీస్‌లో పరాగ్వే చేతిలో ఓడి నిష్ర్కమించింది. తమ స్థాయిలో రాణించలేకపోతున్న ఆ జట్టు ఫామ్ కొన్నాళ్లుగా ఆందోళనకరంగా ఉంది. అయితే గ్రూప్ దశను దాటడంలో సమస్య ఉండకపోవచ్చు. నేమార్ అందుబాటులో లేకపోవడంతో విలియాన్‌పై బాధ్యత పెరిగింది. 19 ఏళ్ల కొత్త కుర్రాడు గాబ్రియెల్ బార్బోసాపై ఎన్నో ఆశలున్నాయి.
పెరూ: సీనియర్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ బాగా లేదంటూ కోచ్ దాదాపు అంతా కుర్రాళ్లతోనే కొత్త జట్టును సిద్ధం చేయడంతో ఈ జట్టు అంచనాలకు అందడం లేదు. వీరంతా రాణిస్తే నాకౌట్‌కు వెళ్లవచ్చు. పావ్లో గ్యురెరోతో పాటు క్రిస్టియాన్ క్యూవా కీలక ఆటగాళ్లు.
ఈక్వెడార్: నాకౌట్ చేరేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. బ్రెజిల్‌కు కూడా షాక్ ఇచ్చే స్థితిలో మంచి ఫామ్‌లో కనిపిస్తోంది. ఎన్నర్ వెలెన్సియా, ఆంటోనియో వెలెన్సియా, జెఫర్సన్ మోంటిరో అత్యంత ప్రతిభావంతులు.
హైతీ: ఈ గ్రూప్‌లో బలహీన జట్టు. ఏ ప్రత్యర్థినీ భయపెట్టే పరిస్థితిలో లేదు. ఇటీవల వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో కూడా ఘోరంగా విఫలమైంది.
గ్రూప్- సి
మెక్సికో, ఉరుగ్వే, జమైకా, వెనిజులా
ఉరుగ్వే: ఈ గ్రూప్‌నుంచి అగ్రస్థానం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కోపా కప్‌లో హవా నడిపించిన ఈ జట్టు మరో టైటిల్‌పై గురి పెట్టింది. నిస్సందేహంగా సారెజ్ ఈ టీమ్‌లో సూపర్ స్టార్. ఈ సీజన్‌లో 59 గోల్స్ చేసిన అతను ప్రపంచ ఫుట్‌బాల్‌లో అందరికంటే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అయితే గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు అతను దూరమైనా... నాకౌట్ దశకు సిద్ధంగా ఉంటాడు.
మెక్సికో: నాకౌట్‌కు చేరగల స్థాయి ఉన్న జట్టు. జట్టు పటిష్టంగా ఉండటంతో పాటు అమెరికాలో మ్యాచ్‌లు జరుగుతున్నందున మెక్సికోకు అభిమానులనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించనుంది. జేవియర్ హెర్నాండెజ్ ఇప్పుడు అందరిలోకి స్టార్.
వెనిజులా: గత ఆరు నెలలుగా టీమ్ దశా దిశా లేకుండా గొడవలతో సాగుతోంది. ఆటగాళ్లంతా కలిసి కోచ్‌పై తిరుగుబాటు చేశారు. ఈ పరిస్థితుల్లో ఏమీ ఆశించలేం.
జమైకా: గత టోర్నీలో అగ్రశ్రేణి జట్టు ఉరుగ్వేతో మ్యాచ్ డ్రా చేసుకోవడంతో పాటు డిఫెండింగ్ చాంపియన్ చిలీని వార్మప్ మ్యాచ్‌లో ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సారి కూడా కనీసం ఒక సంచలనాన్ని ఆశిస్తోంది. వెస్ మోర్గాన్ ఇటీవల ఈపీఎల్‌లో లెస్టర్‌ను విజేతగా నిలిపాడు.
గ్రూప్- డి
అర్జెంటీనా, చిలీ, పనామా, బొలీవియా
అర్జెంటీనా: 2015లో చిలీ చేతిలో ఫైనల్లో ఓడినా...ఈ సారి కూడా మళ్లీ ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. మెస్సీలాంటి దిగ్గజం తనదైన శైలిలో ఆడితే అర్జెంటీనాకు తిరుగుండదు. వెన్ను నొప్పితో బాధపడుతున్నా.... గతంలో ఒక్కసారి కూడా జాతీయ జట్టు తరఫున టైటిల్ గెలవని మెస్సీ, ఈ సారి దానిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
చిలీ: డిఫెండింగ్ చాంపియన్. కొత్త కోచ్ నేతృత్వంలో కొత్త టీమ్ సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం కనీసం సెమీ ఫైనల్ వరకూ వెళ్లొచ్చు. సాంచెజ్ గత ఏడాది అద్భుత ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు.
బొలీవియా: చివరి స్థానం దక్కకుండా కనీసం పనామానైనా ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోచ్‌తో విభేదాలతో సీనియర్ ఆటగాళ్లు రొనాల్డ్ రాల్డ్స్, మార్సెలో మార్టిన్స్ అనూహ్యంగా తప్పుకోవడం జట్టును మరింత బలహీనంగా మార్చింది.
పనామా: ఆఖరి స్థానంలో నిలిచినా... ఇది తమకు ఏమీ అవమానకరం కాదని ఆ జట్టు చెబుతోంది. కోపా అమెరికా టోర్నీ మొత్తంలో బలహీనమైన టీమ్.
► 32 టోర్నీలో జరిగే మొత్తం మ్యాచ్‌లు
► 10 అమెరికాలో వేదికలు. కనీసం 50 వేల సామర్థ్యం ఉన్నవాటినే బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేశారు.
► 368 బరిలోకి దిగుతున్న మొత్తం ఆటగాళ్లు
► 44 ఇప్పటి వరకు జరిగిన టోర్నీలు
► 9 అర్జెంటీనా అత్యధికంగా 9 సార్లు ఆతిథ్యమిచ్చింది
► 15 ఉరుగ్వే అత్యధికంగా టైటిల్స్ గెలిచింది.
చిలీ డిఫెండింగ్ చాంపియన్
భారత కాలమానం ప్రకారం కోపా అమెరికా కప్ షెడ్యూల్
మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్ నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు నాకౌట్ (క్వార్టర్ ఫైనల్)కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీస్, ఫైనల్ నిర్వహిస్తారు. ప్రతీ గ్రూప్‌లో పటిష్టమైన జట్లతో పాటు సంచలనాలు సృష్టించే సత్తా ఉన్న టీమ్‌లు కూడా ఉన్నాయి.